ప్రయాణికులకు గుడ్ న్యూస్... ‘చిల్లర’ సమస్యలకు అలా చెల్లు చీటి!
ఆర్టీసీ బస్సుల్లో ప్రయణించే సమయంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్యల్లో టిక్కెట్ కు సరిపడా చిల్లర ఇవ్వలేకపోవడం ఒకటి.
By: Tupaki Desk | 3 March 2025 8:00 AM ISTఆర్టీసీ బస్సుల్లో ప్రయణించే సమయంలో ప్రధానంగా ఎదురయ్యే సమస్యల్లో టిక్కెట్ కు సరిపడా చిల్లర ఇవ్వలేకపోవడం ఒకటి. ‘టిక్కెట్టుకు సరిపడా చిల్లర ఇవ్వండి.. కండక్టర్ కు సహకరించండి’ అని సూచనలు బస్సులో కనిపించినప్పటికీ.. 10 రూపాయల దూరానికి 500 నోటు ఇచ్చేవారు.. రూ.12 టిక్కెట్ కి రూ.100 ఇచ్చేవారు కనిపిస్తుంటారని అంటారు.
దీంతో.. పెద్ద నోటు ఇచ్చినా, చిల్లర ఇవ్వాల్సి వచ్చినా కండక్టర్ కు అది చికాకుగా అనిపిస్తుంటుంది. కారణం.. ప్రయాణికుడుది ఇండివిడ్యువల్ సమస్య కాగా.. కండెక్టర్ ది అందరికీ సర్థిచెప్పాల్సిన, సమకూర్చాల్సిన సమస్య. ఈ సమయంలో ప్రయాణికులకు, కండెక్టర్ కు పలుమార్లు గొడవలు అవుతుంటాయి. కొన్నిసార్లు టిక్కెట్ వెనుక రాసి ఇస్తుంటారు.
దిగేటప్పుడు ఆ టిక్కెట్ చూపించి చిల్లర తీసుకోమని కండక్టర్ చె బుతుంటారు. అయితే.. కొన్ని సందర్భాల్లో ఆ విషయం మరిచిపోయి ఆ తర్వాత బాధపడే ప్రయాణికుల సంఖ్యా తక్కువేమీ కాదు. ఈ నేపథ్యంలో కొంతమంది మాత్రం టిక్కెట్ కు సరిపడా చిల్లర ఇచ్చి సహరిస్తుంటారు. ఏది ఏమైనా... ఈ చిల్లర సమస్యకు చెక్ పెట్టాలని ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... ఆర్టీసీ బస్సుల్లో 'చిల్లర' సమస్యకు చెక్ పెట్టేందుకు తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా... ఇకపై బస్సుల్లో ఆన్ లైన్ టికెటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. దీంతో... సిటీ బస్సుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్ తో ప్రయాణం చేయవచ్చని తెలిపింది. అంటే.. యూపీఐ పేమెంట్స్ ద్వారా టిక్కెట్ తీసుకోవచ్చన్నమాట.
ప్యాసింజర్లకు, కండక్టర్లకు మధ్య చిల్లర వల్ల వచ్చే గొడవలకు స్వస్థి పలికేందుకే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో.. ఆటోమెటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ లో భాగంగా ఈ విధానం తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు! ఇదే సమయంలో.. త్వరలో మరిన్ని ఆన్ లైన్ సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు!