Begin typing your search above and press return to search.

మార్చిలో రాజ్యసభ ఎన్నికలు.. టీ కాంగ్రెస్ కు 2.. బీఆర్ఎస్ కు 1

తాజాగా మారిన పార్టీల బలాల కారణంగా అధికార కాంగ్రెస్ కు 2 స్థానాలు.. బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కనుంది. అంటే.. రాజ్యసభలో కాంగ్రెస్ బలం మరో రెండుస్థానాలు పెరగనున్నాయన్న మాట.

By:  Tupaki Desk   |   30 Dec 2023 4:08 AM GMT
మార్చిలో రాజ్యసభ ఎన్నికలు.. టీ కాంగ్రెస్ కు 2.. బీఆర్ఎస్ కు 1
X

మరో మూడు నెలల్లో రాజ్యసభలో తెలంగాణ రాష్ట్రం వరకు మూడు స్థానాలు ఖాళీ కానున్నాయి. ప్రస్తుతం ఈ మూడుస్థానాల్లోనూ అధికార బీఆర్ఎస్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా వ్యవహరిస్తున్న వద్దిరాజు రవిచంద్ర.. జోగినపల్లి సంతోష్ కుమార్.. బడుగుల లింగయ్య యాదవ్ లు రిటైర్ కానున్నారు. వీరి స్థానంలో మరో ముగ్గురిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. తాజాగా మారిన పార్టీల బలాల కారణంగా అధికార కాంగ్రెస్ కు 2 స్థానాలు.. బీఆర్ఎస్ కు ఒక స్థానం దక్కనుంది. అంటే.. రాజ్యసభలో కాంగ్రెస్ బలం మరో రెండుస్థానాలు పెరగనున్నాయన్న మాట.

అసెంబ్లీలో తాజాగా నెలకొన్న సమీకరణాల నేపథ్యంలో ఏకగ్రీవమే తప్పించి.. పోటీకి ఛాన్సే లేదంటున్నారు. దీనికి కారణం లేకపోలేదు. రాజ్యసభ ఎన్నికల్లో కోటా ఓట్లు.. అదేనండి ఒక అభ్యర్థి గెలవటానికి అవసరమైన ఓట్లను చూస్తే.. 30 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు. సాధారణంగా అనుసరించే ఫార్ములా ప్రకారం.. తెలంగాణ వరకు ఏ పార్టీ అయినా 30 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. ఒక రాజ్యసభ సభ్యుడ్ని ఎంపిక చేసుకునే వీలుంది.

ఈ లెక్కలో చూసుకుంటే.. ఖాళీ అయ్యే మూడు స్థానాల్లో.. అధికార కాంగ్రెస్ కు ఇప్పుడు 64 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మిత్రపక్షమైన సీపీఐకు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. ఆయనతో కలిపి కాంగ్రెస్ బలం 65 అనుకుంటే.. 30 మంది ఎమ్మెల్యేలు చొప్పున రెండు స్థానాలను మాత్రమే గెలుచుకునే వీలుంది. విపక్ష బీఆర్ఎస్ విషయానికి వస్తే.. ఆ పార్టీకి ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ సైతం ఒక రాజ్యసభ స్థానానికి మాత్రమే పోటీ చేయాల్సి ఉంటుంది. కాదు.. కూడదు అనుకుంటే మిత్రుడు మజ్లిస్ ఎమ్మెల్యేల్ని కలుపుకున్నా.. 46 మంది ఎమ్మెల్యేలే చేతిలో ఉంటారు. ఇద్దరు రాజ్యసభ్యులను ఎంపిక చేయాలంటే 60 మంది ఎమ్మెల్యేలు అవసరం. అంటే.. ఉన్న బలం కంటే 14 మంది ఎమ్మెల్యేలు అవసరం. ఇది అసాధ్యం కావటంతో.. తమకున్న బలానికి అనుగుణంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తారని అంటున్నారు.

అంటే.. అధికార కాంగ్రెస్ ఇద్దరి పేర్లను ప్రకటిస్తే.. విపక్ష బీఆర్ఎస్ ఒక అభ్యర్థి పేరు ప్రకటించాల్సి ఉంటుంది. ఇదే జరిగితే ఎన్నిక అంటూ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. కాదని పోటీకి దిగినప్పటికి గెలిచే అవకాశం ఉన్న బలాల ప్రకారం కూడా 2.. 1 చొప్పునే రానుంది. ఎన్ని లెక్కలు వేసుకున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరికి వారు తమబలానికి అనుగుణంగా అభ్యర్థుల్ని బరిలోకి దింపితే ఓటింగ్ లేకుండా.. ఏకగ్రీవంతో సరిపోతుంది. అలా కాదని పోటీకి దిగితే అభాసుపాలు కావటం ఖాయమని చెప్పాలి. ఇక.. ఈ రెండు పార్టీలు రాజ్యసభ సభ్యులుగా ఎవరిని ఎంపిక చేస్తాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.