Begin typing your search above and press return to search.

సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బ తీసేలా కథనం ప్రచురించిన సాక్షి మీడియా సంస్థపై టీటీడీ ఫిర్యాదు చేసింది

By:  Tupaki Desk   |   8 Oct 2024 6:30 AM GMT
సాక్షి కథనంపై టీటీడీ కేసు.. అసలేం జరిగింది?
X

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దెబ్బ తీసేలా కథనం ప్రచురించిన సాక్షి మీడియా సంస్థపై టీటీడీ ఫిర్యాదు చేసింది. ప్రాథమిక ఆధారాల్ని పరిశీలించిన పోలీసులు.. తిరుమల టూటౌన్ పోలీస్ స్టేషన్ లో కేసును నమోదు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు వచ్చిన ముఖ్యమంత్రిచంద్రబాబు టీటీడీ అధికారులతో రివ్యూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పబ్లిష్ చేసిన వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది.

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా తిరుమలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రావటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన నిర్వహించిన సమీక్షలో భాగంగా.. ‘‘తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిపై మన స్టాండ్ ఏంటో మీకు తెలుసు కదా. సీబీఐ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే సిట్ టీం విచారణకు వస్తే అంతా ఒకే మాట చెప్పాలి. ఆ మేరకు అందరికీ ట్రైనింగ్ ఇవ్వండి’’ అంటూ సమీక్షకు హాజరైన అధికారులకు చెప్పినట్లుగా ‘నేను చూసుకుంటా’ అన్న శీర్షికతో ప్రచురితమైన కథనంలో పేర్కొన్నారు.

దీనిపై టీటీడీ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. అందులో ఒక్క అంశం కూడా సత్యం కాదని.. అన్ని అసత్యాలేనని మండిపడింది. సాక్షి యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే కథనాన్ని ప్రచురించిందని.. నైతికంగా దానికి సంబంధించిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ డిప్యూటీ ఈవో కంప్లైంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సాక్షి యాజమాన్యం మీద బీఎన్ఎస్ సెక్షన్లు 353(2), 356, 196(1)(ఎ) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.