Begin typing your search above and press return to search.

చంద్రబాబుని నమ్మితే రావు... ఎమ్మెల్యేలను నమ్మితే వస్తాయి !

కానీ కూటమిలో ఉన్న ఇతర పార్టీలు పొత్తు ధర్మం వంటి వల్ల కొన్ని పరిమితులు అయితే ఉన్నాయని అంటున్నారు.

By:  Tupaki Desk   |   5 Feb 2025 4:00 PM IST
చంద్రబాబుని నమ్మితే రావు... ఎమ్మెల్యేలను నమ్మితే వస్తాయి !
X

ఏపీలో అధికార కూటమికి టీడీపీ నాయకత్వం వహిస్తోంది. అక్కడ పెద్దన్న పాత్ర టీడీపీదే. ఇక తెలుగుదేశం పార్టీ అయిదేళ్ళ పాటు అధికారానికి దూరంగా ఉంది దాంతో బూత్ లెవెల్ నుంచి మొదలు పెడితే పై స్థాయి వరకూ టీడీపీలో నాయకులు మొత్తం పదవుల కోసం ఆశలు భారీగానే పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా తమ వారికి పదవులు ఇవ్వాలని చూస్తోంది. కానీ కూటమిలో ఉన్న ఇతర పార్టీలు పొత్తు ధర్మం వంటి వల్ల కొన్ని పరిమితులు అయితే ఉన్నాయని అంటున్నారు.

ఇదిలా ఉంటే తెలుగుదేశంలో కూడా నామినేటెడ్ పదవుల పందేరం స్టార్ట్ అయింది. ఈ విధంగా ఇప్పటికి చాలా మందికి పదవులు లభించాయి. ఇంకా అనేక పదవులు ఉన్నాయి వాటి కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. అయితే ఏ పదవి దక్కాలన్నా నేతలు ఎమ్మెల్యేల చుట్టూనే తిరుగుతున్నారు. వారి వల్లనే తమకు పదవులు దక్కుతాయని భావిస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఈ విధంగా చేయడం వల్ల ఎమ్మెల్యేల వద్దకు వెళ్ళి వారిని ప్రసన్నం చేసుకున్న వారికే ప్రాధాన్యత దక్కుతోందని అంటున్నారు. క్షేత్ర స్థాయిలో కష్టపడి పనిచేసిన వారికి పదవులు దక్కడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఎమ్మెల్యేలు తమకు కావాల్సిన వారికి అవసరం ఉన్న వారికే పెద్ద పీట వేస్తారు అని అంటున్నారు.

ఒక్కసారి గతంలోకి వెళ్తే వైసీపీ హయాంలో ఎమ్మెల్యేలకు జగన్ విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చారు. దాంతో వారే పదవులను అన్నీ తమకు ఇష్టమైన వారికి ఇచ్చేసారు అని గుర్తు చేస్తున్నారు. సర్పంచులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవులను తమ వారికి అస్మదీయులకి ఇచ్చి అంతా నా ఇష్టం అన్నట్లుగా చేశారు అన్నది కూడా అప్పట్లో ప్రచారం సాగింది.

దీని వల్ల అసలైన వారికి పార్టీ కోసం కష్టపడి పహిచేసిన వారికి పదవులు దక్కకుండా పోయాయని అంటున్నారు. ఆ మీదట క్యాడర్ లో విపరీతమైన అసంతృప్తి పెరిగి చివరికి వైసీపీకి 2024 ఎన్నికల్లో కేవలం 11 సీట్లు మాత్రమే దక్కాయని గుర్తు చేస్తున్నారు. ఇదంతా ఎమ్మెల్యేలకు ఫుల్ పవర్స్ ఇవ్వడం వల్ల వైసీపీ కోరి తెచ్చుకున్న కష్టం, అందుకోసం ఆ పార్టీ చెల్లించిన భారీ మూల్యం అని అంటున్నారు.

మరో వైపు చూస్తే టీడీపీ అధినాయకత్వం కూడా ఇపుడు వైసీపీ బాటన పడుతోందా అన్న చర్చ అయితే సాగుతోంది. తెలుగుదేశం పార్టీలో కూడా ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత అధికంగా ఉంటోంది. దాంతో వారు తమ చుట్టూ ఉన్న వారికే పదవుల విషయంలో సిఫార్సులు చేస్తారని అంటున్నారు. అలా పదవులు దక్కించుకున్న వారికి బాగానే ఉంటుంది కానీ అసలైన కార్యకర్తలకు మాత్రం తీరని అన్యాయం జరుగుతుందని అంటున్నారు.

ఇక చూస్తే చంద్రబాబు లోకేష్ ఇద్దరూ పనిచేసే వారికే పదవులు పార్టీ కోసం కష్టించిన వారికే అగ్ర తాంబూలం అని ప్రకటనలు గట్టిగా ఇస్తున్నా ఆచరణలో మాత్రం అలా జరుగుతోందా అన్న చర్చ మొదలైంది. గ్రౌండ్ లెవెల్ కి వెళ్ళి రియాలిటీస్ చూస్తే కనుక ఎవరు పనిచేస్తున్నారు ఎవరికి పదవులు ఇవ్వాలన్నది తెలుస్తుంది అని అంటున్నారు.

ఏ పార్టీకి అయినా క్యాడర్ పట్టుకొమ్మగా ఉంటుంది. క్యాడర్ ని పట్టించుకుని వారిని సమాదరిస్తేనే పదవులు దక్కుతాయి. ఈ విషయంలో వారికి న్యాయం జరిగేలా టీడీపీ సరైన పద్ధతిలో చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ హితైషులు సూచిస్తున్నారు. నమ్ముకున్న క్యాడర్ ని ఆదరిస్తేనే పార్టీకి మేలు జరుగుతుందని అంటున్నారు. మరి టీడీపీ హైకమాండ్ ఈ విషయంలో గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ ని తెప్పించుకుంటుందా అసలైన తమ్ముళ్ళకు అందలాలు దక్కుతాయా అంటే వేచి చూడాల్సిందే.