Begin typing your search above and press return to search.

‘తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా.. శాశ్వితంగా రాజకీయాలకు గుడ్ బై’

అసెంబ్లీ సాక్షిగా రేవంత్ కు భారీ కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా మంత్రి కేటీఆర్ డిసైడ్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   6 Aug 2023 6:03 AM GMT
‘తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామా.. శాశ్వితంగా రాజకీయాలకు గుడ్ బై’
X

ఎప్పుడూ అనని.. చేయని సవాల్ చేశారు తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్. ఓఆర్ఆర్ ను ముప్ఫై ఏళ్ల లీజుకు ఒక సంస్థకు ఇవ్వటంపై టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడటం.. వేలాది కోట్ల రూపాయిల స్కాంగా అభివర్ణించటం తెలిసిందే. ఈ ఎపిసోడ్ పై ఇప్పటికే ఆయన హెచ్ఎండీఏ నుంచి లీగల్ నోటీసులు అందుకున్నారు. అయినప్పటికీ దీనిపై విమర్శలు.. ఆరోపణలు వెల్లువెత్తుతున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అసెంబ్లీ సాక్షిగా రేవంత్ కు భారీ కౌంటర్ ఇచ్చేందుకు వీలుగా మంత్రి కేటీఆర్ డిసైడ్ అయ్యాడు.

తాజాగా అసెంబ్లీలో సుదీర్ఘంగా మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ పార్టీ మీదా.. పీసీసీ చీఫ్ రేవంత్ మీదా ఫైర్ అయ్యారు. ఓఆర్ఆర్ లీజు విషయంలో కుంభకోణం జరిగిందని అసత్యాలు చెబుతున్నారని.. ఈ టెండర్ల విషయంలో తాను కానీ ప్రభుత్వం కానీ తప్పు చేసినట్లుగా నిరూపిస్తే తాను తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. అంతేకాదు.. అంతకు మించి అన్నట్లుగా.. తప్పు నిరూపితమైన క్షణం నుంచి తాను రాజకీయాల నుంచి శాశ్వితంగా తప్పుకుంటానని సవాలు విసరటం గమనార్హం.

అదే సమయంలో రేవంత్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్ టీఐ అంటే కొందరికి రూట్ టూ ఇన్ కంగా మారిందన్న కేటీఆర్.. అవుటర్ రింగ్ రోడ్డు టోల్ టాక్స్ కు సంబంధించి ముప్ఫై ఏళ్ల పాటు ఐఆర్ బీఐ డెవలపర్స్ అనే కంపెనీకి లీజుకు ఇస్తే.. దానిపై రేవంత్ చేసిన ఆరోపణలకు ఆ సంస్థ రూ.వెయ్యి కోట్ల పరువు నష్టం దావా వేసిందన్నారు. రాష్ట్రంలో బిహార్ ఐఏఎస్ ల పెత్తనం నడుస్తోందని వ్యాఖ్యానిస్తారని.. యూపీఎస్ సీ పరీక్షలు రాసి ప్రభుత్వ నియామకాల మేర పని చేస్తున్న అధికారులపై నోటికి వచ్చినట్లుగా మాట్లాడతారా? అని ఫైర్ అయ్యారు.

సీఎం కేసీఆర్ ను ఉరి తీయాలంటారని.. ఇదేం పద్దతి? అన్న కేటీఆర్.. ‘మీ పీసీసీ అధ్యక్షుడి అంతు చూస్తాం’ అంటూ వార్నింగ్ ఇవ్వటం గమనార్హం. కేసీఆర్ మెరుపు వేగంతో నిర్ణయాలు తీసుకోవటం వల్లే.. ప్రజల జీవితాల్లో వెలుగులు పూస్తున్నాయన్న కేటీఆర్.. కొందరు అనుమానపక్షకులు ఏదో మాట్లాడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. వారిక ఇంట్లో పడుకోవాల్సిందేనన్న మంత్రి.. ‘‘కేసీఆర్ అనుకుంటే సాధిస్తారు. కంటెంట్ లేని కాంగ్రెసోళ్లకు.. కమిట్ మెంట్ ఉన్న కేసీఆర్ కు పోలికా’ అంటూ ఫైర్ అయ్యారు.

తాము ప్రజలకు నీళ్లు తాగించామని.. ఇకపై ప్రతిపక్షాలకు మూడు చెరువుల నీళ్లు తాగిస్తామన్నారు. పంద్రాగస్టు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 2.28 లక్షల డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని చెప్పిన కేటీఆర్.. ఒక్కో డబుల్ బెడ్రూం ఇల్లు.. ఏడు ఇందిరమ్మ ఇళ్లతో సమానమని చెప్పారు. మొత్తంగా అసెంబ్లీలో నాన్ స్టాప్ గా రెండు గంటల పాటు మాట్లాడిన కేటీఆర్.. విపక్షాలపై విరుచుకుపడుతూనే.. తమ ప్రభుత్వం సాధించిన విజయాల్ని గొప్పగా చెప్పుకుంటూ.. రానున్న రోజుల్లో తామేం చేయనున్న విషయాన్ని సుదీర్ఘంగా వివరించారు.