టీడీపీ.. టీఆర్ఎస్..కాంగ్రెస్.. పార్టీ ఏదైనా గెలుపు ఆయనదే
ఆయన పేరు చెప్పగానే తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. అలాంటి ఆయన 1983 నుంచి 2004 వరకు సత్తుపల్లిలో.. 2009, 2014లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవటం తెలిసిందే.
By: Tupaki Desk | 4 Dec 2023 4:36 AM GMTసీనియర్ నేత ఎవరైనా సరే.. ప్రతి ఒక్కరికి ఒక పార్టీ అన్నది ఉంటుంది. కాదంటే.. రెండు పార్టీల నుంచి కూడా పోటీ చేయొచ్చు. కానీ.. తాము నడిచే దారికి భిన్నంగా.. అంటే సైద్దాంతికంగా ఏ మాత్రం పొసగని పార్టీల నుంచి కూడా పోటీ చేసినా గెలుపును దక్కించుకునే నేతలు కొద్ది మంది ఉంటారు. తాజా ఎన్నికల్లో అలాంటి కొందరు తాము ఎంత స్పెషల్ అన్న విషయాన్ని విజయంతో ఫ్రూవ్ చేశారు. తాము ఏ పార్టీలో ఉన్నా.. గెలుపు మాత్రం తమ వాకిట్లో ఉంటుందన్న విషయాన్ని మరోసారి ఫ్రూవ్ చేశారు. అలాంటి వారెవరంటే..
తుమ్మల నాగేశ్వరరావు
ఆయన పేరు చెప్పగానే తెలుగుదేశం పార్టీ గుర్తుకు వస్తుంది. అలాంటి ఆయన 1983 నుంచి 2004 వరకు సత్తుపల్లిలో.. 2009, 2014లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలవటం తెలిసిందే. మొత్తం ఎనిమిదిసార్లు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999లో గెలవగా.. 1983, 1989లలో మాత్రం ఓటమిపాలయ్యారు.
2009లో ఖమ్మంలో గెలిచిన ఆయన 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తుమ్మల ఇంటికి స్వయంగా వెళ్లిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించిన గులాబీ కారులోకి ఎక్కించారు. అనంతరం ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవిని అప్పజెప్పారు. అనంతరం పాలేరు నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన రాంరెడ్డి వెంకట్ రెడ్డి మరణించటంతో జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మలను టీఆర్ఎస్ అభ్యర్థిగా నిలిపి గెలిచేలా చేవారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత కేసీఆర్ తో దూరం పెరగటం.. తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఆయన ఈ మధ్యన కాంగ్రెస్ లోకి వెళ్లటం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఖమ్మం నుంచి పోటీ చేసిన ఆయన విజయం సాధించటం ద్వారా.. మూడు భిన్నమైన పార్టీల నుంచి గెలిచిన నేతగా నిలిచారు.
పాయం వెంకటేశ్వర్లు
కామ్రేడ్ గా సుపరిచితులైన ఆయన 2004లో పినపాక (ఎస్టీ) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాతి కాలంలో ఈ నియోజకవర్గం రద్దు కావటం తెలిసిందే. 2009లో సీపీఐ తరఫున పోటీ చేసిన ఓడిన ఆయన.. 2014లో మాత్రం వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు. తర్వాతి కాలంలో ఆయన టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్)లోకి వెళ్లిపోయారు. 2018లో అధికార పార్టీ నుంచి పోటీ చేసి ఓడిన ఆయన.. తాజా ఎన్నికల్లో టికెట్ రాకపోవటంతో ఆయన కాంగ్రెస్ లో చేరారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి రేగా కాంతారావుపై కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఇలా.. భిన్నమైన పార్టీల నుంచి పోటీ చేసిన గెలిచిన నేతగా నిలిచారు.
జూపల్లి క్రిష్ణారావు
సీనియర్ నేతగా.. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన నేతగా పేరుంది. అయితే..కాలంతో వచ్చే మార్పుల కారణంగా పార్టీ మారటం అనివార్యమైంది. తిరిగి సొంత గూటికి చేరిన ఆయన తాజా ఎన్నికల్లో మరోసారి విజయాన్ని సాధించటం ద్వారా.. తన సత్తా చాటారు. 1999, 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన ఆయన.. 2012 ఉప ఎన్నిక, 2014లో నాటి టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. మంత్రిగా వ్యవహరించారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన ఆయన.. ఇటీవల కాంగ్రెస్ లో చేరిన ఆయన.. విజయం సాధించారు.