తన పిల్లలను తానే చంపుకుందని ఇరవై ఏళ్ల జైలు
ఆస్ట్రేలియాకు చెందిన కాథ్లీన్ పాల్బిగ్ విషాద గాథ తెలుసుకుంటే కన్నీళ్లు రావడం ఖాయం
By: Tupaki Desk | 16 Dec 2023 1:30 AM GMTచేయని తప్పుకు శిక్ష అనుభవించింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఏళ్లు జైలు గోడలే ఆమెకు నేస్తాలయ్యాయి. కటకటాలేఆమె స్నేహితులయ్యాయి. అలా తన జీవితంలో అధిక భాగం కారాగారంలోనే గడిపింది. ఏ తప్పు చేయకున్నా శిక్ష బారిన పడింది. తన బిడ్డల్ని తానే చంపిందని సూటిపోటి మాటలకు వేదన చెందింది. సీరియల్ కిల్లర్ అంటూ హేళన చేసిన ఏమి చేయలేకపోయింది.
ఆస్ట్రేలియాకు చెందిన కాథ్లీన్ పాల్బిగ్ విషాద గాథ తెలుసుకుంటే కన్నీళ్లు రావడం ఖాయం. ఆమెకు నలుగురు పిల్లలు ఉండేవారు. వారందరు 1989-1999 మధ్య అనుకోకుండా చనిపోయారు. మొదటి ముగ్గురు చిన్నారులు ఏడాది వయసులోపు ప్రాణాలు కోల్పోయారు. దీన్ని వైద్య పరిభాషలో సడెన్ ఇన్సాంట్ డెత్ సిండ్రోమ్ అని పిలుస్తుంటారు.
ఇలా చనిపోవడానికి ప్రత్యేక కారణాలు ఏమీ ఉండవు. చిన్న కూతురు పుట్టిన 18 నెలల తరువాత కన్నుమూసింది. దీనిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోయినా పిల్లలు శ్వాస ఆడకుండా మరణించారనే వాదనలు వచ్చాయి. దీంతో కాథ్లీన్ వారిని చంపేసిందని కోర్టు అభిప్రాయపడింది. తన పిల్లలది సహజ మరణమని ఎంత చెప్పినా వినలేదు.
2003లో కోర్టు దోషిగా తేల్చడంతో ఆమెకు శిక్ష ఖరారైంది. ఆమెకు ఇరవై ఏళ్లు జైలు శిక్ష పడింది. జైలు గోడల్లోనే ఆమె జీవితం గడిచిపోయింది. తాను ఏ తప్పు చేయలేదని సుదీర్ఘ పోరాటం చేసింది. ఆమె పోరాటానికి ఆజ్యం పోసే ఆధారాలు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. జన్యుపరమైన లోపాల వల్ల పిల్లలు మరణించే విధానంపై లోతుగా అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు అందులో కాథ్లీన్ తప్పు ఏమీ లేదని నిర్ధారించారు. ఆమె తప్పు ఏమీ లేదని తేల్చారు.
సరికొత్త సాంకేతికత వల్ల వారి మరణంలో ఉన్న మిస్టరీ చేధించారు. తనకు జైలు జీవితాన్ని ఆపాదించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తనకు జరిగిన అన్యాయంపై కోర్టుకు వెళతానని స్పష్టం చేసింది. అనవసరంగా తన జీవితాన్ని జైలు పాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది.