రమణ దీక్షితులుపై వేటు వేసిన టీటీడీ... ఎన్ని కారణాలంటే...?
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు, ఇతర అర్చకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
By: Tupaki Desk | 26 Feb 2024 12:23 PM GMTఆయన ఎక్కడ ఉంటే వివాదం అక్కడ ఉంటుంది అనే కామెంట్లను సొంతం చేసుకున్నారనే పేరు సంపాదించుకున్న ఏవీ రమణ దీక్షితులపై తిరుమల తిరుపతి దేవస్థానం తాజాగా వేటు వేసింది. గతంలో ఎన్నో వివాదాలకు తెరలేపి.. నిరాధార ఆరోపణలు చేసే వ్యక్తిగా అనేక మార్లు భంగపడిన ఆయనకు తాజాగా పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. ఈ మేరకు ధర్మకర్తల మండలి సమావేశంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
అవును... తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ గౌరవ ప్రధాన అర్చకుడు డాక్టర్ ఏవీ రమణ దీక్షితులు నేడు ఆ పదవి నుంచి ఉద్వాసనకు గురయ్యారు. ఇందులో భాగంగా... ఆలయ గౌరవ ప్రధాన అర్చక పదవి నుంచి ఆయన్ను తొలగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయ విధానాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు రావడమే ఇందుకు కారణం అని తెలుస్తుంది.
తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని అధికారులు, ఇతర అర్చకులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. దీంతో ఇటీవల టీటీడీ ఉన్నతాధికారులపైనా, ఆలయ విధానాలపైనా ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు... ప్రధానికి నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేస్తున్నట్లుగా చేసిన పోస్టులపై ఇప్పుడు చర్చ మొదలైంది.
కాగా... గతవారం చేసిన ట్వీట్ లో స్పందించిన దీక్షితులు... కొండ ఆలయం, టీటీడీ దేవాలయాలు సనాతన ధర్మాన్ని పాటించని అధికారులు, ప్రభుత్వ కబంధ హస్తాల్లో ఉందని రాసుకొచ్చారు. ఇదే సమయంలో... వారంతా పురాతన సంప్రదాయాలు, నిర్మాణాలు, ఆస్తులను క్రమపద్దతిలో నాశనం చేస్తున్నారంటూ ఆరోపించారు!
ఇదే ట్వీట్ లో ... ఆలయాన్ని రక్షించండి, హిందూ రాజ్యాన్ని స్థాపించండి అంటూ మోడీని కోరారు. దీంతో ఈ ట్వీట్ పై తీవ్ర విమర్శలు వెళ్లువెత్తాయి. గతంలో కుటుంబ సభ్యుల నుంచే ఇతనిపై వచ్చిన ఆరోపణలను ప్రస్థావిస్తూ నెటిజన్లు కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. ఇందులో ప్రధానంగా "పింక్ డైమండ్" విషయాన్ని ప్రస్థావించారు. ఈ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన తన ట్వీట్ ను తొలగించారు.
వైరల్ గా మారిన వీడియోలు!:
తిరుమలలో గతకొంతకాలంగా అసాంఘిక కార్యకలపాలు జరుగుతున్నాయని.. అన్యమతం విపరీతంగా వ్యాపించిందని.. నిధుల కోసం తవ్వకాలు జరుగుతున్నాయంటూ దీక్షితులు మాట్లాడినట్లు ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇదే సమయంలో... ఈవో ధర్మారెడ్డి, సీఎం జగన్ లతోపాటు టీటీడీలో చాలామంది క్రీస్టియన్స్ ఉన్నారని, అదే పెద్ద సమస్య అని అన్నారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.
దీంతో ఈ వీడియోపై స్పందించిన రమణ దీక్షితులు... ఈమేరకు టీటీడీ ఈవో కు లేఖ రాశారు. ఇందులో భాగంగా ఆ వీడియోలో ఉన్న వాయిస్ తనది కాదని.. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా, ఈవోని అప్రతిష్టపాలు చేసేలా తాను ఏనాడూ మాట్లాడలేదని అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు రమణ దీక్షితులు చేసినవే అని టీడీపీ నమ్మిందని అంటున్నారు. ఇవన్నీ కలిసి ఆయన వేటుకు కారణాలయ్యాయని తెలుస్తుంది.