Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎంపీ నిదులతో ఏపీలో శ్మశానం.. ఎక్కడంటే?

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్మశాన వాటిక డెవలప్ మెంట్ కోసం చాలానే ప్రయత్నాలు జరిగాయి.

By:  Tupaki Desk   |   22 Jan 2024 5:30 AM GMT
తెలంగాణ ఎంపీ నిదులతో ఏపీలో శ్మశానం.. ఎక్కడంటే?
X

అవును.. మీరు చదివింది నిజమే. ఏపీలోని ఒక ఊరికి అవసరమైన శ్మశానానికి తెలంగాణకు చెందిన ఎంపీ ఒకరు తన ఎంపీ లాడ్స్ నుంచి రూ.10లక్షల మొత్తాన్ని కేటాయించటంతో.. ఇంతకాలంగా ఆ ఊరికి సమస్యగా మారిన శ్మశానానికి ఒక సమాధానం దొరికినట్లైంది. ఇంతకూ ఆ తెలంగాణ ఎంపీ ఎవరు? ఆయన కేటాయించిన నిధులతో ఏపీలోని ఏ ఊరిలో శ్మశానాన్ని నిర్మించారన్న విషయంలోకి వెళితే..

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో శ్మశాన వాటిక డెవలప్ మెంట్ కోసం చాలానే ప్రయత్నాలు జరిగాయి. కానీ.. అవేమీ వర్కువుట్ కాలేదు. చివరకు తమ ఎమ్మెల్యే కం ఉప ముఖ్యమంత్రి రాజన్నదొరను సైతం సంప్రదించారు. ఇక్కడో షాకింగ్ నిజం ఏమంటే.. రాజన్న దొరను నిధుల కోసం అడిగిన వారిలో ఆ ఊరికి చెందిన వారే కాదు.. అధికార పార్టీకి చెందిన పలువురు ఉన్నట్లు చెబుతారు. అయినప్పటికీ సానుకూల స్పందన రాలేదు. ఎమ్మెల్యేతో పని కాకపోవటంతో అధికార పార్టీకి చెందిన అరకు ఎంపీని సంప్రదించారు. వారి నుంచి సానుకూల స్పందన రాలేదు.

దీంతో.. శ్మశాన సమస్యను పరిష్కరించేందుకు ఊరి నుంచి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి స్థిరపడిన వారిని సంప్రదించాలని భావించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న సుతాపల్లి వెంకటరావు దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. ఎందుకంటే.. ఆయన కూడా సాలూరు వాసినే. దీంతో సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్ తమ ఊరి శ్మశాన సమస్యను తెలంగాణ రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ కు చెప్పారు.

వెంటనే స్పందించిన ఆయన రూ.10 లక్షల మొత్తాన్ని కేటాయించారు. ఈ నిధులతో స్వర్గధామంలోని సీసీ రోడ్లు.. ఆధునికీకరణ పనులు చేపట్టారు. ఈ పనులు ఇప్పటికి పూర్తి అయ్యాయి. తమ ఊరి శ్మశానం డెవలప్ మెంట్ కోసం ఊళ్లో వారు కానీ.. నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే.. ఎంపీ కూడా స్పందించకుంటే అక్కడెక్కడో ఉన్న తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు స్పందించటం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ ఎంపీ నిధులు కేటాయించటంతో పురపాలకవర్గం ఆమోదంతో పనులు చేశారు. విడిపోయి కలిసి ఉండటం అంటే ఇదేనని చెప్పాలి.