Begin typing your search above and press return to search.

6 మంత్రి పదవులు.. 15 మంది పోటీ.. దక్కేదెవరికో?

మరోవైపు ఆరు మంత్రి పదవులకు 15 మంది వరకు నాయకులు పోటీ పడుతున్నారు. అంటే రెట్టింపు సంఖ్యకు పైగానే అన్నమాట.

By:  Tupaki Desk   |   10 Dec 2023 9:41 AM GMT
6 మంత్రి పదవులు.. 15 మంది పోటీ.. దక్కేదెవరికో?
X

తెలంగాణ ప్రభుత్వం తొలి విడత మంత్రివర్గ కూర్పు పూర్తయింది. సీఎం రేవంత్ సామాజిక సమతూకం పాటిస్తూ.. ప్రాంతీయ ప్రాధాన్యం ఇస్తూ.. పెద్ద సంఖ్యలో సీట్లు వచ్చిన జిల్లాలకు పెద్ద పీట వేస్తూ.. సీనియర్లను గౌరవిస్తూ.. మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు రాజకీయ అనుభవాన్ని బట్టి శాఖలను కేటాయించారు. కాగా, తెలంగాణ శాసన సభలో ఎమ్మెల్యేల సంఖ్య 119. ముఖ్యమంత్రి సహా గరిష్టంగా 18మంది మంత్రులకు అవకాశం ఉంటుంది. గురువారం సీఎంతో సహా 12 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. దీంతో ఇంకా ఆరుగురికి అవకాశం ఉంది.

పదవులకు రెట్టింపుగా ఆశావహులు

తెలంగాణ మంత్రివర్గంలో రాజధాని హైదరాబాద్ సహా నాలుగు జిల్లాల (రంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్)కు ప్రస్తుతానికి ప్రాతినిధ్యం లేదు. వీటిలో హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ఎమ్మెల్యేలు లేరు. రంగారెడ్డి జిల్లా నుంచి స్పీకర్ గా వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ కు అవకాశం దక్కనుంది. ఆదిలాబాద్, నిజామాబాద్ లో కాంగ్రెస్ కు తక్కువ స్థానాలు వచ్చాయి. మరోవైపు ఆరు మంత్రి పదవులకు 15 మంది వరకు నాయకులు పోటీ పడుతున్నారు. అంటే రెట్టింపు సంఖ్యకు పైగానే అన్నమాట.

ఓడినవారికీ చాన్సుందా?

తొలి విడత మంత్రి వర్గం ఏర్పాటు సందర్భంగా కాంగ్రెస్ అధిష్ఠానం స్పష్టమైన విధానంతో ముందుకెళ్లినట్లు తెలుస్తోంది. తొలిసారి చట్ట సభలకు ఎన్నికైనవారికి, ఇటీవలి ఎన్నికల్లో ఓడినవారికి మంత్రులుగా అవకాశం ఇవ్వలేదు. మలి విడతలో మరి ఏం చేస్తుందనేది చూడాలి. ఎన్నికల్లో ఓడినవారికీ అవకాశం ఇస్తుందా? గతంలో మంత్రులుగా, ఎంపీలుగా పనిచేసినవారిని తీసుకుంటుందా? అనేది చూడాలి. ఇప్పటివరకైతే.. షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మైనంపల్లి హనుమంతరావు, సుదర్శన్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి, వివేక్, వినోద్, మదన్ మోహన్ రావు, మధు యాస్కీ, అద్దంకి దయాకర్, బాలూనాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. ఇక వీరిలో షబ్బీర్, ఫిరోజ్, మధు యాస్కీ, మైనంపల్లి, అంజన్ ఎన్నికల్లో ఓడారు. నిజామాబాద్ నుంచి మదన్ మోహన్, సుదర్శన్ రెడ్డి మధ్య పోటీ ఉంది. ఆదిలాబాద్ లో వినోద్ , వివేక్ లలో ఎవరికి చాన్సు దక్కతుందో చూడాలి? చివరి క్షణంలో అద్దంకి దయాకర్ తన సీటును త్యాగం చేశారు. మరి వీరిలో సామాజిక సమీకరణాలు కూడా చూడాలి.

ఇప్పటికే కేబినెట్ లో ముగ్గురు రెడ్లకు చాన్సిచ్చారు. కమ్మ, వెలమ, బ్రాహ్మణ వర్గాల నుంచి ఒక్కొక్కరు, బీసీలు ఇద్దరు, ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరిని తీసుకున్నారు. వీరు కాక పైన చెప్పుకొన్నవారిలో కులాల సమీకరణాన్ని బేరీజు వేసి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. మైనారిటీ కోటాలోనూ ఒకరిని పరిశీలించాలి. ఎమ్మెల్సీలుగా ఉన్నవారికీ కేబినెట్ లో చోటివ్వాలి. ఇవన్నీ తేలేందుకు మరో ఆరు నెలలైనా పడుతుందనడంలో సందేహం లేదు.