Begin typing your search above and press return to search.

కొత్త సీన్: కేటీఆర్ కోసం పడిగాపులు కాస్తున్న గులాబీ నేతలు

ఒకేలాంటి ప్లాన్లు అన్నిసార్లు ఒకేలాంటి సక్సెస్ ను ఇవ్వవు. 2018లో షెడ్యూల్ కంటే ముందుగా ఎన్నికలకు వెళ్లి సంచలన నిర్ణయాన్ని తీసుకున్న గులాబీ బాస్ కేసీఆర్

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:28 AM GMT
కొత్త సీన్: కేటీఆర్ కోసం పడిగాపులు కాస్తున్న గులాబీ నేతలు
X

ఒకేలాంటి ప్లాన్లు అన్నిసార్లు ఒకేలాంటి సక్సెస్ ను ఇవ్వవు. 2018లో షెడ్యూల్ కంటే ముందుగా ఎన్నికలకు వెళ్లి సంచలన నిర్ణయాన్ని తీసుకున్న గులాబీ బాస్ కేసీఆర్.. పనిలో పనిగా భారీ ఎత్తున అభ్యర్థుల పేర్లను ప్రకటించిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికలు మరో మూడు నెలలకు వచ్చేసిన వేళ.. 2018 కంటే ఒక అడుగు ముందుకువేసి.. కేవలం నాలుగు సీట్లు మినహాయించి.. మిగిలిన 115 సీట్లకు అభ్యర్థుల్ని ప్రకటిస్తూ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. భారీ జాబితాను ప్రకటించటం ద్వారా కేసీఆర్ సాహసోపేతంగా వ్యవహరించారని.. సగం విజయం ఆయన సొంతమైందన్న వాదనను గులాబీ నేతలు వ్యాఖ్యానించటం కనిపించింది.

అయితే.. జాబితా విడుదలైన రెండోరోజు నుంచే అలకలు.. ఆరోపణలు.. ఆగ్రహాలు మొదలు కావటమే కాదు.. టికెట్ పంచాయితీలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. ఆసక్తికరంగా ఈసారి టికెట్ల ఆశావాహుల్లో ఎక్కువ మంది కేటీఆర్ కు సన్నిహితంగా ఉన్న వారు కావటం గమనార్హం. టికెట్లు రాని కొందరి విషయాన్ని ప్రస్తావిస్తూ.. జాబితా విడుదలైన గంటల వ్యవధిలోనే కేటీఆర్ స్పందిస్తూ ట్వీట్ చేశారు.

కొడుకు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లినట్లు చెబుతున్నా.. విదేశీ పర్యటనల్లో ఇన్నేసి రోజులు ఉన్నది గతంలో ఎప్పుడూ లేదని చెబుతున్నారు. టికెట్ల పంచాయితీలకు కాస్తంత దూరంగా ఉండాలన్న ఉద్దేశంతోనే కేటీఆర్ అమెరికా టూర్ కు వెళ్లారన్న వాదన వినిపిస్తోంది. గడిచిన రెండు దఫాలుగా టికెట్లు దక్కని వారు.. మూడోసారి కూడా దక్కకపోతే తమ రాజకీయ జీవితం సమాప్తమవుతుందన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.

అధినేతను కలిసేందుకు అవకాశం లేని నేపథ్యంలో.. తమకు సన్నిహితంగా ఉండే కేటీఆర్ రాక కోసం పలువురు నేతలు ఎదురుచూస్తున్నట్లు చెబుతున్నారు. జాబితా వెలువడి పది రోజులు అవుతున్నా.. టికెట్ ఆశించి భంగపడిన వారి ఆగ్రహం అంతకంతకూ పెరగటమే తప్పించి.. తగ్గకపోవటం గులాబీ వనంలో కలకలాన్ని రేపుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలకు మరో నెల మాత్రమే టైం ఉన్న వేళ.. ఈ పంచాయితీలు గెలుపు మీద ఎలాంటి ప్రభావాన్నిచూపుతాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

మరోవైపు.. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ కు వచ్చినంతనే ఆయనతో మాట్లాడి.. తదుపరి నిర్ణయాన్ని తీసుకోవాలన్న యోచనలో పలువురు గులాబీ నేతలు ఉన్నట్లు చెబుతున్నారు. టికెట్లు రాని వారంతా.. తమ దారి తాము చూసుకోవటానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. చివర్లో ఇప్పుడు ప్రకటించిన జాబితాలో మార్పులు చోటు చేసుకుంటాయన్న ప్రచారం పెరుగుతోంది. దాదాపు పన్నెండు నుంచి పాతిక మంది వరకు అభ్యర్థులు మారే వీలుందని చెబుతున్నారు. దీంతో.. మార్పుల జాబితాలో తమ పేర్లు ఉండేలా చూడాలన్న ఒత్తిడిని కేటీఆర్ మీద తీసుకొచ్చేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే.. ఆయన అమెరికాలో ఉండటంతో.. ఎప్పుడు వస్తారా? అన్న ఎదురుచూపులు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి.