Begin typing your search above and press return to search.

నందిని నెయ్యిని టీటీడీ కొనటం లేదా? అసలేం జరిగింది?

నందిని పాల ఉత్పత్తుల ధరలు పెరగటంతో టీటీడీ మరో కంపెనీ నెయ్యిని కొనుగోలు చేసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు.

By:  Tupaki Desk   |   1 Aug 2023 4:26 AM GMT
నందిని నెయ్యిని టీటీడీ కొనటం లేదా? అసలేం జరిగింది?
X

నందిని నెయ్యి.. ఆ మాట కు వస్తే నందిని బ్రాండ్ పేరుతో కర్ణాటక పాల సమాఖ్య చేసే ఉత్పత్తుల కు కర్ణాటక లో ఉండే ఆదరణ ఎంతో తెలిసిందే. ఒక్క కర్ణాటక లోనే కాదు దక్షిణాదిన పలు రాష్ట్రాల్లో వీటి ఉత్పత్తుల కు బోలెడంత మంది వినియోగదారులు ఉన్నారు. నందిని ఉత్పత్తుల్లో నాణ్యతకు కొదవ లేదని చెబుతుంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం లో తయారు చేసే స్వామి వారి ప్రసాదాన్ని నందిని నెయ్యితోనే చేస్తుంటారు. దాదాపు ఇర వై ఏళ్లుగా నందిని నెయ్యిని వినియోగిస్తున్న టీటీడీ.. ఇప్పుడు హటాత్తుగా ఆ సంస్థకు రాంరాం చెప్పేసిందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ఎందుకంటే.. కర్ణాటక పాల సమాఖ్య అధ్యక్షుడు బీమా నాయక్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. నందిని పాల ఉత్పత్తుల ధరలు పెరగటంతో టీటీడీ మరో కంపెనీ నెయ్యిని కొనుగోలు చేసుకుంటున్నట్లుగా పేర్కొన్నారు. ఆవునెయ్యితో తయారు చేసే లడ్డూకు ప్రత్యేక రుచి వస్తుందన్నది భక్తుల నమ్మకం. టీటీడీ కి మొదట్నించి కర్ణాటక నుంచి నెయ్యి వెళుతున్నా.. కర్ణాటక పాల సమాఖ్య ఏర్పాటైన తర్వాత నుంచి నందిని నెయ్యిని కొనుగోలు చేస్తోంది టీటీడీ.

అలాంటిది తాజాగా మరో కంపెనీ నెయ్యిని కొనుగోలు చేసేందుకు టీటీడీ సిద్ధమైందన్నది ఇప్పుడు చర్చగా మారింది. ధర పెరిగితే మాత్రం.. నాణ్యతకు నిలువెత్తు నిదర్శనంగా ఉన్న నందిని నెయ్యిని ఎందుకు వాడటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈ అంశం పై టీటీడీ స్పందించింది. నందిని నెయ్యిని టీటీడీ కొనుగోలు చేయటం లేదని బీమా నాయక్ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి.

తాజాగా ఆయన ఈ అంశం పై క్లారిటీ ఇస్తూ.. మార్చిలో నెయ్యి కొనుగోలు కు టీటీడీ ఆహ్వానించిన ఈ టెండర్ లో కర్ణాటక పాల సమాఖ్య పాల్గొనలేదన్నారు. టెండర్లలో ఎల్1గా వచ్చిన వారి నుంచి కొనుగోలు చేస్తామని.. గతం లో నందిని నెయ్యికి ఎల్ 2గా రాగా.. ఎల్ 1తో మాట్లాడి.. నిబంధనలకు తగ్గట్లు నెయ్యిని వారి నుంచి కొనుగోలు చేసినట్లుగా పేర్కొన్నారు. మరి.. కర్నాటక పాల సమాఖ్య ఒకలా.. టీటీడీ ఈవో మరోలా చేస్తున్న వ్యాఖ్యలు వేరుగా ఉండటం చూస్తే.. సమ్ థింగ్ ఈజ్ రాంగ్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అదేమిటో చూడాలి.