తిరుమలను ఇలా కూడా భ్రష్టు పట్టిస్తున్నారే!
'అలవైకుంఠపురం' ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ 'నగరి' ఎలా శోభిల్లుతుందో అవగాహనా లేదు
By: Tupaki Desk | 12 July 2024 4:25 AM GMT'అలవైకుంఠపురం' ఎలా ఉంటుందో మనకు తెలియదు. ఆ 'నగరి' ఎలా శోభిల్లుతుందో అవగాహనా లేదు. కాగా, అల వైకుంఠపురం నుంచి దిగివచ్చి.. తిరుమల గిరుల్లో కొలువుదీరిన భక్తుల కొంగుబంగారం... పిలిచినంతనే పలికే స్వామిగా వేనోళ్ల కీర్తించబడే తిరుమలరాయుని ఆలయం నానాటికీ భ్రష్టు పడుతోంది. గత వైసీపీ హయాంలో అన్యమత ప్రచారానికి, రాజకీయ ప్రాపకానికి పెద్దపీట పడిన తిరుమలలో ఇప్పుడు ఆటకాయి చేష్టలకు.. వినోదాలకు కేంద్రంగా మారుతోంది.
తాజాగా ఓ యూట్యూబర్ చేసిన హడావుడి.. భక్తుల మనసులను నొప్పించింది. తిరుమలను ఇలా కూడా భ్రష్టు పట్టిస్తున్నారా? అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు ఫ్రాంక్ వీడియోలంటే.. ముచ్చట ఉండేది. కొద్ది సేపు నవ్వుకునేవారు. కానీ, సమయం, సందర్భం, మనం ఎక్కడున్నాం అనే విషయాలను కూడా గాలికి వదిలేసి.. స్వతంత్ర దేశంలో చావుకు-పెళ్లికి కూడా తేడాలేకుండా.. వ్యవహరిస్తున్న అల్లరి మూక.. ఇప్పుడు తిరుమల పవిత్రతను కూడాగాలిలో కలిపేస్తోంది.
శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వ్యయ ప్రయాసలకు ఓర్చుకుని వచ్చే భక్తుల కోసం.. నిర్మించి న నారాయణగిరి షెడ్లలో ఆకతాయిల ప్రాంక్ వీడియోలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. తమిళనాడు కు చెందిన టీటీఎఫ్ వాసన్, అతని మిత్రులు తిరుమల నారాయణగిరి షెడ్లలో ప్రాంక్ వీడియోలు చిత్రీకరించిన తీరు భక్తుల మనోభావాలపై బలమైన దెబ్బ వేసింది. ఈ వీడియోల్లో వారు చేసిన అల్లరి చేష్ఠలు అందరినీ నిశ్చేష్టులను చేశారు.
తిరుమల గిరుల ప్రారంభం నుంచి యాత్ర ముగిసే వరకు నారాయణ శబ్ధం తప్ప.. మరో మాట వినేందుకు.. అనేందుకు కూడా భక్తులు ఇష్టపడరు. ఇలాంటి చోట అసభ్య పదాలతో చేసిన వీడియోలు.. పైగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి ఆనందించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యారు. తిరుమల పవిత్రతను, భద్రతను కూడా ప్రశ్నార్థకం చేస్తున్నాయి. దీనిపై ఇటు ఏపీలోనూ.. అటు తమిళనాడులో కూడా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో స్పందించిన ఈవో శ్యామల రావు.. కఠిన చర్యలకు ఆదేశించారు. మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.