అప్పుడలా.. ఇప్పుడిలా.. టీటీడీలో ఏం జరుగుతోంది?
టీటీడీ మహా పుణ్యక్షేత్రం. కలియుగ వైకుంఠం. హిందువుల ఆరాధ్యదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన ఆలయంలో వరుస వివాదాలు సంచలనంగా మారుతున్నాయి.
By: Tupaki Desk | 23 Feb 2025 3:51 AM GMTప్రభుత్వం మారినా.. పాలకవర్గం మారినా టీటీడీలో కొన్ని పద్ధతులు మారడం లేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత ఐదేళ్లలో శ్రీవారి ఆలయ నిర్వహణను గాలికి వదిలేశారని కూటమి నేతలు ఆరోపించేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువుదీరిన 9 నెలల తర్వాత ప్రతిపక్షం కూడా అదే తరహా ఆరోపణలు చేస్తోంది. దీనికి తగ్గట్టు వరుసగా వివాదాలు టీటీడీని చుట్టుముడుతున్నాయి. దీంతో భక్తుల మనోభావాలకు విలువ లేకుండా పోతుందని ఆరోపణలు ఎక్కువవుతున్నాయి.
టీటీడీ మహా పుణ్యక్షేత్రం. కలియుగ వైకుంఠం. హిందువుల ఆరాధ్యదైవం శ్రీవెంకటేశ్వరస్వామి కొలువైన ఆలయంలో వరుస వివాదాలు సంచలనంగా మారుతున్నాయి. తాజాగా బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ అనుచిత ప్రవర్తనతో తిరుమల క్షేత్రం మరోసారి వార్తలకు కేంద్రంగా మారిందని అంటున్నారు. ముఖ్యంగా పాలకవర్గం పేరిట జరుగుతున్న నియామకాల్లో పారదర్శకత లోపిస్తుందనే ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏపీతో పాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు కోటాల కింద నియమితులవుతున్న పలువురు బోర్డు సభ్యుల దూకుడు విమర్శలకు కారణమవుతోంది. ఈ పాలకవర్గంలో ఇప్పటికే ఇద్దరు సభ్యుల తీరుపై విమర్శలు చెలరేగగా, అంతకుముందు ప్రభుత్వంలోనూ మంత్రులు, ఎమ్మెల్యేలు వందల మందిని వెంటబెట్టుకుని దర్శనాలు చేయడం వివాదాస్పదమైంది. ఇప్పుడు ప్రభుత్వం, పాలకవర్గం మారినా ఆలయంలో కొన్ని పద్ధతులు మారడం లేదని అంటున్నారు.
గత ప్రభుత్వంలో టీటీడీ అన్నదానం, లడ్డూ ప్రసాదంపై తీవ్ర విమర్శలు వినిపించేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితులను సెట్ చేసేలా అడుగులు వేసింది. ఈ క్రమంలోనే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడారనే విషయం వెలుగు చూసింది. ఈ విషయమై ప్రస్తుతం సిట్ దర్యాప్తు చేస్తోంది. ఈ వివాదం కూడా అధికార, విపక్షాల మధ్య పెద్ద దుమారం రేపింది. ఇక ఆ తర్వాత వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట టీటీడీ చరిత్రలోనే ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. దీనికి అధికారుల మధ్య సమన్వయం లోపమే కారణమనే ఆరోపణలు వెల్లువెత్తాయి. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి సమక్షంలోనే టీటీడీ చైర్మన్, ఈవో వాదులాడుకున్నట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి.
ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నా, కొంతమంది బోర్డు సభ్యులు మాత్రం టీటీడీ సభ్యత్వాన్ని రాజభోగంగా భావిస్తుండటంతో విమర్శల పాలవుతున్నారు. దేవుడికి సేవ చేయాల్సిన వారు.. ఆ విషయానికి తక్కువ ప్రాధాన్యమిస్తూ తమ పరపతికి అదో సింబల్ అనుకోవడమే సమస్యలకు మూలమవుతోందని విశ్లేషిస్తున్నారు. గతంలో శ్రీవాణి ట్రస్టు ద్వారా శ్రీవారి దర్శనాన్ని ఖరీదుగా మార్చేశారని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత ప్రభుత్వంలో శ్రీవాణి ట్రస్టు చేశారు. అయితే ప్రోటోకాల్ దర్శనాలు ఎక్కువవడంతో సాధారణ భక్తులకు ఇబ్బందులు ఎక్కువవుతున్నాయంటున్నారు.
తిరుమలలో రాజకీయ జోక్యం తగ్గించాల్సిన అవసరం ప్రస్తుతం నెలకొందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. శ్రీవారి భక్తుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే టీటీడీ ప్రక్షాళనకు నాంది పడుతుందని కోరుతున్నారు. ఇటీవల తిరుపతిలో జరిగిన అంతర్జాతీయ ఆలయాల సదస్సులో ఆలయాలకు స్వయం ప్రతిపత్తి ఉండాలని ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. అయితే ప్రస్తుతం స్వయంప్రతిపత్తి ఉన్న తిరుమల ఆలయంలో రాజకీయ జోక్యం తగ్గేలా సరైన నిర్ణయం తీసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన సాకారమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.