ఇంకా తేల్చుకోని తెలంగాణ సమాజం.. కారణమేంటి...?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్టయింది. ఇక, కేవలం మూడు రోజులే.. పార్టీలకు సమయం మిగిలింది.
By: Tupaki Desk | 26 Nov 2023 6:27 AM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కౌంట్ డౌన్ స్టార్టయింది. ఇక, కేవలం మూడు రోజులే.. పార్టీలకు సమయం మిగిలింది. ఈ నెల 30న జరగనున్న ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో దీనికి ముందు.. అంటే.. 28న సాయంత్రం ఆరు గంటలతో ప్రచారం ముగియనుంది. ఈ లెక్కన పార్టీలకు, అభ్యర్థులకు కూడా.. కేవలం మూడు రోజుల సమయం ఉండడంతో ప్రచార పర్వం ఊపందుకుంది. ఇప్పటికే జోరుగా ఉన్న ప్రచారంలో ఇప్పుడు అగ్రనేతలు కూడా రావడం.. తిష్ఠ వేసి.. మరీ తెలంగాణలో ప్రచారం చేయడం గమనార్హం.
ప్రస్తుతం తెలంగాణ సమాజం ఎటు వైపు నిలబడిందో చెప్పడం కష్టంగా మారింది. వాస్తవానికి 2018 ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సమాజం స్పష్టమైన విధానం ఎంచుకుంది. ఇది బీఆర్ ఎస్ పార్టీకి కలిసి వచ్చింది. కానీ.. ఇప్పుడు, తెలంగాణ ప్రజలు ఎటువైపు మొగ్గుతున్నారనేది ఎవరికీ అంతు చిక్కలేదు. ఏ సర్వే చేసినా.. చూసినా.. అంతా అయోమయం.. చిందరవందర గందరగోళంగానే ఉంది. దీంతో పార్టీల ఆశలు సజీవంగా ఉన్నాయి. ఇంకొంత ప్రయత్నం చేస్తే.. అధికారంలోకి వచ్చేయొచ్చనే ఆశలు మొలిచాయి.
ఇదే.. ఆయా పార్టీల అగ్రనేతలను రంగంలోకి దిగేలా చేసింది. 2018లో ప్రధాని మోడీ కేవలం రెండు సభల్లోనే పాల్గొన్నారు. అమిత్‌షా ఐదు సభల్లో పాల్గొన్నారు. ఇక, బీఆర్ ఎస్ అధినేత, సీఎం కేసీఆర్.. 15 సభల్లో పాల్గొని ప్రచారం చేశారు. అదేసమయంలో కాంగ్రెస్-టీడీపీలు 25 సభలు నిర్వహించాయి. అయితే..అప్పట్లో టీడీపీ పోటీ చేయడంతో తెలంగాణ సమాజం ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేసింది. కేసీఆర్‌కే పట్టం కట్టాలని నిర్ణయించుకుంది.
కానీ, ఇప్పుడు ఉన్నవన్నీ.. జాతీయ పార్టీలు, అచ్చం.. తెలంగాణ పార్టీలు మాత్రమే పోటీలో ఉన్నాయి. దీంతో ప్రజానాడిని పట్టుకోవడం .. ఏ పార్టీకీ సాధ్యం కావడం లేదు. ఈ క్రమంలోనే అగ్రనేతల నుంచి చోటా నేతల వరకు అందరూ ఒక్కుమ్మడిగా ప్రచారంలో పాల్గొంటున్నారు. విరివిగా సభలు నిర్వహిస్తున్నారు. ప్రచార పర్వానికి మూడు రోజులే.. ఉండడంతో మరింత ఊపు తెచ్చారు. మరి తెలంగాణ ప్రజలు ఎవరికి పట్టం కడతారో.. లేక హంగుకే జై కొడతారో చూడాలి.