తిరుమలకు వెళ్లే రాజకీయ నేతలకు బీ అలర్ట్..
తిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు వచ్చిన రాజకీయ నాయకుల పట్ల ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.
By: Tupaki Desk | 30 Nov 2024 11:21 AM GMTతిరుమల తిరుపతి దేవస్థానం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. తిరుమల దేవుడిని దర్శించుకునేందుకు వచ్చిన రాజకీయ నాయకుల పట్ల ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. దీంతో పొలిటికల్ లీడర్స్‌ను టీటీడీ నిర్ణయం ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన పొలిటికల్ లీడర్లు చానళ్లతో ఇప్పటివరకు రాజకీయ గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతూ వచ్చారు. ఈ క్రమంలో టీటీడీ ఇక నుంచి వాటికి ఆస్కారం లేకుండా నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులు తిరుమలను దర్శించుకున్న అనంతరం చేస్తున్న పొలిటికల్ వ్యాఖ్యలు వివాదస్పదం అవుతున్నాయి. దీంతో టీటీడీ ఈ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇకపై తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది. తిరుమల కొండపై రాజకీయ ప్రసంగాలను పూర్తిగా నిషేధించింది.
తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతినకుండా టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే.. తిరుమలకు వచ్చిన వారికి మరింత ప్రశాంతత కల్పించేలా కొత్త బోర్డు ఈ విధంగా ఆలోచించింది. నిత్యం గోవింద నామ స్మరణతో మారుమోగే పవిత్రమైన తిరుమల దివ్య క్షేత్రంపై ఈ రాజకీయ ప్రసంగాలతో వాతావరణం చెడిపోతున్నదని బోర్డు భావించింది. ఇక మైక్ దొరికిందే తడవుగా.. రాజకీయ నాయకులు సైతం తమ నోటికి పనిచెప్తున్నారు. ఇష్టారీతిన ప్రసంగాలు చేస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనివల్ల తిరుమలలో ఆధ్యాత్మిక వాతావరణం దెబ్బతింటున్నదని టీటీడీ భావించింది.
అందుకే.. ఇక నుంచి రాజకీయ ప్రసంగాలకు చెక్ పెట్టాలని బోర్డు ఇటీవల తీర్మానించింది. ఇందులో భాగంగా ఇకపై తిరుమలకు వచ్చే పొలిటికల్ లీడర్స్ రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రసంగాలు చేయొద్దని విజ్ఞప్తి చేసింది. అలాంటి ప్రసంగాలకు దూరం ఉండాలని అభ్యర్థించింది. సిబ్బంది కూడా వాటిని ఎంకరేజ్ చేయొద్దని ఆదేశించింది. ఇప్పటికే ఈ నిబంధన మీద తీర్మానం చేయగా.. ఈ రోజు నుంచే అమల్లోకి తీసుకొచ్చారు. ఈ రోజు నుంచి కొండ మీద ఎలాంటి రాజకీయ ప్రసంగాలకు ఆస్కారం లేదు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నారు. పొలిటికల్ లీడర్లు బీ అలర్ట్.. తిరుమలకు వెళ్లి మునుపటిలా రాజకీయ ప్రసంగాలు చేయకుండా జాగ్రత్తలు పాటించండి అని నెటిజన్లు సూచిస్తున్నారు. అలాగే.. టీటీడీ తీసుకున్న నిర్ణయాన్ని సైతం అభినందిస్తున్నారు. మనశ్శాంతి కోసమే దేవుడి దర్శనానికి వస్తే అక్కడ ఈ రాజకీయ ప్రసంగాలతో వాతావరణాన్ని కలుషితం చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.