Begin typing your search above and press return to search.

40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయలేదు... ఖమ్మంలో తుమ్మల వ్యాఖ్యలు!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. పైగా గత రెండుమూడు రోజులుగా ఖమ్మం నియోజకవర్గంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి

By:  Tupaki Desk   |   24 Oct 2023 7:28 AM GMT
40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చేయలేదు... ఖమ్మంలో తుమ్మల వ్యాఖ్యలు!
X

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. పైగా గత రెండుమూడు రోజులుగా ఖమ్మం నియోజకవర్గంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. ఈ నియోజకవర్గంలో బీఆరెస్స్ అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్‌ మరోసారి బరిలో దిగుతుండగా.. కాంగ్రెస్‌ నుంచి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. దీంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది.

అవును... ప్రచార పర్వానికి పూర్తిస్థాయిలో తెరలేవకముందే ఖమ్మం జిల్లాలో తుమ్మల వర్సెస్ పువ్వాడ.. మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇదే సమయంలో సామాజికవర్గాల వారీగా ఇద్దరు నేతలు ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ మద్దతు కూడగట్టుకునే పనికి పూనుకున్నారు. ఇదే సమయంలో... అరాచక శక్తులను తరిమికొట్టాలని, ఐదేండ్లుగా ప్రజావ్యతిరేక పాలన కొనసాగిస్తున్న బీఆరెస్స్ ప్రభుత్వంతో జనం విసుగు చెందారని తుమ్మల నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు.

మరోపక్క పువ్వాడ అజయ్‌ కూడా తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు నాడు మంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన రాజకీయ హత్యలు అన్నీ ఇన్నీ కావని.. ఖమ్మంలో రౌడీయిజానికి తెరలేపి, ఎంతోమంది రౌడీషీటర్లను కాపాడారని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్టీఆర్‌ వంటి నేతకు చంద్రబాబుతో కలిసి తుమ్మల వెన్నుపోటు పోడిచారు.. ఆ విషయంలో ఇప్పటికీ ఎన్టీఆర్‌ ఆత్మ ఘోషిస్తుందని దుయ్యబట్టారు.

ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడితో అంటకాగిన తుమ్మల నాగేశ్వర రావు.. ఎంతోమంది నాయకుల రాజకీయ జీవితాలను సమాధి చేశారని.. ఆ తర్వాత బీఆరెస్స్ అధినేత కేసీఆర్‌ పంచన చేరి, పదవులు అనుభవించారని అన్నారు. ఇక ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో చేరారని తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ మండిపడ్డారు.

దీంతో తాజాగా ఖమ్మం 14వ డివిజన్ ఆత్మీయ సమావేశంలో తుమ్మల మాట్లాడారు. ఇందులో భాగంగా... ఇప్పుడు జరుగుతున్న అరాచక, అవినీతి, నిర్బంధ పాలన తన జీవితంలో చూడలేదని అన్నారు. ప్రతీకార రాజకీయానికి తన నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో ఏనాడూ పాల్పడలేదని చెప్పుకొచ్చారు. ఖమ్మంలో అరాచక పాలనపై ప్రజల్లో పెద్ద ఎత్తున తిరుగుబాటు ఉందని.. సుస్థిర పాలన కోసం కాంగ్రెస్ పార్టీనే గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

ఈ విధంగా ఖమ్మం కేంద్రంగా వీరిద్దరిమధ్యా మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంటుంది. ఇందులో భాగంగా ఒకరు ఒకటంటే.. మరొకరు రెండంటున్నారు!

కాగా... 2014 ఎన్నికల్లో ఖమ్మం నుంచి పువ్వాడ అజయ్ - తుమ్మల నాగేశ్వర రావు ప్రత్యర్థులుగా తలపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున తుమ్మల నాగేశ్వర రావు, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌ బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో తుమ్మలపై పువ్వాడ అజయ్ 5,682 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో టీఆరెస్స్ అభ్యర్థి నాలుగో స్థానంలో నిలిచారు.

తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో వీరిద్దరూ ఒకేగూటికి చేరారు. ఇందులో భాగంగా కారెక్కారు. అనంతరం 2018 ఎన్నికల్లో పువ్వాడ అజయ్‌ రెండోసారి ఖమ్మం నుంచి బరిలో నిలిచారు. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు పై 10,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పాలేరు నుంచి టీఆరెస్ అభ్యర్థిగా పోటీ చేసిన తుమ్మల ఓటమి పాలయ్యారు.

ఈ క్రమంలో... ఇటీవల తుమ్మల బీఆరెస్స్ నుంచి బయటకొచ్చి కాంగ్రెస్ లో చేరారు! ఈ సందర్భంగా... రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందంటూ ఫైరయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబు అరెస్ట్ పై కూడా స్పందించిన ఆయన... అరెస్ట్ అప్రజాస్వామికమని, రాజకీయ కక్షతోనే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో చంద్రబాబు ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వర రావు మంత్రిగా పని చేసిన సంగతి తెలిసిందే.