Begin typing your search above and press return to search.

అర్థరాత్రి పబ్బుల్లో పోలీసుల తనిఖీలు.. స్పెషల్ ఏమంటే?

హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సీపీ శ్రీనివాసరెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలకు తగ్గట్లే కార్యాచరణ మొదలైందని చెప్పాలి.

By:  Tupaki Desk   |   18 Dec 2023 4:39 AM GMT
అర్థరాత్రి పబ్బుల్లో పోలీసుల తనిఖీలు.. స్పెషల్ ఏమంటే?
X

మూడంటే మూడు నెలల్లో డ్రగ్స్ ఫ్రీగా హైదరాబాద్ మహానగరాన్ని చేస్తామంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ సీపీ శ్రీనివాసరెడ్డి నోటి నుంచి వచ్చిన మాటలకు తగ్గట్లే కార్యాచరణ మొదలైందని చెప్పాలి. గడిచిన ఐదారేళ్లుగా హైదాబాద్ మహానగరంలో భారీగా డ్రగ్స్ వినియోగం పెరిగిపోవటమే కాదు.. ఇంతకాలం కొన్ని వర్గాలకే పరిమితం అనుకున్న డ్రగ్స్ మధ్యతరగతి.. ఎగువ మధ్యతరగతికి చెందిన వారు సైతం వినియోగిస్తున్న దుస్థితి. అడప దడపా డ్రగ్స్ అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టినా.. దాని అంతు చూసేలా శపధం మాత్రం చేసింది లేదు.

తాజాగా మాత్రం అలాంటి పరిస్థితి కనిపిస్తోంది. సిటీ పోలీస్ కమిషనర్ గా వ్యవహరిస్తున్న కొత్తకోట శ్రీనివాసరెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత.. ఆయన ఫోకస్ చేస్తున్న ముఖ్యాంశాల్లో ఒకటి డ్రగ్స్ ఫ్రీ సిటీ. డ్రగ్స్ కు సిటీలోని పబ్బులు కూడా అడ్డాగా నిలుస్తున్నాయన్న ప్రచారం ఉంది. కానీ.. ఇప్పటివరకు అలాంటి ఆధారాలేమీ లభించని పరిస్థితి. ఇలాంటి వేళ.. ఆదివారం అర్థరాత్రి వేళ.. జూబ్లీహిల్స్ లోని మూడు పబ్బుల మీద పోలీసులు తనిఖీలు నిర్వమించటం ఆసక్తికరంగా మారింది.

కొత్త ఏడాది సమీపిస్తున్న వేళ.. డ్రగ్స్ వినియోగంపై పోలీసు శాఖ పెద్ద ఎత్తున ఫోకస్ పెట్టిందన్న విషయాన్ని తెలియజేయటంతో పాటు.. డ్రగ్స్ వినియోగంపై సీరియస్ గా ఉందన్న విషయాన్ని తెలిసేలా చేయటమే తాజా తనిఖీల లక్ష్యంగా చెబుతున్నారు. గతంలో మాదిరి డ్రగ్స్ ఆరోపణలపై తనిఖీలను తూతూ మంత్రంగా కాకుండా.. శాస్త్రీయంగా నిర్వహించేందుకు వీలుగా చర్యలు ఉంటాయని చెబుతున్నారు. ఇందులో భాగంగా డ్రంకెన్ డ్రైవ్ టెస్టులప్పుడు ఎలా అయితే.. పరీక్షలు చేస్తారో.. అదే రీతిలో ప్రత్యేక కిట్లతో టెస్టులు చేయనున్నట్లుగా తెలుస్తోంది.

ఇక.. తాజాగా నిర్వహించిన తనిఖీల్ని చూస్తే.. తొలిసారి స్నిపర్ డాగ్స్ తో తనిఖీలు చేపట్టటం ఆసక్తికరంగా మారింది. డ్రగ్స్ తో పాటు.. మాదక ద్రవ్యాల్ని గుర్తించే ఈ శునకాల్ని రంగంలోకి దించటం ద్వారా డ్రగ్స్ విషయంలో పోలీసులు ఎంత సునిశితంగా ఉన్నారన్న విషయం అర్థమయ్యేలా చేస్తుందంటున్నారు. డ్రగ్స్ నిర్మూలనకు పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకోవాలన్న ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలతో మరింత ఎక్కువగా ఫోకస్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అర్థరాత్రి దాటినతర్వాత నిర్వహించిన ఈ తనిఖీలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.