Begin typing your search above and press return to search.

రు. 5 లక్షల కోట్లు అప్పా ?

తెలంగాణా ప్రభుత్వం ఈరోజుకు రు. 5 లక్షల కోట్లు అప్పుల్లో ఉందా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   28 Nov 2023 5:08 AM GMT
రు. 5 లక్షల కోట్లు అప్పా ?
X

తెలంగాణా ప్రభుత్వం ఈరోజుకు రు. 5 లక్షల కోట్లు అప్పుల్లో ఉందా ? అంటే అవుననే ఆరోపిస్తుంది కాంగ్రెస్ పార్టీ . కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజా లెక్కల ప్రకారం తెలంగాణా ప్రభుత్వం అప్పు రు. 5 లక్షల కోట్లట. 2022, మార్చి నాటికి అప్పు రు. 4.56 లక్షల కోట్లుండేది. అయితే ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటికే రు. 24,500 కోట్లు అప్పుచేసిందట. దీనికి ఇతరత్రా అప్పులు తోడై రు. 5 లక్షల కోట్లకు చేరిందని సమాచారం.

రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచి అధికారంలోకి వచ్చినా అప్పులు తీర్చటమూ కష్టమే, అప్పులు దొరకటమూ కష్టమే అన్నట్లుగా పరిస్ధితి తయారైందట. బీఆర్ఎస్ గెలిస్తే అప్పులు చేయటంలో ఇప్పటికే ఆరితేరిపోయింది కాబట్టి మళ్ళీ అప్పులు చేయటంలో ఇబ్బందులుండవు. అనేక సంక్షేమపథకాలకు ఇచ్చిన హామీలను కూడా సంపూర్ణంగా అమలుచేసే అలవాటు కేసీయార్ కు లేదు కాబట్టి పెద్దగా సమస్యలుండవు. ఇదే బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తిప్పలు తప్పేట్లు లేవు.

ఎందుకంటే ఇచ్చిన హామీలు అమల్లోకి తేవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయలు కావాలి. అప్పులు తేవటంలో ఉన్నతాధికారులు మార్గాలు చూపిస్తారనటంలో సందేహం లేదు. అయితే తెచ్చిన అప్పులను తీర్చటం, సంక్షేమపథకాలను అమలుచేయటం మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి తలకుమించిన పనైపోతుంది. కర్నాటకలో బీజేపీని ఓడించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ హామీల అమలుకు నానా అవస్తలు పడుతోంది. అదే పద్దతిలో తెలంగాణాలో కూడా బీఆర్ఎస్ స్ధానంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇబ్బందులు పడక తప్పేట్లు లేదు.

ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో నుండి దిగిపోయేనాటికి ఖజానాలో ఉన్నది కేవలం రు. 100 కోట్లు మాత్రమే. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తన హామీలను అమలుచేయటానికి అప్పుల మీద అప్పులు చేస్తున్నారు. ఇదే పద్దతి తెలంగాణాలో కాంగ్రెస్ కు కూడా తప్పకపోవచ్చు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే కాస్త వెసులుబాటు ఉంటుందేమో చూడాలి. ఎందుకంటే కేంద్రంలో కూడా బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే అధికారంలో ఉందికాబట్టి నిధులను పెద్ద ఎత్తున సర్దుబాటు చేస్తుందేమో చూడాలి.