Begin typing your search above and press return to search.

దివాలా అంచుల్లో 'టప్పర్ వేర్'

ఈ అమెరికా కంపెనీ ఆ దేశంలోనే కాదు.. పలు దేశాల్లోనూ ఎంతటి ఆదరణ పొందిందన్న విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   18 Sep 2024 4:26 AM GMT
దివాలా అంచుల్లో టప్పర్ వేర్
X

జీవితంలో ఒక్కసారి కొంటే చాలు.. ఎన్నిసార్లు అయినా మార్చుకునే వీలు లాంటి ఊరించే ఆఫర్ మాత్రమే కాదు.. ఖరీదు ఎక్కువైనప్పటికీ క్వాలిటీ ఉన్న ప్లాస్టిక్ వస్తువుల్ని అందించే సంస్థగా టప్పర్ వేర్ గురించి చెబుతారు. ఈ అమెరికా కంపెనీ ఆ దేశంలోనే కాదు.. పలు దేశాల్లోనూ ఎంతటి ఆదరణ పొందిందన్న విషయం తెలిసిందే. కొన్ని దశాబ్దాలుగా ఒక వెలుగు వెలిగిన ఈ కంపెనీ ఇప్పుడు దివాలా అంచుల్లో ఉన్న కొత్త విషయం వెలుగు చూసింది. షాకింగ్ గా మారిన ఈ ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ప్లాస్టిక్ వస్తువుల్నితయారు చేసే సంస్థలు ఎన్ని ఉన్నప్పటికీ.. నాణ్యతతోపాటు.. ఆహారాన్ని నిల్వ ఉంచుకోవటానికి అత్యుత్తమ ప్లాస్టిక్ తో వస్తువుల్ని తయారు చేసే సంస్థగా టప్పర్ వేర్ కు పేరుంది. ప్లాస్టిక్ బాక్సుల తయారీలో విప్లవాన్ని క్రియేట్ చేసిన ఈ సంస్థ పుట్టెడు ఆర్థికకష్టాల్లో ఉంది. దివాలాకు దగ్గరగా ఉందన్న సమాచారాన్ని ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్ బెర్గ్ వెల్లడించింది. ఈ సమాచారంతో న్యూయార్క్ లో కంపెనీ షేర్లు యాభై శాతం కంటే ఎక్కువగా నష్టపోయాయి.

1946లో కెమికల్ సైంటిస్టు ఎర్ల్ టప్పర్ స్థాపించిన ఈ కంపెనీ 1950లలో అధిక ప్రజాదరణ పొందింది. కరోనా వేళలోనూ మంచి అమ్మకాలే సాగాయి. అయితే.. ఆ తర్వాత అమ్మకాలు క్షీణించాయి దీనికి తోడు.. లోన్ కండిషన్లను కంపెనీ ఉల్లంఘించటంతో కోర్టుకు వెళ్లాలని భావిస్తోంది. 700 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువగా ఉన్న రుణాల్ని ఎలా మేనేజ్ చేయాలన్నది ఇప్పుడా కంపెనీ ముందున్న పెద్ద ప్రశ్నగా చెబుతున్నారు. కంపెనీలో ఖర్చు తగ్గింపుతో పాటు.. ఆర్థిక సమతుల్యతను పరిగణలోకి తీసుకొని ఇటీవల 150 మందిని తొలగించేందుకు రంగం సిద్ధం చేశారు. దీంతో పాటు పలు నిర్ణయాల్ని తీసుకున్నా.. కంపెనీ డౌన్ ఫాలో ను ఆపలేని పరిస్థితి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. బండ్లు ఓడలు..ఓడలు బండ్లు కావటం అంటే ఇదేనేమో?