నారా బ్రాహ్మణికి తెలంగాణ పగ్గాలు ?!
గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న ఎల్.రమణ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు
By: Tupaki Desk | 12 July 2024 9:21 AM GMTఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు ఇటీవలి తెలంగాణ పర్యటనలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తెస్తామని, పార్టీ బలోపేతం మీద దృష్టి సారిస్తామని చెప్పి తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో నూతన ఉత్సాహం నింపారు. దీంతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎవరికి అప్పచెబుతారు ? అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
గతంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షులుగా ఉన్న ఎల్.రమణ బీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. మరో మాజీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు పార్టీలోనే ఉన్నా స్థబ్దుగా ఉన్నాడు. ఇంకో మాజీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గత ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీలో చేరి ఇటీవల లోక్ సభ ఎన్నికల్లో చేవెళ్ల ఎంపీగా పోటీ చేసి ఓటమి చవిచూశాడు.
తెలంగాణలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉండడంతో ఇక్కడి పార్టీ శ్రేణులు, అభిమానులు గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేశారు. ఈ మేరకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అభ్యర్థులు పొంగులేటి, తుమ్మల, జూపల్లి తదితరులు టీడీపీ కార్యాలయాలకు వెళ్లి మరీ వారి మద్దతును కోరారు. ఎన్నికల్లో గెలిచి మంత్రులు అయ్యాక కూడా పొంగులేటి, తుమ్మలలు ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్లి కృతజ్ఞతలు తెలపడమే కాకుండా, ఇటీవల ఏపీలో టీడీపీ కూటమి ఘనవిజయాన్ని కూడా అక్కడికి వెళ్లి సెలబ్రేట్ చేసుకోవడం విశేషం.
ఈ నేపథ్యంలో తెలంగాణలో టీడీపీ పూర్వవైభవం కోసం పార్టీ పగ్గాలు చంద్రబాబు కోడలు, ఆయన కుమారుడు నారా లోకేష్ సతీమణి, బాలక్రిష్ణ కూతురు నారా బ్రాహ్మణికి అప్పగించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. చంద్రబాబు నాయుడును జగన్ ప్రభుత్వం అరెస్టు చేసి జైలుకు పంపిన ఉత్కంఠ పరిస్థితులలో నారా లోకేష్ ఢిల్లీకి వెళ్లి బాబు బెయిలు ప్రయత్నాలలో ఉండగా, అత్త నారా భువనేశ్వరికి వెన్నుదన్నుగా ఉండి ధైర్యం చెప్పడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణుల నిరసనలను విజయవంతంగా తెలిపిన విషయంలో బ్రాహ్మణి పాత్ర ఎంతో ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కుటుంబంలో అంతర్గతంగా జరిగిన చర్చలో లోకేష్, బాలక్రిష్ణలు బ్రాహ్మణికి పగ్గాలు అప్పగించేందుకు సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తుంది.