Begin typing your search above and press return to search.

ఆ సీట్లకు తగ్గేది లేదంటున్న టీడీపీ..పొత్తు పోటు ఎవరిది...!?

ఆయన యువగళం పాదయాత్ర ముగింపు తరువాత వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేశారు.

By:  Tupaki Desk   |   19 Feb 2024 3:54 AM GMT
ఆ సీట్లకు తగ్గేది లేదంటున్న టీడీపీ..పొత్తు పోటు ఎవరిది...!?
X

తెలుగుదేశం పార్టీ మనసులో మాటను ఇప్పటికి రెండు నెలల క్రితం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పేశారు. ఆయన యువగళం పాదయాత్ర ముగింపు తరువాత వరసబెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చేశారు. అందులో చాలా విషయాలు కుండబద్ధలు కొట్టారు.

దాని ప్రకారం చూస్తే 145 నుంచి 150 సీట్లకు తగ్గకుండా టీడీపీ పోటీ చేసి తీరుతుందని ఒక మాట కూడా ఆయన చెప్పారు. లోకేష్ ఈ మాట చెప్పేనాటికి బీజేపీ పొత్తులో లేదు. కానీ ఉంటుందని ఆలోచనలు ఉన్నాయి. ఇపుడు చూస్తే బీజేపీ కూడా పొత్తు కూడుతోంది. మరి బీజేపీ పొత్తులోకి వస్తే టీడీపీ మొదటి నుంచి అనుకుంటున్నట్లుగా 150 సీట్లకు పోటీ చేయగలదా అన్నదే సందేహం.

దానికి టీడీపీ వద్ద సరిపడా వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. అవసరం అయితే ఒక అయిదో పదో తగ్గించుకుంటారు కానీ 140 కి మాత్రం అసలు తగ్గకుండా పోటీ చేయడం ఖాయమని అంటున్నారు. ఈ నంబర్ నే ఫైనల్ అనుకుంటే పొత్తులో మిత్రులకు వదిలేది ఎన్ని సీట్లు అంటే కచ్చితంగా ముప్పయి అయిదు సీట్లు మాత్రమే.

ఈ సీట్లలోనే బీజేపీ జనసేనలను పంచుకోమని కోరుతుంది అని అంటున్నారు. ఇక బీజేపీకి నచ్చచెప్పడానికి మరో సులువు కూడా టీడీపీ వెతుకుతోంది. అదేంటి అంటే ఎంపీ సీట్లు ఒకటికి రెండు అదనంగా ఇస్తామని. 2014లో నాలుగు ఎంపీ సీట్లు బీజేపీకి పొత్తులో భాగంగా ఇచ్చారు. ఈసారి దాన్ని ఆరుకు చేస్తామని టీడీపీ ప్రతిపాదిస్తోంది.

అప్పట్లో 12 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఇస్తే గెలిచింది నాలుగే. దాంతో ఆ నాలుగుకు రెట్టింపు అంటే ఎనిమిది అసెంబ్లీ సీట్లు ఇస్తామని ప్రతిపాదిస్తోంది. బీజేపీకి ఎనిమిది సీట్లు పోతే ముప్పయి అయిదులో మిగిలిన ఇరవై ఏడు సీట్లూ జనసేనకు వదులుతారు అన్న మాట. ఈ నెంబర్ కూడా టీడీపీ అనుకూల మీడియాలో చాలా కాలం క్రితమే వచ్చింది.

అంటే టీడీపీ ఎన్ని సీట్లు ఎవరికి ఇవ్వబోతోంది అన్నది చాలా కాలం క్రితమే ఫిక్స్ అయిన మ్యాటర్ అని అంటున్నారు. ఇక టీడీపీ పూర్తిగా కంఫర్టబుల్ జోన్ లో ఉంటూ 140 సీట్లకు తగ్గకుండా పోటీ చేస్తే పొత్తు పార్టీల ఓట్ల మద్దతుతో సులువుగా 88 మ్యాజిక్ నెంబర్ ని దాటేయవచ్చు అన్నది ఒక లెక్క పెట్టుకుంది. ఎటు నుంచి కధ ఎటు తిరిగినా తమకు పూర్తి మెజారిటీ ఉండాలని ప్రభుత్వాన్ని సొంతంగా తామే నడపాలని పంతంతో టీడీపీ ఉంది.

అయితే ఏపీలో సంకీర్ణ ప్రభుత్వమే రావాలని అందులో అందరికీ భాగం ఉండాలని బీజేపీ అంటోందని చెబుతున్నారు. బీజేపీ ఎట్టి పరిష్తితుల్లలోనూ ఇరవైకి తగ్గకుండా ఎమ్మెల్యే సీట్లు పదికి తగ్గకుండా ఎంపీ సీట్లూ టీడీపీని కోరుతోంది అని అంటున్నారు. అవి కూడా తాము కోరుకున్న సీట్లలోనే ఇవ్వాలని పేచీ పెడుతోంది. అదే విధంగా జనసేనకు ముప్పయి సీట్లకు తగ్గకుండా చూడాలని అంటోంది. అంటే యాభై సీట్లు ఈ రెండు పార్టీలు తీసుకుని టీడీపీని 125 సీట్లకే పోటీ చేయిస్తే మ్యాజిక్ ఫిగర్ 88 టీడీపీకి సొంతంగా రాదని అపుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కాషాయదళం ఆలోచన. ఇదే జరగాలని వారి ఆకాంక్ష కూడానట.