టీటీడీ ఉద్యోగుల ధర్నా ఎఫెక్ట్ : సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం
ఈ విషయంలో బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దే తప్పని భావిస్తున్న సీఎం.. ఆయనతో క్షమాపణ చెప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
By: Tupaki Desk | 21 Feb 2025 12:26 PM GMTటీటీడీలో ఉద్యోగులు-బోర్డు సభ్యుడు మధ్య వివాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు జోక్యం చేసుకున్నారు. ఈ విషయంలో బోర్డు సభ్యుడు నరేష్ కుమార్ దే తప్పని భావిస్తున్న సీఎం.. ఆయనతో క్షమాపణ చెప్పించాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. కర్ణాటకకు చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడు నరేష్ కుమార్ నాలుగు రోజుల క్రితం ఆలయంలో టీటీడీ ఉద్యోగి బాలాజీని దుర్భాషలాడిన విషయం తెలిసిందే.
పాలకమండలి సభ్యుడి ప్రవర్తనపై షాక్ తిన్న ఉద్యోగులు రెండు రోజులుగా ఆందోళన చేస్తున్నారు. తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్లు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు అవ్వాలని తీర్మానించుకున్నారు. దీంతో ప్రభుత్వం ఈ వివాదంపై సీరియస్ అయినట్లు చెబుతున్నారు. పాలకమండలి సభ్యుడు తీరు సరిగా లేదని టీటీడీ అధికారులు సైతం ప్రభుత్వానికి నివేదించడంతో ఆయనతో సారీ చెప్పించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు చెబుతున్నారు.
నాలుగు రోజుల కిందట శ్రీవారిని దర్శించుకున్న పాలకమండలి సభ్యుడు మహాద్వారం గుండా బయటకు వచ్చేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగి బాలాజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. మహాద్వారం ద్వారా బయటకు వెళ్లడం సాధ్యం కాదని, వేరే మార్గంలో వెళ్లాలని సూచించారు. అయితే పాలకమండలి సభ్యుడిని అయిన తనకు రూల్స్ చెబుతావా? అంటూ నరేష్ కుమార్ బూతులు లంఖించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో పాలకమండలి సభ్యుడు బూతులు తిట్టడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ పరిస్థితుల్లో వివాదంపై జోక్యం చేసుకున్న ప్రభుత్వం టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి ద్వారా ఉద్యోగులతో చర్చించింది. అదేవిధంగా టీటీడీ అధికారులను రంగంలోకి దింపి వ్యవహారం ముదరకుండా జాగ్రత్తలు తీసుకుంది. ఉద్యోగుల డిమాండ్ మేరకు నరేష్ కుమార్ తో క్షమాపణలు చెప్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.