Begin typing your search above and press return to search.

20ఏళ్ల తర్వాత కవలను కలిపిన టీవీ షో, టిక్ టాక్!

అయితే... ఒక టీవీ షో, టిక్ టాక్ వీడియోలు వీరిని కలిపాయి.. వీరిద్దరూ కవల పిల్లలని తెలుసుకున్నారు.. సుమారు 20ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా చెల్లెళ్ల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

By:  Tupaki Desk   |   27 Jan 2024 6:13 AM GMT
20ఏళ్ల తర్వాత కవలను కలిపిన టీవీ షో, టిక్ టాక్!
X

సాధారణంగా ట్విన్స్ కి సంబంధించిన సినిమాల్లో కారణాలు ఏవైనా.. పుట్టగానే కవల పిల్లలు విడిపోవడం, తర్వాతి కాలంలో ఒక సందర్భంలో వారిద్దరూ ఎదురుపడటం, ప్లాష్ బ్యాక్ తెరపైకి రావడం, తర్వాత కలుసుకోవడం, కథ సుఖాంతమవడం జరుగుతుంటుంది. నాగార్జున హీరోగా ఈవీవీ సత్యనారాయణ సినిమా "హలో బ్రదర్" ఈ కోవకు చెందిందే! అయితే.. తాజాగా జార్జియాలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది.

అవును... ఒక టీవీ షో ద్వారా సుమారు 20ఏళ్ల తర్వాత కలుసుకున్న ఇద్దరు ట్విన్ సిస్టర్ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. పుట్టగానే జరిగిన ఒక సంఘటన వల్ల విడిపోయిన వీరు వేరు వేరు ప్రాంతాల్లో ఉంటుండగా.. ఒకరికొకరు ఏమాత్రం పరిచయం లేదు! అయితే... ఒక టీవీ షో, టిక్ టాక్ వీడియోలు వీరిని కలిపాయి.. వీరిద్దరూ కవల పిల్లలని తెలుసుకున్నారు.. సుమారు 20ఏళ్ల తర్వాత కలుసుకున్న అక్కా చెల్లెళ్ల విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... 2002లో తూర్పు యూరోపియన్‌ దేశమైన జార్జియాలోని ఒక ఆసుపత్రిలో కవలలైన ఆడపిల్లలకు జన్మనిచ్చింది అజా శోని అనే మహిళ. అయితే... అలా ఇద్దరు పిల్లలకూ జన్మనిచ్చిన తర్వాత ఆమె కోమాలోకి వెళ్లిపోయింది. దీంతో ఆమె భర్త ఇద్దరు పిల్లలనూ వేరువేరు కుటుంబాలకు విక్రయించాడు. దీంతో.. తల్లి కడుపులో మాత్రమే కలిసున్న ఈ ఇద్దరూ... భూమిపైకి రాగానే విడిపోయినట్లయ్యింది.

అలా ఈ భూమిపైకి రాగానే విడిపోయిన ఈ కవలల్లో ఒకరిపేరు అనో సార్టానియా.. కగా, మరో అమ్మాయి పేరు అమి ఖ్విటియా! వీరిలో ఆనో జార్జియా రాజధాని నగరమైన బిలిసీలో పెరగగా... దీనికి కొన్ని మైళ్ల దూరంలో ఉన్న జగ్‌ డీడీ పట్టణంలో అమి పెరిగింది. వీరిని మనుషులు వేరు చేసినా.. ప్రకృతి కలపాలనుకున్నట్లుంది. ఇందులో భాగంగా పన్నెండేళ్ల వయసులో ఉండగా వారిద్దరి కలయికకు తొలి బీజం పడింది.

ఇందులో భాగంగా... తనకు ఎంతో ఇష్టమైన "జార్జియాస్‌ గాట్‌ టాలెంట్‌" టీవీ షోలో అమీ పాల్గొంది. ఈ సందర్భంగా... అచ్చంగా తన పోలికలతో ఉన్న మరో బాలిక చేస్తున్న నృత్యం చూసి విస్తుపోయింది. అయితే... ఆ అమ్మాయే తనకు తోడబుట్టిన సోదరి అని అమీకి తెలియదు. మరోపక్క... ప్రేక్షకులు మాత్రం.. ఈ ఇద్దరూ ఒకేలా భలే ఉన్నారే అనుకున్నారు. ఆ చర్చ అక్కడితో ముగిసింది.

ఈ క్రమంలో కొంత కాలానికి అనో కూడా ఓ టిక్‌ టాక్‌ వీడియో చూసింది. ఆ వీడియోలో అచ్చు తన పోలికలతో బాలిక ఉండటం గమనించింది. ఈ సందర్భంగా ఆలోచనలో పడిపోయింది. కట్ చేస్తే... సుమారు 20 ఏళ్లు విడిగా పెరిగిన తర్వాత... ఇటీవల బిలిసీ నగరంలోని రస్టావెలి వంతెనపై ఈ సిస్టర్స్ ఇద్దరూ కలుసుకొన్నారు. ఒకరినొకరు పరిచయం చేసుకున్నారు.

ఈ క్రమంలోనే తాము పుట్టిన వెంటనే విడిపోయిన తీరును తెలుసుకొని షాకయ్యారు.. దేవుడికి అసలు మనసులేదని కోపడ్డారు. కాసేపటికి కూల్ అయ్యి... మళ్లీ కలుసుకొన్నందుకు ఆనందంలో మునిగిపోయారు.. దేవుడికి థాంక్స్ చెప్పారు.