Begin typing your search above and press return to search.

తెలంగాణం : లేజీ పట్టణాలు, యాక్టివ్ గ్రామాలు

తాజాగా జరిగిన పోలింగ్ లో అందుబాటులోని ఓటింగ్ సరళని గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లే బెటరనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   2 Dec 2023 7:45 AM GMT
తెలంగాణం : లేజీ పట్టణాలు, యాక్టివ్ గ్రామాలు
X

తాజాగా జరిగిన పోలింగ్ లో అందుబాటులోని ఓటింగ్ సరళని గమనిస్తే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లే బెటరనిపిస్తోంది. మామూలుగా జనాల్లో ఉండే అభిప్రాయం ఏమిటంటే నగరాలు, పట్టణాల్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ కాబట్టి సామాజిక చైతన్యం ఎక్కువని. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న వాళ్ళు తక్కువగా ఉంటారు కాబట్టి చైతన్యం కూడా తక్కువగానే ఉంటుందని అనుకుంటారు. నిజానికి సామాజిక చైతన్యానికి చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళని తేడా ఉండదు. ఈ విషయం తాజాగా జరిగిన ఎన్నికలు నిరూపించాయి.

గ్రామీణ ప్రాంతాల్లో జనాలు సామాజికబాధ్యతగా ఎక్కువమంది పోలింగ్ లో పాల్గొన్నారు. తాజా లెక్కల ప్రకారం సుమారు 75శాతం ఓటింగ్ నమోదైనా ఇందులో ఎక్కువ షేర్ గ్రామీణ ప్రాంతాల్లో ఉండే నియోకవర్గాలవే. మునుగోడు నియోజకవర్గంలో 91.5 శాతం పోలింగ్ జరిగింది. అలాగే పాలేరులో 90.2 శాతం, ఆలేరులో 90.1 శాతం ఓటింగ్ నమోదైంది. మరో 47 నియోజకవర్గాల్లో ఓటింగ్ 80 శాతం దాటింది. 70 శాతం పోలింగ్ దాటిన నియోజకవర్గాలు 38 ఉన్నాయి.

60 శాతం పోలింగ్ దాటిన సెగ్మెంట్లు ఏడు, 50 శాతం ఓటింగ్ దాటిన నియోజకవర్గాలు 11 ఉన్నాయి. వీటిల్లో అత్యధికంగా గ్రామీణ ప్రాంత నియోజకవర్గాలే ఉన్నాయి. ఇక అత్యంత తక్కువ ఓటింగ్ నమోదైన నియోజకవర్గాలు హైదరాబాద్ జిల్లా పరిధిలోనే ఉన్నాయి. యాకుత్ పురా నియోజకవర్గంలో నమోదైన ఓటింగ్ 39.69 శాతం. మలక్ పేట, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, కంటోన్మెంట్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం 50 కూడా టచ్ కాలేదు.

నిజానికి పై నియోజకవర్గాలన్నీ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనివే. గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాలంటే బాగా చదువరులు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే ఉద్యోగులుంటారు. ప్రత్యేకించి లక్షల సంఖ్యలో ఉంటే ఐటి ఉద్యోగులు కూడా ఎక్కువే. మరింత మంది ఉన్నత విద్యావంతులు, చదువుకున్న వాళ్ళు, ఉన్నతస్ధాయి ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళున్న నియోజకవర్గాల్లో ఓటింగ్ ఎందుకు ఇంత తక్కువగా నమోదైంది ? నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం అనటంలో సందేహంలేదు. మొత్తానికి గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లే చాలా బెటరనిపించారు.