6గురు మృతి.. 25 మందికి గాయాలు.. టీటీడీ చెప్పిన కారణం ఇదే!
ఇదే సమయంలో... గాయపడిన 25 మందిని ప్రభుత్వ రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు.
By: Tupaki Desk | 9 Jan 2025 4:10 AM GMTశ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. సుమారూ 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన ఒక్కసారిగా షాకింగ్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించి అధికారులపై చంద్రబాబు సీరియస్ గా స్పందించారు. ఈ సమయంలో తొక్కిసలాటకు గల కారణాన్ని టీటీడీ ఛైర్మన్ తెలిపారు!
అవును... తిరుపతిలోని బైరాగిపట్టెడ టోకెన్ జారీ కేంద్రంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడం, సుమారు 25 మంది క్షతగాత్రులు కావడంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఈ సమయంలో... తొక్కిసలాటపై తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ తో సీఎం చంద్రబాబు నాయుడు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు... ఒక సెంటర్ లో మహిళా భక్తురలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీశారని.. దీంతో భక్తులు ఒక్కసారిగా పెద్ద ఎత్తున ప్రవేశించడంతో తొక్కిసలాట చోటుచేసుకుని భక్తులు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందిందని తెలిపారు.
ఇదే సమయంలో... గాయపడిన 25 మందిని ప్రభుత్వ రుయా, స్విమ్స్ ఆసుపత్రులకు తరలించినట్లు తెలిపారు. వారికి అక్కడ చికిత్స అందిస్తున్నారని వివరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ పై స్పందించిన బీఆర్ నాయుడు... సీఎం చంద్రబాబు అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారని.. అధికారుల వైఫల్యంతోనే ఇటువంటి సంఘటన చోటు చేసుకుందని ఆగ్రహం వక్తం చేశారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తిసుకోవాలని సూచించారని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి!:
వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతోన్న వేళ సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన.. ఈ దుర్ఘటన తనను ఎంతో కలిచి వేసిందని అన్నారు. అనంతరం అధికారులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా అధికారులపై చంద్రబాబు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా.. భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని చెప్పిన చంద్రబాబు.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.
స్పందించిన పవన్ కల్యాణ్!:
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో భక్తులు మృతి చెందిన ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో భాగంగా... తిరుపతి ఘటనలో ఆరుగురు మృతి చెందిన ఘటన తీవ్ర ఆవేదనకు గురి చేసిందని.. భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం చెందడం దురదృష్టకరమని అన్నారు.
ఈ సందర్భంగా.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నామని.. క్షతగాత్రులకు సత్వరమే మెరుగైన వైద్య సేవలు అందించాలని పవన్ కల్యాణ్ వైద్య ఆరోగ్య శాఖకు సూచించారు. టికెట్ కౌంటర్ల దగ్గర క్యూలైన్స్ నిర్వహణలో అధికారులకు, పోలీసులకు జనసేన నాయకులతో పాటు జనసైనికులు తోడ్పాటు అందించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు పవన్ తెలిపారు.