Begin typing your search above and press return to search.

టీటీడీ ఛైర్మన్ పదవి కోసం పోటీ ఈ ఐదుగురి మధ్యేనా?

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ పదవి ఎప్పుడూ హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే.

By:  Tupaki Desk   |   10 Jun 2024 6:51 AM GMT
టీటీడీ ఛైర్మన్  పదవి కోసం పోటీ ఈ ఐదుగురి మధ్యేనా?
X

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ పదవి ఎప్పుడూ హాట్ టాపిక్ అనే సంగతి తెలిసిందే. ఏపీలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా.. ఆ పార్టీలకు చెందినవారే ఇక్కడ ఛైర్మన్ గా నామినేట్ అవుతుంటారు. అయితే ఈసారి ఏపీలో ఏర్పడబోయేది కూటమి ప్రభుత్వం కావడంతో ఈ పదవికి హెవీ కాంపిటీషన్ ఏర్పడిందని అంటున్నారు.

అవును... ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన వ్యక్తే టీటీడీ ఛైర్మన్ గా ఉంటారనేది తెలిసిన విషయమే. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడూ ఆ పార్టీకి చెందిన వ్యక్తే ఆ పదవిని నామినేట్ అయ్యారు. ఇదే సమయంలో తాజాగా ఈ పోస్ట్ ఎవరిని వరించబోతుందనేది ఆసక్తిగా మారింది.

ఈ విషయంలో బీజేపీ - టీడీపీ - జనసేనల నుంచి పలు పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రధానంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు పేరు టీటీడీ ఛైర్మన్ పదవి విషయంలో వినిపిస్తుంది. కూటమి కోసం తన ఎంపీ టిక్కెట్ కూడా త్యాగం చేశారని.. ఈ సమయంలో ఆయనకు ఆ పదవి ఇవ్వడం భావ్యం అని అంటున్నారట.

ఆ సంగతి అలా ఉంటే.. ప్రధానంగా పిఠాపురం నుంచి టీడీపీ నేత ఎస్.వి.ఎస్.ఎన్ వర్మ పేరు ప్రముఖంగా వినిపిస్తుందని అంటున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోసం త్యాగం చేయడంతోపాటు.. పవన్ గెలుపుకోసం అవిశ్రాంతంగా పనిచేసిన నేపథ్యంలో.. ఆ పదవి వర్మను వరించే అవకాశం ఉందని అంటున్నారు.

మరోపక్క బీజేపీ నుంచి ఏకంగా మూడు పేర్లు వినిపిస్తుండటం గమనార్హం. ఇందులో భాగంగా ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజు పేరు తెరపైకి వచ్చింది. ఈయన ఈ మేరకు ఇప్పటికే అధిష్టాణం వద్ద అర్జీ పెట్టుకున్నట్లు చెబుతున్నారు. ఈయనతోపాటు తిరుపతికి చెందిన భానుప్రకాశ్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది.

ఈయన జనసేన కోసం తిరుపతి ఎమ్మెల్యే టిక్కెట్ త్యాగం చేశారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈయన కూడా ప్రయత్నాలు ముమ్మరం చేశారని అంటున్నారు. మరోవైపు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి భర్త.. దగ్గుబాటి వెంకటేశ్వర రావు కూడా ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. ఈయన అటు చంద్రబాబు నుంచి ఇటు బీజేపీ పెద్దల నుంచీ ప్రయత్నాలు షురూ చేశారని సమాచారం.

మరి ఇంత కీలకమైన ఈ టీటీడీ ఛైర్మన్ పదవి జనసేన ఖాతాలో పడుతుందా.. టీడీపీకే దక్కుతుందా.. లేక, బీజేపీ నేతలను వరించనుందా అనేది వేచి చూడాలి!