సీఎం గా కేటీయార్ : వ్యూహం మార్చిన బీయారెస్!
బీయారెస్ ఒక జాతీయ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీ. ఈ మాట ఎందుకు చెప్పాలంటే బీయారెస్ లోనే భారత దేశం ఉంది.
By: Tupaki Desk | 23 Oct 2023 1:30 AM GMTబీయారెస్ ఒక జాతీయ పార్టీ లాంటి ప్రాంతీయ పార్టీ. ఈ మాట ఎందుకు చెప్పాలంటే బీయారెస్ లోనే భారత దేశం ఉంది. అది జాతీయం. కానీ పోకడలు అన్నీ ఫక్తు ప్రాంతీయంగానే ఉంటూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే ప్రతీ పార్టీ మాదిరిగానే బీయారెస్ లోనూ కుటుంబం ఉంది. వారసత్వపు వాసనలు నిండుగా ఉన్నాయి. కొడుకు కేటీయార్ ఆ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, అలాగే మంత్రిగా కూడా ఉంటూ వస్తున్నారు.
ఇక మేనల్లుడు హరీష్ రావు పునాది నుంచి పార్టీలో ఉంటున్నారు. కుమార్తె కవిత ఎంపీగా చేశారు, ఎమ్మెల్సీగా ప్రస్తుతం ఉంటున్నారు. కేసీయార్ అటు పార్టీకి పెద్ద, ఇటు కుటుంబానికి పెద్దగా అన్నీ నిభాయించుకుని వస్తున్నారు. కేసీయార్ చూపు జాతీయ రాజకీయాల మీద ఉందని అందరూ అంటారు. ఇక బీయారెస్ కూడా ఆ విషయం దాచడం లేదు. టీయారెస్ బీయారెస్ గా మారడంతోనే అసలు రహస్యం అదే.
కేసీయార్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి కేటీయార్ ని తెలంగాణలో తన తరువాత సీఎం ని చేయాలని ఒక కీలకమైన ఆలోచన ఉంది అంటారు. అది 2018లో వేసుకున్న ప్లాన్. అయితే మోడీ నాయకత్వంలో బీజేపీకి బ్రహ్మాండమైన మెజారిటీ రావడంతో కేసీయార్ ఏమీ చేయలేకపోయారు. అయిదేళ్ల పాటు సీఎం గానే ఉన్నారు.
ఇపుడు మరో ప్రయత్నం అయితే కచ్చితంగా ఆయన చేస్తారు, అందుకే గత ఏడాది విజయదశమి వేళ ఆయన టీయారెస్ పేరుని కాస్తా బీయారెస్ గా మార్చేశారు. ఈసారి తెలంగాణాలో పార్టీ గెలిస్తే కేటీయార్ ని సీఎం ని చేసి తాను ఢిల్లీ రాజకీయాల్లో మెరియాలని గులాబీ బాస్ ప్లాన్ అని అంటున్నారు.
దీని మీదనే విపక్షాలు ప్రచారం కూడా చేస్తూ విమర్శలు దట్టిస్తూ వస్తున్నాయి. మోడీ అయితే ఈ మధ్య తెలంగాణాకు వచ్చినపుడు కేటీయార్ ని సీఎం చేయమని తనను కేసీయార్ కోరారు అని ఒక సీక్రెట్ ని బయటపెట్టారు. కుటుంబ పార్టీ బీయారెస్ అని కూడా అన్నారు. బీయారెస్ కి ఓటేస్తే ఆ ఫ్యామిలీకే లాభం అని బీజేపీ అంటోంది.
కాంగ్రెస్ నాయకత్వంలో రాహుల్ తదితరులు కూడా ఇదే మాట అంటున్నారు. ఒక కుటుంబం అధికారం కోసం తాము తెలంగాణాను ఇవ్వలేదని కూడా రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే కేసీయార్ ఈసారి గెలిస్తే కేటీయార్ సీఎం అవుతారు అన్నది మాత్రం విపక్షాలు ప్రచారం చేస్తూ వస్తున్నాయి. అది జనంలోకి వెళ్లిపోతోంది. దాంతో జనాల మైండ్ సెట్ కూడా ఎలా ఉంటుందో ఎవరికీ తెలియడంలేదు.
అవునన్నా కాదన్నా కేసీయార్ అంటే జనాలకు ఉన్న విశ్వాసం వేరు. ఆయన ఉద్యమకారుడిగా మారి తెలంగాణాను సాధించారు. ఆయన సీఎం అంటే బీయారెస్ కి ఉండే బలం వేరు, ఆయన కాదు అంటే వచ్చే ప్రభావం కూడా వేరు. దాంతో ఆలస్యంగా అయినా బీయారెస్ మేలుకుంది. అందుకే కేటీయార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు. ఈసారి బీయారెస్ గెలిస్తే మూడవసారి కూడా కేసీయార్ సీఎం అవుతారు అని అసలు విషయం చెప్పారు.
తాను సీఎం పదవి కోసం ఎదురుచూడడంలేదు అని క్లారిటీగా చెప్పేశారు. బీయారెస్ లో చాలా మంది సీఎం అయ్యే యోగ్యులు ఉన్నారని కూడా ఆయన మరో మాట అన్నారు. ఆరు నూరు అయినా కేసీయార్ మాత్రమే సీఎం అవుతారు, ఇందులో రెండవ మాట లేదు అని ఖరాకండీగా చెప్పుకొచ్చారు.
మరి ఇంతటి కీలక సమయంలో కేటీయార్ ఎందుకు ఇలా ప్రకటించాల్సి వచ్చింది అన్నది బీయారెస్ తో పాటు బయట కూడా చర్చ విపరీతంగా సాగుతోంది. బీయారెస్ కి కేసీయార్ సీఎం కాదు అన్నది విపక్షాలు చేస్తున్న ప్రచారం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని అంటున్నారు. దాంతో బీయారెస్ గ్రాఫ్ కూడా తగ్గుతుంది అని నివేదికలు రావడంతోనే అలెర్ట్ అయిన బీయారెస్ ఈ విధంగా కేటీయార్ చేత ప్రకటింపచేసింది అని అంటున్నారు.
కేటీయార్ మరో మాట కూడా అన్నారు. తాను సీఎం కావాలని ప్రతిపక్షాలు ప్రేమతో కోరుకుంటున్నాయని సెటైర్లు వేశారు. ఏది ఏమైనా కేటీయార్ సీఎం కావడం అన్నది ఈసారి బీయారెస్ గెలుపు మీద ఆధారపడి ఉంది. ముందే కేటీయార్ పేరుని తేవడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ అన్న భావనతోనే ఇలా వ్యూహం మార్చారని అంటున్నారు.
ఈసారి బీయారెస్ ని గెలిపిస్తే రానున్న అయిదేళ్ళూ ఆ పార్టీదే అధికారం అవుతుంది. అపుడు ఏ సమయంలోనైనా కేటీయార్ ని సీఎం చేసుకునే అవకాశం ఉంది. దానికి ఎన్నికల ముందే ఎందుకు ఈ రచ్చ అన్న ఆలోచనతోనే కేటీయార్ సీఎం రేసులో లేను అని అంటున్నారని విపక్షాలు అంటున్నాయి. మరి జనాలు ఈ విషయాన్ని నమ్ముతారా. ప్రతిపక్షాలు కుటుంబ పాలన మీద విమర్శలు చేయకుండా ఉంటాయా అంటే చూడాల్సిందే.