రంగం సిద్ధం: తుమ్మల రెఢీ.. అంతకంతకూ స్ట్రాంగ్ అవుతున్న కాంగ్రెస్
ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తుమ్మల ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది.
By: Tupaki Desk | 16 Sep 2023 4:41 AM GMTఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రోజు వచ్చేసింది. తెలంగాణ సీనియర్ నేత.. సీఎం కేసీఆర్ పట్టుబట్టి మరీ పార్టీలోకి చేర్చుకొని మంత్రిపదవి ఇచ్చి అందలం ఎక్కించిన తుమ్మల నాగేశ్వరరావుకు తర్వాతి రోజుల్లో ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్న విషయాలు అందరికి తెలిసిందే. గడిచిన కొన్నేళ్లుగా దూరం పెట్టిన తుమ్మలకు ఈసారీ టికెట్ దక్కకపోవటం తెలిసిందే.
ఈ నేపథ్యంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తుమ్మల ఆసక్తి చూపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగింది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ వేదికగా చేసుకొని మూడు రోజుల పాటు సాగనున్న కాంగ్రెస్ అత్యున్నత స్థాయి సమావేశమైన సీడబ్ల్యూసీ వేళలోనే తుమ్మలకు పార్టీ తీర్థం ఇచ్చి.. కండువా కప్పి సాదరంగా ఆహ్వానించేందుకు రంగం సిద్ధమైంది.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో తుమ్మల చేరనున్నారు. ఆయనతో పాటు బీజేపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి.. జిట్టా బాలక్రిష్ణా రెడ్డిలతో పాటు మరికొందరుకూడా పార్టీలో చేరనున్నారు. ఈ పరిణామాలతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం పొంగిపోర్లుతోంది. తుమ్మల పార్టీలోకి వస్తున్న నేపథ్యంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాద్యుడు మాణిక్ రావ్ ఠాక్రే.. టీపీసీసీ రథసారధి రేవంత్ రెడ్డి.. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు తుమ్మల ఇంటికి వెళ్లారు. పార్టీలో చేరాలని కోరగా.. అందుకు ఆయన ఓకే చెప్పేసినట్లుగా పేర్కొన్నారు.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం తుమ్మలకు ఖమ్మం అసెంబ్లీ టికెట్ ను ఇస్తారని చెబుతున్నారు. తుమ్మల గతంలో ప్రాతినిధ్యం వహించిన పాలేరు టికెట్ కోసం పొంగులేని దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య సీట్ల సర్దుబాటు చేసేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్.. రాజీ ఫార్ములాగా ఖమ్మం టికెట్ ను కాంగ్రెస్ ఇచ్చేందుకు మాట ఇచ్చినట్లుగా సాగుతోంది.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ లోకి చేరేందుకు వివిధ పార్టీలకు చెందిన నేతలు.. వారి ఫాలోవర్లు ఆసక్తిని చూపుతున్నారు. శుక్రవారం వరకే చూసుకుంటే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కలిసిన చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెల.. మంచిర్యాల జెడ్పీ ఛైర్ పర్సన్ భాగ్యలక్మీతో పాటు పలువురు పార్టీలో చేరారు. మొత్తానికి ఎన్నికల వేళ పలువురు నాయకుల చేరికలతో కాంగ్రెస్ పార్టీలో మహా సందడి వాతావరణం నెలకొందని చెప్పాలి. మరి.. ఈ ఉత్సాహం ఎన్ని రోజుల వరకు సాగుతుందన్నదే అసలుసిసలు సందేహం.