డిజిటల్ మీడియాపై కేసులు పెట్టిన టీవీ9 రజనీకాంత్!
అవును... ప్రముఖ యాంకర్, టీవీ9 న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ వి. రజనీకాంత్ తాజాగా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు.
By: Tupaki Desk | 20 Jun 2024 2:14 PM GMTఇటీవల కాలంలో తప్పుడు వార్తలు రాసే డిజిటల్ మీడియా సంస్థలు, సోషల్ మీడియా గ్రూపులూ ఎక్కువైపోయాయనే కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి వాటికి రాజకీయ నాయకులు, సినీనటులు మొదలైన వారు ఎంతోమంది బాధితులు అని చెబుతుంటారు. ఈ క్రమంలో ఆ జాబితాలో తానూ ఉన్నానంటూ ముందుకు వచ్చారు టీవీ9 రజనీకాంత్!
అవును... ప్రముఖ యాంకర్, టీవీ9 న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ వి. రజనీకాంత్ తాజాగా సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఇందులో భాగంగా... తనపై తప్పుడు వార్తలను ప్రసారం చేసి, తన ప్రతిష్టను దిగజార్చారని ఆరోపిస్తూ పలు డిజిటల్ మీడియా, సోషల్ మీడియా గ్రూపులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో ఈ విషయం వైరల్ గా మారింది.
కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తన ఫోటోలతో నకిలీ కంటెంట్ తో చిత్రాలను మార్ఫింగ్ చేసి, సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు రజనీకాంత్. వాట్సప్, ఫేస్ బుక్ సహా పలు తెలుగు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానెల్ లు, సోషల్ మీడియా అకౌంట్లను ఈ సందర్భంగా ప్రస్థావించారని అంటున్నారు.
రజనీకాంత్ తన వ్యాపార భాగస్వామి ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో న్యూఢిలీకి వెళ్లారని.. ఈ విషయం తెలిసి ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసిందంటూ గత రెండు రోజులుగా పలు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్స్, సోషల్ మీడియా వర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతుంది! దేశంలోని రిచ్చెస్ట్ జర్నలిస్ట్ గా రజనీని అభివర్ణిస్తూ కథనాలు రాసాయని అంటున్నారు.
ఇదే సమయంలో ఆయనకు హైదరాబాద్, బెంగళూరు, అమరావతి వంటి ప్రధాన ప్రాంతాల్లో ఆస్తులు ఉన్నాయని.. వైసీపీ నేతలతో సన్నిహిత వ్యాపార సంబంధాలూ ఆయనకు ఉన్నాయని కూడా ఆ కథనాల్లో పేర్కొన్నట్లు తెలుస్తుంది. దీంతో ఇవన్ని తనకు దృష్టికి రావడంతో... రజనీకాంత్ సీరియస్ గా రియాక్ట్ అయ్యారని అంటున్నారు.
దీంతో... ఇవన్నీ తప్పుడు కథనాలని, కొన్ని వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానళ్లూ పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నాయన్నట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారని అంటున్నారు. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు నిందితులపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 469, 505 (1) (సి) కింద కేసులు నమోదు చేశారని తెలుస్తుంది.