అసలు సినిమా శుక్రవారం నుంచే.. అతిరథుల ఆగమనం!
ఇక, అసలు సినిమా.. ఫుల్ లెంగ్త్‌లో శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని చెబుతున్నారు. దీనికి కారణం.. అతిరథుల ఆగమనమే!
By: Tupaki Desk | 23 Nov 2023 3:24 PM GMTతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే అన్ని పార్టీలు ప్రచార హోరు.. జోరు.. పెంచాయి. ఓవైపు తీరిక లేకుండా.. నాయకులు ప్రచారాన్ని సాగిస్తున్నారు. హాట్ కామెంట్లతో.. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎన్నికల ప్రచారాన్ని వేడెక్కించారు. అయితే.. ఇప్పటి వరకు చూసింది హాఫ్ మూవీనే అంటున్నారు పరిశీలకులు. ఇక, అసలు సినిమా.. ఫుల్ లెంగ్త్‌లో శుక్రవారం నుంచి ప్రారంభం కానుందని చెబుతున్నారు. దీనికి కారణం.. అతిరథుల ఆగమనమే!
గురువారం సాయంత్రంతో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిపోయింది. దీంతో కీలకమైన బీజేపీ, కాంగ్రెస్ అగ్రనాయకులు అందరూ కొంత రిలీఫ్ అయ్యారు. అయితే.. రిలాక్స్ కాకుండా.. వెంటనే తెలంగాణలో మైకులు పట్టుకునేందుకు బయలు దేరి వచ్చేస్తున్నారు. రాజస్థాన్‌లో ప్రచారాన్ని దుమ్ము రేపిన ఈ రెండు పార్టీలు.. ఇప్పుడు తెలంగాణపై పూర్తిగా ఫోకస్ పెంచాయి. అంతేకాదు.. ఇక, తెలంగాణ తర్వాత.. ఎన్నికల జరిగే రాష్ట్రం ఇప్పట్లో లేదు.
దీంతో పూర్తిగా తెలంగాణపైనే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనాయకులు పూర్తిగా ఫోకస్ పెట్టేశాయి. దీంతో కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, చిదంబరం వంటి అగ్రనాయకులు హైదరాబాద్‌కు వచ్చేస్తున్నారు. వీరికి తాజ్ కృష్ణ సహా.. ఇతర ప్రదాన హోటళ్లలో రూములు కూడా బుక్క య్యాయి. వీరు వచ్చే నాలుగు రోజులు(ఎన్నికల ప్రచారం ముగిసేవరకు) తెలంగాణలోనే ఉండనున్నారు.
ఇక, మరోవైపు బీజేపీ అగ్రనాయకులు.. ప్రధాని మోడీ మినహా, హోం మంత్రి అమిత్‌షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌లు కూడా శుక్రవారం హైదరాబాద్‌లో వాలిపోనున్నారు. మోడీ మాత్రం ఈ నెల 25న రానున్నారు. 25 నుంచి 28 వరకు ఆయన కూడా.. తెలంగాణలో ప్రచారం చేయనున్నారు. ఇక, ఇప్పటికే బీఆర్ ఎస్ సహా కమ్యూనిస్టులు.. ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లోఅగ్రనేతల తాకిడితో తెలంగాణ ప్రచారంలో అసలు సినిమా ప్లే అవుతుందని అంటున్నారు పరిశీలకులు.