Begin typing your search above and press return to search.

అది తులసిబాబు స్పెషాలిటీ.. సీఐడీ లాయరుగా భారీ ఫీజు?

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టు అయి ప్రస్తుతం రిమాండులో ఉన్న నిందితుడు కామేపల్లి తులసిబాబుపై సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

By:  Tupaki Desk   |   12 Feb 2025 10:19 AM GMT
అది తులసిబాబు స్పెషాలిటీ.. సీఐడీ లాయరుగా భారీ ఫీజు?
X

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టు అయి ప్రస్తుతం రిమాండులో ఉన్న నిందితుడు కామేపల్లి తులసిబాబుపై సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. గత ప్రభుత్వంలో లాయర్ గా తన పేరు నమోదు చేసుకున్న తులసిబాబు.. సీఐడీకి సేవలు అందించినందుకు గాను భారీగా ఫీజు వసూలు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. రఘురామపై ఆయన దాడి చేశాడనేందుకు ఆధారలు ఉన్నాయని, బెయిల్ ఇవ్వొద్దంటూ ప్రభుత్వ న్యాయవాదులు హైకోర్టులో వాదించారు.

రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. ముఖ్యంగా గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే వెనిగల్లు రాముకు అత్యంత సన్నిహితుడైన తులసిబాబు పాత్రపై విచారణ జరుపుతున్న పోలీసులు కీలక ఆధారాలు సేకరించినట్లు ఓ ప్రముఖ పత్రిక కథనంలో వెల్లడించింది. సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమారుకు అనుచరుడిగా వ్యవహరించిన తులసిబాబు సీఐడీ కేసుల న్యాయవాదిగా సుమారు 48 లక్షలు వసూలు చేసినట్లు తెలిపింది.

2021 నవంబర్ 16న ఏపీ బార్ కౌన్సిల్ లో న్యాయవాదిగా నమోదు చేసుకున్న తులసిబాబు అప్పటికి ఏడాదికి ముందే 2020 అక్టోబరులో సీఐడీ లీగల్ అసిస్టెంటుగా నియమితులైనట్లు ఓ ప్రధాన పత్రిక వెల్లడించింది. లీగల్ అసిస్టెంటుగా నియమించిన సమయానికి ఆయన న్యాయవాదే కాదని, కానీ, హైకోర్టులో సీఐడీ కేసులు విచారణకు ఆయనను నియమిస్తున్నట్లు సీఐడీ ఉత్తర్వులు ఇచ్చినట్లు తెలిపింది. కాగా, ఆయన 2021లో న్యాయవాదిగా ఎన్ రోల్ అయిన మూడు నెలల్లో 12 కేసుల్లో న్యాయ సహాయం అందినందుకు గాను రూ.48 లక్షలు చెల్లించినట్లు సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ హైకోర్టుకు నివేదించినట్లు తెలిపింది.

కాగా, రఘురామ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తులసిబాబు సంచలనాల కేంద్రంగా మారాడు. ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ అనుచరుడిగా గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన తులసిబాబు.. ప్రస్తుతం గుడివాడ టీడీపీలో అన్నీతానై వ్యవహరిస్తున్నాడని చెబుతున్నారు. తనపై దాడి చేసిన తులసిబాబును దూరం పెట్టాలని గుడివాడ ఎమ్మెల్యే రాముకు డిప్యూటీ స్పీకర్ కోరారు. ఇదే సమయంలో అతడికి పార్టీకి సంబంధం లేదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రావు గతంలో వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తులసిబాబుపై ఉచ్చు బిగించేలా పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నామని చెబుతున్నారు. రఘురామపై ముసుగు వేసుకుని నలుగురు దాడి చేయగా, అందులో ఒకరు తులసిబాబుగా చెబుతున్నారు. తులసిబాబు నేరం చేశాడనేందుకు సరైన ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాదులు వాదిస్తుండగా, ఆయన రఘురామపై దాడి చేశాడని తులసిబాబు స్నేహితులే చెబుతున్నట్లు ప్రభుత్వ న్యాయవాదులు కోర్టుకు నివేదిస్తున్నారు. దీంతో రఘురామ కేసు సస్పెన్స్ గా మారింది. ఈ కేసులో ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్టు చేయగా, నిందితులు బెయిల్ కోసం న్యాయపోరాటం చేస్తున్నారు.