Begin typing your search above and press return to search.

కార్మికులకు చేరువలో రెస్క్యూ టీం... తాజా గుడ్ న్యూస్ ఇదిగో!

దీంతో... సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను చేరుకోవాలంటే మరో 5 - 10 మీటర్ల తవ్వాల్సి ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   28 Nov 2023 7:30 AM GMT
కార్మికులకు చేరువలో రెస్క్యూ  టీం... తాజా గుడ్  న్యూస్  ఇదిగో!
X

ఉత్తరాఖండ్‌ లోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు సహాయక బృందాలు తీవ్రంగా ప్రయత్నిస్తు‍న్న సంగతి తెలిసిందే. ఏదో ఒక రూపంలో ఎదురవుతున్న అడ్డంకులను అదిరోహించి వరుస మార్పులు చేసుకుంటూ సుమారు గత 17 రోజులు సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో తాజాగా చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి కనిపిస్తోంది.

అవును... ఉత్తరాఖండ్‌ లోని ఉత్తర్‌ కాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను కాపాడేందుకు చేపట్టిన సహాయక చర్యల్లో పురోగతి కనిపిస్తోంది. నేలకు సమాంతరంగా చేపట్టిన పనులు ఆగిపోయిన చోట 12 మంది "ర్యాట్‌ హోల్‌ మైనర్లు" తవ్వకాలు చేపట్టారు. దీంతో ఇప్పటి వరకు 50 మీటర్లకు పైగా తవ్వకం పూర్తయినట్లు సహాయక బృందంలోని అధికారులు వెల్లడించారు.

దీంతో... సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను చేరుకోవాలంటే మరో 5 - 10 మీటర్ల తవ్వాల్సి ఉందని అంటున్నారు. అన్నీ అనుకూలంగా జరిగితే... నేటి సాయంత్రానికి రెస్క్యూ పనులు కీలక దశకు చేరుకుని గుడ్ న్యూస్ వినే అవకాశముందని చెబుతున్నారు.

కాగా... అంతకుముందు కార్మికులను రక్షించడం కోసం ఆగర్‌ యంత్రంతో దాదాపు 47 మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సదరు యంత్రం విరిగిపోయి మధ్యలోనే చిక్కుకుపోయింది. దీంతో మ్యానువల్‌ డ్రిల్లింగ్‌ చేపట్టి.. యంత్రాన్ని దాని నుంచి తొలగించారు. ఆ తర్వాత "ర్యాట్‌ హోల్‌ మైనర్లు" సోమవారం రాత్రి నుంచి తవ్వకాలు ప్రారంభించారు.

ఈ "ర్యాట్‌ హోల్‌ మైనింగ్‌" బృందానికి చెందిన అనుభవజ్ఞులైన 24 మంది ఈ మాన్యువల్ డ్రిల్లింగ్ పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా తొలుగ 800 మిల్లీమీటర్ల వ్యాసమున్న స్టీల్‌ పైపు నుంచి డ్రిల్లింగ్‌ మెషీన్‌ బ్లేడ్లను తొలగించి.. అదే మార్గంలోకి వెళ్లిన కార్మికులు.. సొరంగానికి మ్యాన్యువల్‌ గా రంధ్రం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు దాదాపు 2 మీటర్ల మేర మాన్యువల్‌ డ్రిల్లింగ్‌ పూర్తయింది.

మరోవైపు టన్నెల్‌ పైభాగం నుంచి వెర్టికల్‌ డ్రిల్లింగ్‌ పనులు కూడా తదనుగుణంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా... 86 మీటర్లు తవ్వాల్సి ఉండగా.. మంగళవారం ఉదయం నాటికి 51 మీటర్ల మేర పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రెస్క్యూ టీ నుంచి కార్మికులు కేవలం 5 మీటర్ల దూరంలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ అయిదు మీటర్ల డ్రిల్లింగ్ పూర్తయితే కార్మికులను చేరుకోనున్నారని సమాచారం.

కాగా... సొరంగంలో 41మంది కార్మికులు గత 16 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల వారు ఉంటున్న ప్రాంతం వద్దకు ఎండోస్కోపి తరహాలోని కెమెరాను పంపి వారితో మాట్లాడారు. దీంతో... కూలీలంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో అన్నీ అనుకూలంగా జరిగితే ఈ రోజు సాయంత్రం లోపు గుడ్ న్యూస్ వినొచ్చని చెబుతున్నారు.