Begin typing your search above and press return to search.

తుమ్మల ప్లస్ కాంగ్రెస్ మైనస్ బీయారెస్... అదిరింది బాసూ...!

తెలంగాణా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత మాజీ మంత్రి ప్రస్తుత బీయారెస్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయారు.

By:  Tupaki Desk   |   31 Aug 2023 4:17 PM GMT
తుమ్మల ప్లస్  కాంగ్రెస్  మైనస్ బీయారెస్... అదిరింది బాసూ...!
X

తెలంగాణా రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ నేత మాజీ మంత్రి ప్రస్తుత బీయారెస్ లీడర్ తుమ్మల నాగేశ్వరరావు టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ అయిపోయారు. ఆయన దశాబ్దాల అనుభవం ఉన్న నేత. అంతే కాదు ఖమ్మం జిల్లాలో అంగబలం అర్ధబలం నిండుగా ఉన్న వారు. 2014లో టీడీపీ నుంచి నాటి టీయారెస్ లోకి జంప్ చేసిన తుమ్మలకు మంత్రి పదవి ఇచ్చి గౌరవించిన బీయారెస్ పెద్దలు 2019లో ఆయన ఓడిపోగానే పక్కన పెట్టేశారు అన్న బాధ ఆయనతో పాటు అనుచరులకు ఉంది.

ఇక తాజా ఎన్నికల్లో అయినా టికెట్ ఇస్తారని తుమ్మల భావించారు. కానీ అదేమీ జరగలేదు. పాలేరు టికెట్ కోసం తుమ్మల చూస్తున్నారు. అక్కడ కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతకు టికెట్ ఇచ్చేసి తుమ్మలకు ఏమి సంకేతాలు ఇచ్చారో తెలియదు కానీ ఈ సీనియర్ నేత రగిలిపోతున్నారు. ఉన్న పార్టీలో టికెట్ లేక ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపధ్యాన్ని కాంగ్రెస్ కరెక్ట్ గానే వాడుకుంటోంది.

మొదట ఖమ్మం జిల్లాకు చెందిన నేతలు తుమ్మలకు టచ్ లోకి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటికే తుమ్మల పాజిటివ్ గా సిగ్నల్స్ ఇచ్చారు. ఇపుడు మరో అడుగు ముందుకేసి పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు టీ కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి వంటి వారు ఆయన ఇంటికి స్వయంగా వెళ్ళి మరీ పార్టీలోకి ఆహ్వానించేశారు. ఇక తుమ్మల కాంగ్రెస్ లో చేరడం లాంచనమే అంటున్నారు.

తుమ్మల కాంగ్రెస్ లో చేరితే ఏకంగా ఖమ్మం కోట మొత్తం తమ వశం అవుతుంది అన్నది కాంగ్రెస్ నమ్మకంగా ఉంది. నిజానికి ఖమ్మంలో బీయారెస్ కి బలం తక్కువగానే ఉంటుంది. ఇక ఒక వైపు బలమైన నేతలను తమ వైపునకు తిప్పుకుంటూనే ఖమ్మంలో పట్టున్న కమ్యూనిస్టులను కూడా పొత్తులో భాగంగా అక్కున చేర్చుకుంటే ఈసారి పక్కాగా పెద్ద జిల్లాలో సీట్లు మొత్తం స్వీప్ చేయవచ్చు అన్నది కాంగ్రెస్ మార్క్ స్ట్రాటజీ గా ఉంది.

ఇదిలా ఉంటే తుమ్మల నాగేశ్వరరావు అన్నీ అనుకూలిస్తే సెప్టెంబర్ 6న కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు. ఆయన కోరుకున్న సీటుని ఇవ్వడంతో పాటు ఆయనకు కాంగ్రెస్ లో రాచమర్యాదలే అని అంటున్నారు. సో పాలేరు నుంచి తుమ్మల పోటీ ఖాయమని అంటున్నారు.

మరో వైపు చూస్తే బీయారెస్ ని దెబ్బ తీసేందుకు తుమ్మలను ఆ పార్టీ నుంచి మైనస్ చేసి కాంగ్రెస్ కి ప్లస్ చేయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో అధికారంలోకి వచ్చేందుకు అవసరం అయిన అరవై సీట్లు మ్యాజిక్ ఫిగర్ ని సునాయాసంగా చేరుకోవాలన్నది కాంగ్రెస్ టార్గెట్. ఈ క్రమంలో బీయారెస్ లో ఉన్న అసంతృప్త నేతలు, బడా నేతలు బిగ్ షాట్స్ ని క్షణం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ లోకి నడిపించాలన్నది ఖద్దర్ పార్టీ నేతల బ్రహ్మాండమైన వ్యూహం. ఇది కనుక సక్సెస్ అయితే బీయారెస్ కి చుక్కలే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.