Begin typing your search above and press return to search.

కమలపై మాట యుద్ధానికి ట్రంప్ కు సాయంగా తులసి

కట్ చేస్తే.. కమలాను ఎదుర్కోవటానికి తులసి అస్త్రంతో సాధ్యమన్న విషయాన్ని గ్రహించిన ట్రంప్ ఆమెను రంగంలోకి తీసుకొచ్చారు.

By:  Tupaki Desk   |   18 Aug 2024 5:30 AM GMT
కమలపై మాట యుద్ధానికి ట్రంప్ కు సాయంగా తులసి
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న డెమోక్రటిక్ పార్టీ అధికారం నిలుపుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంటే.. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారాన్ని సొంతం చేసుకోవాలని రిపబ్లిక్ పార్టీ తపిస్తోంది.పార్టీకి మించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలు అన్నిఇన్ని కావు. ప్రచారంలో భాగంగా వచ్చే నెల 10న డిబేట్ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే మొదలైనట్లుగా చెబుతున్నారు.

మొదటి డిబేట్ నాటికి అధ్యక్ష బరిలో ఉన్న బైడెన్ తో జరగటం.. ఆ డిబేట్ లో ట్రంప్ స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించటం తెలిసిందే. ఆ డిబేట్ తర్వాత అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్ ను మార్చేసి భారత మూలాలు ఉన్న కమలా హారిస్ ను రంగంలోకి తీసుకురావటం తెలిసిందే. రెండో డిబేట్ లో ట్రంప్ పై తన అధిక్యాన్ని ప్రదర్శించేందుకు కమలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే కమలా హారిస్ పై అధిక్యత కోసం ట్రంప్ తన అమ్ముల పొదిలో నుంచి కొత్త అస్త్రాన్ని బయటకు తీశారు. తమ పార్టీకి చెందిన భారత మూలాలుఉన్న తులసి గబ్బర్డ్ సాయాన్ని తీసుకోనున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన ఒక ఆసక్తికర కథనాన్ని అక్కడి ప్రముఖ మీడియా సంస్థ అయిన న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. రెండో డిబేట్ కు ట్రంప్ తన ప్రైవేట్ క్లబ్ లో కసరత్తు షురూ చేశారని.. ఈ ప్రాక్టీస్ సెషన్ లో తులసి తాజాగా జాయిన్ అయినట్లుగా చెబుతున్నారు. ఇదే విషయాన్ని ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ ధ్రువీకరించారు.

అంతమంది ఉన్నప్పటికీ తులసిని ఎందుకు ట్రంప్ ఎంపిక చేసుకున్నారంటే దానికి కారణం లేకపోలేదు. 2019 నాటికి తులసి గబ్బార్డ్ సైతం డెమోక్రాటిక్ పార్టీలోనే ఉండేవారు. పార్టీ ప్రైమరీ ఎంపిక టైంలో కమలా హారిస్ - తులసి మధ్య డిబేట్ జరిగింది. ఇందులో హారిస్ పై తులసి స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించటమే కాదు.. ఆమెను ఓడించారు కూడా. హారిస్ విధానాలపై తులసి తీవ్రంగా దాడి చేయటమే కాదు.. ఆమె విధానాల్లోని లోపాల్ని ఎత్తి చూపారు. ఆ తర్వాతి కాలంలో డెమోక్రటిక్ పార్టీ నుంచి తులసి వైదొలిగి.. రిపబ్లికన్ల పార్టీలోకి చేరారు.

కట్ చేస్తే.. కమలాను ఎదుర్కోవటానికి తులసి అస్త్రంతో సాధ్యమన్న విషయాన్ని గ్రహించిన ట్రంప్ ఆమెను రంగంలోకి తీసుకొచ్చారు. ప్రత్యర్థిని ఎలా దెబ్బ కొట్టాలన్న దానిపై తులసికి పూర్తి స్థాయిలో అవగాహన ఉండటంతో ఆమె సాయంతో కమలాను ఎదుర్కోవాలని ట్రంప్ భావిస్తున్నారు. నిజానికి ట్రంప్ కు డిబేట్ కోసం ప్రత్యేకంగా ప్రాక్టీస్ అవసరం లేదు. కానీ.. కమలతో డిబేట్ అంటే ఆయన ఇబ్బందికి గురవుతున్నారు. దీన్ని అధిగమించేందుకు తులసి సాయాన్ని తీసుకుంటున్నారు. తులసి ఎంట్రీతో.. ఈ డిబేట్ పై ఆసక్తి మరింత పెరిగిన పరిస్థితి.