తాలిబన్ జోలికెళ్తే అంతే.. పాక్ అణు శాస్త్రవేత్తల కిడ్నాప్!
భారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తారని భావించి.. దశాబ్దాలుగా పెంచి పోషించిన తాలిబన్లు ఇప్పుడు పాకిస్థాన్ పీక పట్టుకుంటున్నారు.
By: Tupaki Desk | 10 Jan 2025 9:29 AM GMTభారత్ కు వ్యతిరేకంగా పనిచేస్తారని భావించి.. దశాబ్దాలుగా పెంచి పోషించిన తాలిబన్లు ఇప్పుడు పాకిస్థాన్ పీక పట్టుకుంటున్నారు. తమ మీద చిన్న దాడి జరిగినందుకే పొరుగు దేశం అంతు చూస్తామని అంటున్నారు. ఇప్పటికే సరిహద్దుల్లోకి చొచ్చుకొచ్చిన తాలిబన్లు పాకిస్థాన్ లోకి దూసుకెళ్లినా ఆశ్చర్యం లేదనే పరిస్థితులు నెలకొన్నాయి.
నిన్న కూలీలు..
తెహ్రీక్ ఈ తాలిబన్ పాకిస్థాన్ (టీఈటీపీ).. పాకిస్థాన్ పెంపుడు సంస్థ. అయితే, మారిన కాలంతో పాటు అఫ్ఘాన్ లో అధికారం దక్కాక టీఈటీపీ వైఖరి మారింది. తమ దేశమే తమకు ప్రధానం అనే స్థితికి వారు వచ్చారు. తాజాగా అఫ్ఘాన్ పై పాక్ దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా పాక్ సైన్యంపై బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) భారీ ఆత్మాహుతి దాడికి పాల్పడి పదుల సంఖ్యలో సైనికుల ప్రాణాలు తీసింది. మరోపక్క సామాన్య ప్రజలకు రక్షణ కల్పించలేని దుస్థితిలో ఉంది. గురువారం 16 మంది కూలీలు అపహరణకు గురయ్యారు.
నేడు అణు శాస్త్రవేత్తలు
శుక్రవారం పాకిస్థాన్ అణు శాస్త్రవేత్తలను తాలిబన్ అనుబంధ సంస్థ అయిన టీఈటీపీ కిడ్నాప్ చేసింది. పాక్ పై ఒంటికాలి మీద లేస్తున్న టీఈటీపీ.. ఖాబుల్ ఖేల్ అటామిక్ ఎనర్జీ మైనింగ్ ప్రాజెక్టులో పనిచేసే అణు శాస్త్రవేత్తలు, సిబ్బందిని అపహరించింది. కొన్ని డిమాండ్లు విధిస్తూ వాటిని తీర్చేవరుకు శాస్త్రవేత్తలను వదిలేది లేదని స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే భద్రతా సిబ్బందిని కోల్పోతున్న పాక్ కు ఇది మరో షాక్ కిందనే లెక్క.
ఇక కిడ్నాప్ అయిన కూలీలు.. సున్నిత ప్రాంతమైన ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ లో యురేనియం, ప్లూటోనియం గనిలో పనిచేస్తున్నవారు. లక్కీ మార్వత్ జిల్లాలోని అటమిక్ ఎనర్జీ మైన్ కు వెళ్తుండగా వీరిని ఎత్తుకెళ్లారు.
పాక్ లో జరిగిన పలు ఉగ్రదాడుల వెనక టీఈటీపీ ఉందనే ఆరోపణలున్నాయి. కూలీల కిడ్నాప్ ను మాత్రం ఏం సంస్థా తమ పని అని ప్రకటించలేదు.