Begin typing your search above and press return to search.

89 స్థానాలకు 189 మంది అభ్యర్థులు పోటీ... అలా చెప్పిన టి.టీడీపీ?

అయితే... టీడీపీ నేతలు చెబుతున్నట్లు చెబుతున్న ఈ 89 స్థానాలకు 189 మంది పేర్లు నిజ‌మేనా.. లేక, మేక‌పోతు గాంభీర్యమా అనేది తేలాల్సి ఉందనే కామెంట్లు కూడా వినిపిస్తుండటం గమనార్హం.

By:  Tupaki Desk   |   26 Oct 2023 10:53 AM GMT
89 స్థానాలకు 189 మంది అభ్యర్థులు పోటీ... అలా చెప్పిన టి.టీడీపీ?
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రిలో కేంద్ర కారాగారవాసంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల ఓటుకు నోటు కేసు మరోసారి సుప్రీంలో విచారణకు వచ్చిందని కథనాలొచ్చాయి.. ఇదే సమయంలో టీడీపీ నుంచి కాస్త పేరున్న ముఖ్యనేతలంతా పార్టీని వీడిపోయిన పరిస్థితి అని అంటున్నారు.. ఏపీలోనే ఒంటరిగా ఈదలేక జనసేనను పట్టుకున్న పరిస్థితి అనే కామెంట్ మరొకటి.. పైగా తెలంగాణలో అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులే లేని పరిస్థితి అని విశ్లేషణలు.. ఇన్ని ఇబ్బందుల మధ్య తెలంగాణ ఎనికల్లో టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తుందా?

నిన్నటివరకూ చాలా మంది మదిలో మెదిలిన ప్రశ్న ఇది! అయితే ఇలాంటి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఉందని, పోటీ చేసే విషయంలో కానీ, టీడీపీ టిక్కెట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థుల విషయంలో కానీ ఎలాంటి అనుమానాలు అక్కరలేదని కాసాని జ్ఞానేశ్వర్ ధైర్యం చెబుతున్నారని అంటున్నారు! ఇందులో భాగంగా ఆయన ఒక లిస్ట్ సిద్ధం చేసుకుని ఈ రోజు చంద్రబాబుతో భేటీ కాబోతున్నారు.

అవును... తెలంగాణలో టీడీపీ అన్నిస్థానాల్లోనూ పోటీ చేయడం లేదు.. ఎందుకు..? అభ్యర్థులు లేరా..? అనే ప్రశ్నకు సమాధానం సంగతి కాసేపు అలా ఉంచితే... తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో 89 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని టీడీపీ భావిస్తోందట. అయితే... ఈ 89 స్థానాల కోసం ఏకంగా 189 మంది పోటీలో ఉన్నారంట.

దీంతో ఆ నియోజకవర్గాల పేర్లు, ఆ టిక్కెట్ల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఆశావహుల వివరాలు తీసుకుని కాసాని.. బాబుని కలుస్తున్నారు! ఇప్పటికే ఎన్టీఆర్‌ భవన్‌ లో రాష్ట్రస్థాయి, పార్లమెంటరీ స్థాయి నేతలతో కలిసి కాసాని జ్ఞానేశ్వర్ కసరత్తు చేశారు. ఆఖరికి 89 స్థానాల్లో పోటీ చేయాలని ఫిక్సయ్యారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే... టీడీపీ వదిలేసి 30 నియోజకవర్గాల్లో హైదరాబాద్‌ లోక్‌ సభ పరిధిలోని నియోజకవర్గాలు కూడా ఉండటం!

అవును... టీడీపీ పోటీకి దూరంగా ఉండాలని భావిస్తున్న 30 నియోజకవర్గాల్లో హైదరాబాద్‌ లోక్‌ సభ పరిధితో పాటు ఉమ్మడి వరంగల్‌, ఆదిలాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక మిగిలిన 89 నియోజకవర్గాల్లో కొన్నింటికి ఒక్కొక్కరు సిద్ధంగా ఉండగా... మరికొన్నింటికి రెండేసి పేర్లు.. కొన్నిచోట్ల ఏకంగా మూడు పేర్లను ప్రతిపాదిస్తూ జాబితా రూపొందించారట కాసాని!

దీంతో ఇక రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న చంద్రబాబు ఆ లిస్ట్ పై ఈ రోజు ఒక నిర్ణయం తీసేసుకుని, పచ్చ జెండా ఊపేస్తే.. ఇక తెలంగాణ ఎన్నికల రణరంగంలోకి టీడీపీ దూకేస్తున్నట్లే! వీరి ఉత్సాహం అలా ఉంటే... అస‌లు తెలంగాణ‌లో గెలుపు ఆశ‌లే లేని టీడీపీ టికెట్ కోసం నిజంగా అంత‌మంది పోటీ ప‌డుతున్నారంటే అది రాజకీయాల్లో ఒక అద్భుతమనే అంటున్నారు నెటిజన్లు! ఇక ఈ లిస్ట్ ఓకే అయిపోతే... బాలయ్య కూడా ప్రచారానికి సిద్ధమైపోతారని అంటున్నారు!

అయితే... టీడీపీ నేతలు చెబుతున్నట్లు చెబుతున్న ఈ 89 స్థానాలకు 189 మంది పేర్లు నిజ‌మేనా.. లేక, మేక‌పోతు గాంభీర్యమా అనేది తేలాల్సి ఉందనే కామెంట్లు కూడా వినిపిస్తుండటం గమనార్హం.