రాజకీయ చౌరస్తాలో తుమ్మల.. ఏ పార్టీకైనా ఆయనే బలం
మంత్రిగా ఏకఛత్రాధిపత్యం వహించిన జిల్లాలోనే ఆయనకు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది
By: Tupaki Desk | 23 Aug 2023 6:34 AM GMTఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ కు మొదటి నుంచి ఆయువుపట్టు.. కమ్యూనిస్టులకైతే పెట్టని కోట.. అలాంటిచోట తెలుగుదేశం పార్టీకి చోటుంటుందా..? ఆ పార్టీ నిర్మాణానికి అవకాశం ఉంటుందా..? పైకి చూస్తే కష్టమే.. కానీ, ఒక నాయకుడి పట్టుదలతో అది సాధ్యమైంది. అక్కడ టీడీపీ బలమైన పార్టీగానూ ఎదిగింది. మంత్రిగా ఏకఛత్రాధిపత్యం వహించిన జిల్లాలోనే ఆయనకు ఇప్పుడు రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పునర్విభజనలో సొంత నియోజకవర్గాన్ని వదులుకోవాల్సి వచ్చింది.. మరో నియోజకవర్గం నుంచి పోటీ చేసి నెగ్గినా.. తర్వాతి ఎన్నికల్లో ఓటమి ఎదురైంది. అనూహ్యంగా లక్ వరించినా అది కొంతకాలమే నిలిచింది. ఇక రాబోయే ఎన్నికల్లో ఆయనకు టికెట్టే లేకుండా పోయింది. పుట్టిపెరిగిన పార్టీకి ఆదరణ లేదు.. ఇప్పుడున్నచోట టికెట్ దక్కలేదు.. ప్రత్యర్థి పార్టీలోకి వెళ్దామంటే వర్గ పోటీ.. మొత్తానికి ఓ వెలుగు వెలిగిన ఆ రాజకీయ నాయకుడి జీవితం ప్రస్తుతం చౌరస్తాలో ఉంది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుదీర్ఘ కాలం రాజకీయాల్లో కొనసాగి దిగ్గజాలుగా ఎదిగినది ఎవరంటే.. ఒకరు జలగం వెంగళరావు, మరొకరు తుమ్మల నాగేశ్వరరావు. ఇంకొందరు కూడా రాజకీయాల్లో దశాబ్దాల పాటు కొనసాగినా వీరిద్దరిలా పదవులు, కార్యకర్తల అభిమానం, వారి వారి పార్టీలపై విశేషమైన ముద్ర వేసింది లేదు. జలగం, తుమ్మల మాత్రం అలా కాదు.. ఉమ్మడి ఖమ్మం వ్యాప్తంగా వీరికి బలగం ఉంది. విచిత్రం ఏమంటే వీరిద్దరిదీ ఒకే నియోజకవర్గం (సత్తుపల్లి). ఒకప్పుడు రాజకీయ ప్రత్యర్థులు కూడా.
కాగా, 25 ఏళ్ల కిందనే జలగం మరణించారు. ఇక గత 40 ఏళ్లుగా తుమ్మల ఖమ్మం రాజకీయాల్లో కీలక శక్తి. సత్తుపల్లి నుంచి 1985, 1994, 1999 ఎన్నికల్లో గెలుపొందిన ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు మంత్రివర్గాల్లో కీలక శాఖలు చూశారు. కాగా, 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో తుమ్మల స్థానం మారాల్సి వచ్చింది. సత్తుపల్లికి ఎక్కడో 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఖమ్మం నుంచి పోటీ చేసి నెగ్గారు. అయితే, 2014లో మాత్రం ఓటమి ఎదురైంది.
పిలిచి పెద్దపీట వేసిన కేసీఆర్
2014లో తెలంగాణ ఏర్పడ్డాక రాజకీయ పునరేకీకరణలో సీఎం కేసీఆర్ తన మిత్రుడైన తుమ్మలను పిలిచి పెద్ద పీట వేశారు. ఎమ్మెల్సీని చేయడమే కాక మంత్రి పదవీ ఇచ్చారు. అనూహ్యంగా వచ్చిన 2016 ఉప ఎన్నికలో తుమ్మల పాలేరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ, వర్గ రాజకీయాల కారణంగా 2018లో ఓటమి పాలయ్యారు. అదే తుమ్మల రాజకీయ జీవితంలో టర్నింగ్ పాయింట్ అయింది. సత్తుపల్లిలో రెండు సార్లు, ఖమ్మంలో ఓసారి ఓడినా.. పాలేరులో పరాజయమే బాగా చేటుచేసింది. కేసీఆర్ కు అత్యంత సన్నిహితులైనప్పటికీ గత ఐదేళ్లుగా తుమ్మల ఏ పదవీ లేకుండా ఉండిపోయారు. పాలేరులో తనపై గెలిచిన కందాళ ఉపేందర్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి తీసుకున్నప్పటికీ తుమ్మల మౌనంగానే ఉన్నారు.
ఇప్పుడు పయనం ఎటో..?
పాలేరు టికెట్ కందాళకే దక్కడంతో తుమ్మల రాజకీయ భవితవ్యం ఏమిటనే ప్రశ్న వస్తోంది. ఒకవిధంగా చెప్పాలంటే 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయనకు ఎన్నడూ ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదు. ఈ నేపథ్యంలోనే తుమ్మలకు టికెట్ ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ లోని కొందరు నాయకులు అసమ్మతి గళం వినిపిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల నాయకులు, తుమ్మల అనుచరులు మంగళవారం ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురంలో సమావేశమై భవిష్యత్తు కార్యాచరణ గురించి చర్చించారు.
పార్టీని నమ్ముకుని ఉన్న తుమ్మలకు టికెట్ దక్కకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా పార్టీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే అభిప్రాయంతో వారంతా ఉన్నారు. తుమ్మల హైదరాబాద్ నుంచి వచ్చాక చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని ఏకగ్రీవంగా తీర్మానించినట్లు సమాచారం.
కాంగ్రెస్సా..? బీజేపీనా? టీడీపీనా?
తుమ్మల పార్టీ మారితే ఎటువైపు వెళ్తారన్నది ఆసక్తికరం. రాజకీయ జీవితంలో కనీసం కన్నెత్తి కూడా చూడని కాంగ్రెస్ లో చేరతారా? అంటే దీనికి సమాధానం తెలంగాణలో ఇప్పుడున్న పార్టీల్లో అదే ముందంజలో ఉంది. బీజేపీలోకి వెళ్తారా? అంటే.. ఆ పార్టీ ఉమ్మడి ఖమ్మంలో పూర్తిగా.. మిగతా తెలంగాణలో పూర్తిగా వెనుకబడి ఉంది. భావజాల పరంగానూ సరిపోదు. ఇక మిగిలింది పూర్వాశ్రమంలోని టీడీపీ.. వాస్తవానికి టీడీపీకి ఇప్పటికీ తెలంగాణలో బీజేపీ కంటే ఎక్కువ బలమే ఉందని చెప్పొచ్చు.
దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్న కార్యకర్తలకు తోడు సైద్ధాంతిక బలం, సామాజిక పునాది గట్టిగా ఉన్నాయి. ఒకవేళ తుమ్మల గనుక టీడీపీలోకి పునరాగమనం చేస్తే అది పార్టీకి బలమే. బీజేపీ లేదా కాంగ్రెస్ లో చేరినా ఆ పార్టీలకూ బలమే. బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే ఆ పార్టీకి ఉమ్మడి ఖమ్మంలో పెద్ద దెబ్బని మాత్రం చెప్పొచ్చు. వెరసి తుమ్మల రాజకీయ జీవితం ప్రస్తుతం చౌరస్తాలో ఉంది. ఆయన ఎటువైపు వెళ్తారో చూద్దాం..