Begin typing your search above and press return to search.

న్యూస్ టాప్ సర్వే... తెలంగాణ ఎన్నికల నివేదిక వైరల్!

ఈ సమయలో తాజాగా న్యూస్ టాప్ తెలంగాణ స్టేట్ సర్వే నివేదిక తెరపైకి వచ్చింది. ఈ సర్వే ఫలితాలు తెలంగాణలో అధికార బీఆరెస్స్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టొచ్చని చెబుతున్నాయి.

By:  Tupaki Desk   |   22 Nov 2023 3:19 PM GMT
న్యూస్  టాప్  సర్వే... తెలంగాణ ఎన్నికల నివేదిక వైరల్!
X

తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు సమయం దగ్గరపడుతుంది. ఇప్పటికే పార్టీలన్నీ ప్రచారాలతో హోరెత్తించేస్తున్నాయి. ఇక ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ సమయలో తాజాగా న్యూస్ టాప్ తెలంగాణ స్టేట్ సర్వే నివేదిక తెరపైకి వచ్చింది. ఈ సర్వే ఫలితాలు తెలంగాణలో అధికార బీఆరెస్స్ మరోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టొచ్చని చెబుతున్నాయి. హంగ్ కి ఏమాత్రం ఛాన్స్ లేదని స్పష్టం చేస్తున్నాయి!


అవును... న్యూస్‌ టాప్ తెలంగాణ స్టేట్ సర్వే నివేదిక హైదరాబాద్‌ లో బుధవారం విడుదల అయ్యింది. ఈ సర్వేని నవంబర్ 16 నుండి నవంబర్ 21 వరకు నిపుణులచే నిర్వహించబడినట్లు చెబుతున్నారు. దీనికోసం సుమారు 1,19,000 శాంపుల్స్ ఆధారంగా సర్వే జరిగిందని అంటున్నారు. ప్రధానంగా... అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు నవంబర్ 15 చివరి తేదీ కాబట్టి ఈ సర్వేని నవంబర్ 16న ప్రారంభించినట్లు చెబుతున్నారు.

బీఆరెస్స్:

రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీఆరెస్స్... కొన్ని ఓటరు గ్రూపుల్లో వ్యతిరేక భావాలను ఎదుర్కొంటోంది! ప్రధానంగా యువత, విద్యార్థులతోపాటు డబుల్ బెడ్‌ రూం గృహాలు వంటి మంజూరైన పథకాల నుండి ప్రయోజనం పొందని వారిలో ఒక వర్గంతో కాస్త సమస్య ఉందని ఈ సర్వేలో తేలిందని సంస్థ చెబుతుంది.

ఫలితంగా 2018 ఎన్నికలలో 88 స్థానాలు సాధించిన బీఆరెస్స్... 2023 ఎన్నికలకు వచ్చేసరికి 65 - 76 స్థానాలకు పడిపోవచ్చని చెబుతుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ బీఆరెస్స్ గురించి ప్రతికూల కథనాలను రూపొందించడానికి ప్రయత్నించినప్పటికీ, అవి ఓటర్లకు అసంపూర్ణ సమాచారం అందించిందని అంటున్నారు.

ఏది ఏమైనా... గత ఎన్నికల స్థాయిలో 88 సీట్లు సంపాదించలేకపోయినా... మొత్తం మీద కాస్త అటు ఇటుగా 70 సీట్లతో బీఆరెస్స్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఈ సర్వే ఫలితాలతో తెలుస్తుంది!

కాంగ్రెస్:

ఈ సర్వే ఫలితాల ప్రకారం తెలంగాణలో ఎన్నికల్లో బీఆరెస్స్ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీ నిలిచింది! దీనికి గల ప్రధాన కారణాల్లో... కాంగ్రెస్‌ లో నాయకత్వం గురించి, ప్రత్యేకించి ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే దానిపై ప్రజల్లో గందరగోళం నెలకోవడం ఒకటని అంటున్నారు.

రాష్ట్రంలో స్పష్టమైన నాయకత్వం లేకపోవడం వల్ల కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం అస్థిరంగా ఉంటుందని.. ఫలితంగా చాలా మంది ఎమ్మెల్యేలు మరింత స్థిరమైన రాజకీయ పార్టీలోకి ఫిరాయించే అవకాశం ఉందని ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ సర్వే ద్వారా తేటతెల్లమైంది.

అయితే... ఈ తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్ ఓట్ల శాతం, సీట్ల సంఖ్యా... రెండింటిలోనూ గణనీయమైన పెరుగుదల కనిపించింది. అయితే మ్యాజిక్ ఫిగర్‌ ను దక్కించుకోలేకపోతుందని తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న '6-గ్యారంటీ పథకాలూను ఇప్పటికే అమలులో ఉన్న బీఆరెస్స్ స్కీఇం లకు అప్‌ గ్రేడ్ వెర్షన్‌ గానే ప్రజలు భావిస్తున్నారని సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి.

బీజేపీ:

కర్ణాటక ఎన్నికల వరకు తెలంగాణలో అధికార బీఆరెస్స్ కు ప్రత్యామ్నాయంగా రెండవ స్థానంలో కొనసాగినట్లు కనిపించిన బీజేపీ... తాజా సర్వే ఫలితాల ప్రకారం ఎంఐఎం కంటే వెనుకబడి ఉండే స్థితికి పడిపోయింది. దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లోనూ, గోషామహల్‌ లోనూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. అయితే అప్పటి పరిస్థితులకు తాజా పరిస్థితితులు భిన్నంగా ఉన్నట్లు తెలుస్తుంది!

అయితే... గత ఎన్నికలతో పోలిస్తే బీజేపీ ఓట్ల శాతాన్ని మాత్రం గణనీయంగా పెంచుకుంది. దీంతో కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోయే పరిస్థితుల్లో బీఆరెస్స్ - బీజేపీల మధ్య రసవత్తర పోరు కూడా గమనించవచ్చని తాజా సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నారు!

ఎంఐఎం:

ఎంఐఎం ప్రధానంగా హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికే పరిమితమైంది. ఇందులో భాగంగా... మలక్‌ పేట్, నాంపల్లి, కార్వాన్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌ పురా, బహదూర్‌ పురా వారి కంచు కోటలు. అయితే, రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థి మహమ్మద్ ఫిరోజ్ ఖాన్ బలం కారణంగా నాంపల్లిని కాంగ్రెస్‌ దక్కించుకోవచ్చని సర్వే గమనించింది.

నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచి ఆయా ఎన్నికల్లో 2009లో పీఆర్పీ, 2014లో టీడీపీ, 2018లో కాంగ్రెస్‌ పార్టీల నుంచి ఫిరోజ్ ఖాన్ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఈసారి ఫలితం పాజిటివ్ గా ఉండొచ్చని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

బీఎస్పీ:

బీఎస్పీ చాలా అసెంబ్లీ నియోజకవర్గాలలో దాదాపు 1% ఓటు బ్యాంకును కలిగి ఉంది. అయితే, సిర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గణనీయమైన దృష్టిని ఆకర్షించారు. దీంతో... ఇది రాబోయే ఎన్నికల్లో సీటును కైవసం చేసుకునే అవకాశాలను పెంచిందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి!

సీపీఐ:

కాంగ్రెస్ పార్టీ మద్దతుతో సీపీఐ కొత్తగూడెంలో మాత్రమే పోటీ చేస్తోంది, అక్కడ ఆధిక్యంలో ఉంది.

టఫ్ ఫైట్:

తాజా తెలంగాణ ఎన్నికల్లో సుమారు 11 స్థానాల్లో టఫ్ ఫైట్ జరగొచ్చని ఫలితాలు చెబుతున్నాయి. వీటిలో కొన్ని బీఆరెస్ కు మరికొన్ని కాంగ్రెస్ కు అనుకూలంగా ఫలితాలు ఇవ్వడం కన్ ఫాం అయినప్పటికీ... ఫైట్ మాత్రం హోరా హోరీగా ఉంటాయని తెలుస్తుంది.

ఈ టఫ్ ఫైట్ కు వేదికగా నిలవబోతున్న 11 నియోజకవర్గాల జాబితా ఇలా ఉంది. మంచిర్యాలు, నిర్మల్, బాల్కొండ, నారాయణఖేడ్, మల్కాజిగిరి, గద్వాల్, కల్వకుర్తి, షాద్‌ నగర్, మునిగోడు, ములుగు, ఖమ్మం.

జిల్లాలవారిగా ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి అనుకూల ఫలితాలు వస్తాయనేది కూడా ఈ సర్వే సవివరంగా తెలిపింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఆ ఫలితాలు ఎలా ఉండొచ్చని సర్వే తెలిపిందనేది ఇప్పుడు చూద్దాం...!

ఆదిలాబాద్: రెండు ఎస్సీ, మూడు ఎస్టీ నియోజకవర్గాలతో కలిపి 10 నియోజకవర్గాలున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిర్పూర్ (బీఎస్పీ), బెల్లంపల్లి (కాంగ్రెస్) మినహా మిగిలిన ఆరు నియోజకవర్గాల్లోనూ కారు జోరు ఉండబోతుందని.. మంచిర్యాల, నిర్మల్ లో మాత్రం టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

నిజామాబాద్: ఒకే ఒక్క ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంతో కలిపి 9 నియోజకవర్గాలున్న నిజామాబాద్ లో అధికార బీఆరెస్స్ నాలుగు (ముదోల్, ఆర్మూర్, బన్సువాడ, కామారెడ్డి) నియోజకవర్గాల్లో గెలిచే అవకాశం ఉందని సర్వే చెబుతుంది. ఇక బీజేపీ ఇక్కడ రెండు (బోదన్, నిజామాబాద్ అర్బన్) నియోజకవర్గాల్లో.. కాంగ్రెస్ రెండు (జుక్కల్, యల్లారెడ్డి) నియోజకవర్గాల్లో సత్తా చాటుతాయని.. బాల్ కొండలో మాత్రం కాస్త టఫ్ ఫైట్ ఉండొచ్చని సర్వే తెలిపింది!

కరీంనగర్: మూడు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలతో కలిపి 13 నియోజకవర్గాలున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 9 (కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, రామగుండం, కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్) నియోజకవర్గాల్లో కారు జోరు చూపించబోతుందని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి!

ఇక మిగిలిన నాలుగు నియోజకవర్గాల్లో మూడు (మంథని, పెద్దపల్లి, మనకొండూరు) నియోజకవర్గాల్లో హస్త హవా ఉండనుండగా.. హుజురాబాద్ లో బీజేపీ కి అనుకూల పవనాలు ఉన్నాయని ఈ సర్వే ఫలితాలు చెబుతున్నాయి!

మెదక్: రెండు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలతో కలిపి 10 నియోజకవర్గాలున్న ఉమ్మడి మెదక్ జిల్లా విషయానికొస్తే... ఇక్కడ సుమారు ఏడు (సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్ చెరు, దుబ్బాక, గజ్వేల్) నియోజకవర్గాల్లో గులాబీ జెండా రెపరెపలకు ఛాన్స్ ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఇక మిగిలిన మూడు నియోజకవర్గాల్లోనూ రెండు (ఆందోళ్, జహీరాబాద్) నియోజకవర్గాల్లో హస్తం హవా కొనసాగనుందని... నారాయనఖేడ్ లో మాత్రం కాస్త టఫ్ ఫైట్ ఉండొచ్చని ఈ ఫలితాల ద్వారా తెలుస్తుంది.

రంగారెడ్డి: రెండు ఎస్సీ స్థానాలతో కలిపి 14 నియోజకవర్గాలున్న ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 10 (మేడ్చల్, కుత్భుల్లాపూర్, కూకట్ పల్లి, ఉప్పల్, ఎల్బీ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చేవెల్ల, తాండూరు) స్థానాల్లో కారు వేగంగా దూసుకుపోయే అవకాశం ఉందని తాజా సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఇక మిగిలిన నాలుగు స్థానాల్లోనూ మూడు (ఇబ్రహీంపట్నం, పరిగి, వికారాబాద్) స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ జోరు కొనసాగే అవకాశం ఉందని ఈ ఫలితాలు చెబుతుండగా... మల్కాజిగిరీ నియోజకవర్గంలో మాత్రం టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉందని వెల్లడిస్తుంది!

హైదరాబాద్: ఒకే ఒక్క ఎస్సీ నియోజకవర్గంతో పాటు 14 నియోజకవర్గాలున్న హైదరబాద్ లో 7 (ముషీరాబాద్, అంబర్ పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, సికింద్రాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్) స్థానాల్లో గులాబీ జెండా ఎగురనుందని సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి.

ఇక 6 (మలక్ పేట్, కర్వాన్, చార్మినార్, చంద్రాయణగుట్ట, యాఖత్ పుర, బహదుర్ పుర) స్థానాల్లో ఎంఐఎం గెలిచే అవకాశం ఉందని... మిగిలిన రెండు స్థానాల్లో కాంగ్రెస్, నాంపల్లి... బీజేపీ, గోషామహల్ నియోజకవర్గాల్లో గెలవచ్చని సర్వే ఫలితాలు వెల్లడిస్తున్నాయి!

మహబూబ్ నగర్: రెండు ఎస్సీ స్థానాలతో కలిపి 14 నియోజకవర్గాలున్న మహబూబ్ నగర్ జిల్లాలో 7 (మహబూబ్ నగర్, జడ్చర్ల, దేవరకండ్ర, మక్తల్, వనపర్తి, నాగర్ కర్నూల్, కొల్లపూర్) నియోజకవర్గాల్లో బీఆరెస్స్ కు అనుకూల ఫలితాలు రావొచ్చని సర్వే చెబుతుంది.

మిగిలిన ఏడు స్థానాల్లోనూ నాలుగు (కొడంగల్, నారయణ్ పేట్, అల్లంపూర్, అచ్చంపేట్) నియోజకవర్గాల్లో కాంగ్రెస్స్ బలంగా ఉండగా... గద్వాల్, కల్వకుర్తి, షాద్ నగర్ స్థానాల్లో టప్ ఫైట్ ఉండొచ్చని సర్వే ఫలితాలు చెబుతున్నాయి!

నల్గొండ: రెండు ఎస్సీ, ఒక ఎస్టీ స్థానాలతో కలిసి 12 నియోజకవర్గాలున్న ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆరెస్స్ 4 (దేవరకొండ, సూర్యపేట, బోన్ గిరి, అలైర్) స్థానాల్లో బలంగా ఉందని... 7 (నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, నల్గొండ, నకిరేకల్, తుంగతుర్తి) నియోజకవర్గాల్లో హస్తం తన హవా చూపించే అవకాశాలున్నాయని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. మునుగోడులో మాత్రం కాస్త టఫ్ ఫైట్ జరిగే ఛాన్స్ ఉందని ఫలితాలు చెబుతున్నాయి!

వరంగల్: రెండు ఎస్సీ, రెండు ఎస్టీ స్థానాలతో కలిపి 12 నియోజకవర్గాలున్న వరంగల్ జిల్లాలో 8 (జనగాం, ఘన్ పూర్ స్టేషన్, పాలకుర్తి, మహబూబాబాద్, పర్కల్, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్, వర్ధన్నపేట) నియోజకవర్గల్లో బీఆరెస్స్ కు అనుకూల ఫలితాలు ఉన్నాయని సర్వే ఫలితాలు తేటతెల్లం చేస్తున్నాయి!

ఇక మిగిలిన 4 స్థానాల్లోనూ మూడు (డోర్నకల్, నరసంపేట్, భూపాలపల్లి) నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కు అనుకూల ఫలితాలు ఉన్నాయని సర్వే చెబుతుంది. ఇక మిగిలిన ములుగు నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉండే ఛాన్స్ ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి.

ఖమ్మం: ఐదు ఎస్టీ, రెండు ఎస్సీ స్థానాలతో కలిపి 10 నియోజకవర్గాలున్న ఖమ్మంలో మూడు (ఇల్లందు, వైరా, సత్తుపల్లి) నియోజకవర్గాల్లో బీఆరెస్స్ కు అనుకూల ఫలితాలు ఉన్నాయని.. మిగిలిన 7 స్థానాల్లోనూ కాంగ్రెస్ కు 6 (భూపాలపల్లి, పినపాక, పాలేరు, మధిర, కొత్తగూడెం, అశ్వరావుపేట, బద్రాచలం) నియొజకవర్గాల్లో కాంగ్రెస్ జోరుగా ఉండొచ్చని.. మిగిలిన ములుగు లో టఫ్ ఫైట్ ఉండొచ్చని సర్వే ఫలితాలు చెబుతున్నాయి!