బంగ్లా మాజీ ప్రధాని సోదరి కుమార్తె బ్రిటన్ లో రాజీనామా.. అసలేం జరిగింది?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఆర్థిక వ్యవహారలపై ఆరోపణలు రావడంతో తులీప్ సిద్దిఖీ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
By: Tupaki Desk | 15 Jan 2025 11:28 AM GMTఇటీవల బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎపిసోడ్ ఎంత చర్చనీయాంశం అయ్యిందనే సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఆమెతో ఆర్థిక వ్యవహారాలపై ఆమె సోదరి రెహానా కుమార్తె తులీప్ సిద్దిఖీ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్రిటన్ లో లేబర్ పార్టీ తరుపున పార్లమెంట్ సభ్యురలిగా ఉన్న తులీప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అవును... బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఆర్థిక వ్యవహారలపై ఆరోపణలు రావడంతో తులీప్ సిద్దిఖీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా.. బ్రిటన్ అవినీతి నిరోధక శాఖ మంత్రిగా ఉన్న ఆమె తన పదవికి రాజీనామా చేశారు. దీంతో... అసలు ఏమి జరిగింది అనే విషయం చర్చనీయాంశంగా మారింది.
వివరాళ్లోకి వెళ్తే... మాజీ ప్రధాని షేక్ హసీనాపై మనీలాండరింగ్, అవినీతి అనుమానాలతో బంగ్లాలో నూతన ప్రభుత్వం ఇటీవల దర్యాప్తు చేపట్టింది. ఆ దర్యాప్తులో తులీప్ సిద్దిఖీ పేరును అక్కడి ప్రభుత్వం దర్యాప్తులో చేర్చింది. 12.65 బిలియన్ డాలర్ల అణువిద్యుత్ ఒప్పందానికి సంబంధంచి ఆర్థిక అవకతవకలు జరిపినట్లు ఆరోపణలు వినిపించాయి.
ఈ ఒప్పందంపై షేక్ హసీనా, తులీప్ సిద్దిఖీ లబ్ధిపొంది ఉండవచ్చని బంగ్లాదేశ్ అవినీతి వ్యతిరేక కమిషన్ పేర్కొంది. దీంతో... బ్రిటన్ ప్రభుత్వ స్వతంత్ర నైతిక సలహాదారులను ఆమె సంప్రదించారు. ఇదే సమయంలో తూర్పు లండన్ లో ఒకప్పుడు ఆమె ఉన్న ఇళ్లు.. ఇప్పుడు ఆమె సొంతం అవ్వడంపైనా చర్చ జరుగుతుందని అంటున్నారు.
వాస్తవానికి ఆ ఇంట్లో 2009 నుంచి తులిప్ నివసించారు. బంగ్లా ప్రభుత్వం తరుపున న్యావాదిగా పనిచేసిన మొయిన్ ఘనీ దాన్ని ఆమె కుటుంబానికి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో.. 2004 తులిప్ సొంతం చెసుకున్న ఆస్తి హసీనా పార్టీ అవామీ లీగ్ కు చెందిన ఓ వ్యక్తికి చెందినదని చెబుతున్నారు.
వాస్తవానికి తనపై వచ్చిన ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలను ఆమె మొదటి నుంచి ఖండిస్తూ వచ్చారు. ఈ సమయంలో బ్రిటన్ ప్రధాని ఖేర్ స్టార్మర్.. తులిప్ కు మద్దతుగా నిలిచారు. ఈ సమయంలో లేబర్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆమెకు ఆర్థిక సేవల పాలసీ పోర్ట్ ఫోలియోను అప్పగించారు.
ఈ శాఖ.. మనీలాండరింగ్ కు సంబంధించిన వ్యవహారాలను పర్యవేక్షిస్తుంది. ఈ సమయంలో తాను ఆ పదవిలో కొనసాగడం సహేతుకం కాదని భావించిన సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా స్పందించిన ఆమె.. తాను తప్పుచేశాననే ఆధారాలు ఎక్కడా లేవని ఎక్స్ వేదికగా వెల్లడించారు.