బాబుకు ఐఎంజీ దెబ్బ...షాక్ ఇచ్చిన హైకోర్టు...!
అనేక వాయిదాలు పడి సుదీర్ఘ కాలం విచారణ జరిగిన మీదట తాజాగా ఈ కేసు విషయంలో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ అధ్వర్యంలోని తెలంగాణా న్యాయ స్థానం తీర్పు చెప్పింది.
By: Tupaki Desk | 8 March 2024 3:00 PM GMTఉమ్మడి ఏపీ సీఎం గా హైదరాబాద్ ని ఎంతో అభివృద్ధి చేశాను అని చెప్పుకునే చంద్రబాబులో ప్రచార పటాటోపం పాళ్ళే ఎక్కువ. ఇక ఆయన సీఎం గా ఉండగా జరిగిన అవకతవకలు అవినీతి వ్యవహారాలను ప్రతిపక్షాలు ఎత్తిన ప్రతీసారి బాబు అనుకూల మీడియా అవన్నీ తప్పు అంటుంది. బాబుని విజనరీగా పేర్కొంటుంది.
అయితే విజనరీ వెనక డొల్లతనాన్ని ఎత్తి చూపించింది ఐఎంజీ భూముల పందేరం. సంస్థ పెట్టిన నాలుగు రోజులకే ఏకంగా 850 ఎకరాలను కారు చౌకగా కట్టబెట్టిన నిర్వాకం చంద్రబాబు ఉమ్మడి ఏపీ సీఎం గా ఉన్న టైం లో జరిగింది. చంద్రబాబు 2003 ప్రాంతంలో ఐఎంజీ భారత్ కి ఎకరం యాభై వేల రూపాయలు వంతున మొత్తం 850 ఎకరాల భూములను కేటాయించారు. అవన్నీ కూడా నాటి హైదరాబాద్ సిటీలో హార్ట్ గా ఉన్న ప్రాంతాలే కావడం విశేషం.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలిలో సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాలు, సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో విమానాశ్రయానికి అత్యంత చేరువలో 450 ఎకరాలను కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. ఆ రోజులలో ఇక్కడ ఎకరం పది కోట్ల రూపాయలు విలువ చేస్తోంది. అయినా సరే అస్మదీయుల కోటాలో ఎకరం భూమిని యాభై వేలకు కేటాయిస్తూ హడావుడి నిర్ణయం తీసుకుంది.
ఇక ఎన్నికల వేళ ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉండగా ఏ హక్కు లేని సందర్భంలో ఈ భూములను ఇవ్వడం కూడా తప్పు పట్టే చర్యగానే ఉంది. ఇక ఐఎంజీ భారత్ కంపెనీ వ్యవహారం చూస్తే 2003 ఆగస్టు 5న దీనిని రిజిష్టర్ చేశారు. దాని అధినేత అహోబిలరావు అలియాస్ బిల్లీరావు.
ఇంత విలువలైన భూములు ఐఎంజీకి ఇవ్వడానికి కారణం క్రీడా మైదానాలు నిర్మించి 2020 నాటికి ఒలింపిక్స్ కి క్రీడాకారులను సిద్ధం చేస్తామని ఐఎంజీ హామీ ఇచ్చింది. దాన్ని నమ్మి చంద్రబాబు ప్రభుత్వం ఇలా చేసింది. అయితే ఇది జరిగిన తరువాత చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయింది.
ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ ప్రభుత్వం 2006లో ఐఎంజీకి ప్రభుత్వం ఇచ్చిన భూములను రద్దు చేశారు. దీని మీద కోర్టుకు బిల్లీరావు వెళ్లారు. అనేక వాయిదాలు పడి సుదీర్ఘ కాలం విచారణ జరిగిన మీదట తాజాగా ఈ కేసు విషయంలో చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్ అధ్వర్యంలోని తెలంగాణా న్యాయ స్థానం తీర్పు చెప్పింది. ఈ భూములు ప్రభుత్వానివే అని స్పష్టం చేసింది.
కేవలం నాలుగు రోజుల వ్యవధిలో ఎనిమిది వందల యాభై ఎకరాలు ఎలా కట్టబెడతారు అని గత ప్రభుత్వ తీరుని తప్పుపెట్టింది. ఏకపక్షంగా ఈ భూములను కట్టబెట్టారని కూడా విమర్శించింది. అంతే కాదు ఈ మొత్తం వ్యవహారం మీద సీబీఐ విచారణ జరిపించాలని కూడా అభిప్రాయపడింది. ఆ పని హై కోర్టు చేయాలా లేక తెలంగాణా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా అని కూడా ప్రశ్నించింది. ప్రభుత్వం సీబీఐ విచారణ కోరడానికి వారం రోజుల గడువు ఇస్తున్నట్లుగా తీర్పులో ప్రకటించారు.
మొత్తానికి ఏపీలో ఎన్నికలకు సిద్ధం అవుతున్న చంద్రబాబు అభివృద్ధి ప్రదాతను తానే అని అభివర్ణించుకుంటున్న ఆయనకు ఉమ్మడి ఏపీలో ఐఎంజీ భూముల విషయంలో చేసిన నిర్వాకం న్యాయ స్థానం సాక్షిగా బట్టబయలు కావడం మాత్రం భారీ షాక్ అని భావిస్తున్నారు. ఇది ఏపీలో అధికార వైసీపీకి అంది వచ్చిన అస్త్రంగా మారుతోంది అని అంటున్నారు.
ఏపీలో కూడా బాబు 2014 నుంచి 2019 దాకా సాగిన పాలనలో అమరావతి రాజధాని వెనక రియల్ ఎస్టేట్ వ్యవహారం ఉందని ఇప్పటికీ ఆరోపిస్తున్న వైసీపీ దానికి సరైన ఉదాహరణగా ఐఎంజీ కేసుని చూపించడానికి రెడీ అవుతోంది. ఇక ఐఎంజీ కేసులో సీబీఐ ఎంటర్ అయితే చాలా తెర వెనక విషయాలు కూడా బయటకు వస్తాయని అంటున్నారు. ఐఎంజీ భూముల సంతర్పణ వ్యవహారంలో హైకోర్టు సీరియస్ గా ఉన్న క్రమంలో ఎలా చూసుకున్నా సీబీఐ విచారణకు అవకాశాలు ఉన్నాయనే అంటున్నారు.