Begin typing your search above and press return to search.

తెలంగాణ పోలీసుల చేతిలో గరుడాస్త్రం

తుపాను సమయాల్లోనూ డేగలు మేఘాల కంటే ఎత్తులోకి వెళ్లే సామర్థ్యం ఉంటుంది.

By:  Tupaki Desk   |   14 March 2024 9:30 AM GMT
తెలంగాణ పోలీసుల చేతిలో గరుడాస్త్రం
X

అవును.. తెలంగాణ పోలీసుల చేతిలో సరికొత్త ఆయుధం ఒకటి వచ్చింది. మావోలను గుర్తించేందుకు.. సంక్లిష్టమైన ప్రాంతాల్లో సమాచారాన్ని సేకరించటం కూడా ఈ గరుడాస్త్రాన్ని ప్రయోగించేందుకు వీలవుతుంది. అంతేనా.. అనధికారిక డ్రోన్ల మీదా నిఘాకు అవకాశం ఉంటుంది. ఇంతకూ ఈ గరుడాస్త్రం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు సమాధానం వెతికితే ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇంతకూ తెలంగాణ పోలీసుల చేతికి చేరిన ఈ గరుడాస్త్రాలేమిటంటే.. నిజమైన గద్దలు మూడింటికి ప్రత్యేక శిక్షణను అందించారు.

ఇప్పటివరకు గుర్రాలు.. పావురాలు.. కుక్కలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి పోలీసింగ్ కు సాయంగా వాటిని సిద్ధం చేసుకునే అధికారులు ఇప్పుడు వాటితో తోడుగా డేగల్ని రంగంలోకి దించారు. నెదర్లాండ్స్ లాంటి దేశాల్లో నిఘా కోసం గద్దల్ని వినియోగిస్తుంటారు. ఇదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి డేగల్ని పోలీసు సేవలకు వినియోగించేలా తర్ఫీదు ఇచ్చారు. తొలుత పావురాలకు శిక్షణ ఇవ్వాలని భావించారు కానీ ప్రతికూల వాతావరణంలో వాటితో పని చేయటం కష్టమన్న విషయాన్ని గుర్తించిన అధికారులు వాటికి బదులుగా డేగల్ని రంగంలోకి దించారు.

తుపాను సమయాల్లోనూ డేగలు మేఘాల కంటే ఎత్తులోకి వెళ్లే సామర్థ్యం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు నల్లమల అడవుల నుంచి రెండేళ్ల వయసున్న మూడు డేగ పిల్లల్ని తీసుకొచ్చారు. మూడేళ్లుగా వాటికి మొయినాబాద్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీలో నిపుణుల చేత ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నారు. త్వరలో వీటికి ఇస్తున్న ట్రైనింగ్ పూర్తి కానుంది. వీటిని వెంటనే విధుల్లోకి చేర్పించనున్నారు. ఇటీవల శిక్షణ ఇచ్చిన డేగల పని తీరును పరీక్షించగా వాటి పని తీరు అనుకున్న దాని కంటే మెరుగ్గా ఉందన్న విషయాన్ని గుర్తించారు.

వీటి సాయంతో అడవుల్లో నక్కి ఉండే మావోలతో పాటు.. సంఘ విద్రోహక శక్తుల్ని గుర్తించే వీలుంది. అంతేకాదు.. ఈ డేగలు రెండు కేజీల దాకా బరువును కొన్ని కిలోమీటర్ల వరకు మోసుకు వచ్చే సత్తా ఉంది. అంతేకాదు.. ఎక్కడైనా అవాంఛనీయమైన డ్రోన్ల సంచారం ఉంటే.. వాటిని పట్టేసే సత్తా వీటి సొంతం. వీవీఐపీల రక్షణకు వీటిని ఉపయోగించేందుకు వీలుగా వీటిని సిద్ధం చేశారు.