టీటీడీ చైర్మన్ గా ఆయనే సూటబుల్ అంటూ !
ఒక వైపు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం మీద వివాదం కొనసాగుతోంది. అది రాజకీయ మలుపు తీసుకుని మంట పెడుతోంది.
By: Tupaki Desk | 28 Sep 2024 12:30 AM GMTఒక వైపు తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ప్రసాదం మీద వివాదం కొనసాగుతోంది. అది రాజకీయ మలుపు తీసుకుని మంట పెడుతోంది. అదే సమయంలో టీటీడీ వంటి పవిత్రమిన ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ టెంపుల్ కి చైర్మన్ గా ఎవరు ఉండాలి అన్న దాని మీద చర్చ సాగుతోంది. టీటీడీని రాజకీయ పెత్తనం నుంచి వేరు చేయాలని కూడా హిందూ ధార్మిక సంస్థలు ఒక వైపు డిమాండ్ చేస్తున్నాయి.
అయితే అలా జరిగేందుకు ప్రస్తుతానికి ఏ రకమైన అవకాశాలు లేవు. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం టీటీడీకి కొత్త బోర్డుని ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే ఇరవై దాకా నామినేటెడ్ పోస్టులను ప్రకటించిన టీడీపీ కూటమి లడ్డూ ప్రసాదం వివాదం నేపథ్యంలో టీడీపీ బోర్డు చైర్మన్ పదవిని మాత్రం అలా పెండింగులో పెట్టింది. దాంతో పాటు పాలకవర్గం విషయంలోనూ ఆలోచన చేస్తోంది.
వైసీపీ హయాంలో జెంబోజెట్ పాలక వర్గం ఉంది. అది కాస్తా అర్ధ సెంచరీని మించి పోయింది అని అంటున్నారు. దానిని సైజ్ తగ్గించడమే కాకుండా అందరి అభిప్రాయాలను తీసుకుని ఇతర రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు అలాగే కేంద్ర పెద్దల నుంచి కూడా వచ్చే సిఫార్సుల ను పరిగణనలోకి తీసుకుని పాలక మండలిని నియమించడానికి టీడీపీ కూటమి చూస్తోంది అని అంటున్నారు.
ఇపుడున్న పరిస్థితులలో కొంత ఆగినా పెద్దగా ఆలస్యం చేయకుండానే టీటీడీ పాలక వర్గాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చూస్తోంది అని అంటున్నారు. ఎందుకంటే అధికారుల వ్యవస్థతో పాటు సరైన పాలక వర్గం ఉంటే మరింత సమర్ధంగా టీటీడీ పాలన సాగడానికి వీలు ఉంటుందని అంటున్నారు.
దీంతో అనేక పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాతో పాటు కొన్ని మీడియా వర్గాలలో కూడా ఒక పేరు చక్కర్లు కొడుతోంది. ఇది పుకార్లుగానే ప్రచారంలో ఉంది. టీటీడీ కొత్త చైర్మన్ గా సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణను ఈ కీలకమైన ప్రతిష్టాత్మకమైన పదవిలోకి తెస్తే ఎలా ఉంటుంది అన్న చర్చ సాగుతోంది.
జస్టిస్ ఎన్వీ రమణ శ్రీ వెంకటేశ్వరస్వామి వారి పరమ భక్తుడు. అంతే కాదు ఆయన దేశంలోనే అత్యున్నత న్యాయ స్థానం ప్రధాన న్యాయ మూర్తిగా విశేష సేవలు అందించారు. అందువల్ల ఆయనకు ఆ కీలకమైన పదవిని అప్పగిస్తే అందరి సర్వామోదం ఉంటుందని కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోంది అని అంటున్నారు.
చీఫ్ జస్టిస్ గా ఉన్నపుడు అనేకసార్లు ఎన్వీ రమణ శ్రీవారి దర్శనానికి వచ్చారు. ఆయన వంటి వారు ఉంటే తిరుమల తిరుపతి పాలన మరో మెట్టు పైన ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఇది సోషల్ మీడియా ద్వారా సూచనల మేరకు వచ్చిందా లేక కూటమి ప్రభుత్వం ఆ విధంగా ఆలోచిస్తోందా అన్నది అయితే తెలియడం లేదు.
అయితే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవిని మాత్రం రాజకీయ ప్రమేయం లేని వారికి సమాజంలో ఉన్నత స్థాయి గౌరవాలు కలిగిన వారికే ఇస్తారు అన్నది ప్రచారంగా ఉంది. ఇక చూస్తే ఇప్పటిదాకా అనేక మంది పేర్లు టీటీడీ చైర్మన్ పదవికి వినిపించాయి. అందులో రాజకీయ నేతల పేర్లతో పాటు ఒక మీడియా అధిపతి పేరు కూడా ప్రచారం లోకి వచ్చింది.
ఒక దశలో సదరు మీడియా అధిపతికి టీటీడీ చైర్మన్ పోస్టు ఖరారు అయింది అని కూడా చెప్పుకున్నారు. ఇక ప్రకటన వెలువడడమే ఖాయమని అంతా అనుకున్నారు. కానీ ఇంతలోనే చాలా పరిణామాలు జరిగిపోయాయి. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం మాత్రం టీటీడీ కి పాలక వర్గాన్ని నియమించి ఆ బాధ్యతలు అన్నీ వారికి వదిలేసి తమ దైనందిన పాలనలో నిమగ్నం కావాలని చూస్తోది అని అంటున్నారు. ఈ పరిణామాలతో జస్టిస్ ఎన్వీ రమణ పేరుని ఖరారు చేస్తారా అన్నది అయితే అంతటా ఉత్కంఠను రేపుతోంది.