హర్షసాయి కేసులో ట్విస్ట్.. మరో కేసు..
వామ్మో.. ఆయన అంత పెద్ద మొత్తంలో ఎలా సాయం చేయగలుగుతున్నాడని చాలా మందిలోనూ అనుమానాలు ఉండేవి.
By: Tupaki Desk | 27 Sep 2024 6:07 AM GMTప్రముఖ యూట్యూబర్ హర్షసాయి.. ఎంతో మందికి కట్టలు కట్టలు డబ్బులు పంచుతూ పేదలకు అండగా నిలుస్తూ వచ్చాడు. ఎక్కడ పేదరికం కనిపిస్తే అక్కడకు వెళ్లి వారికి అంతో ఇంతో ఆర్థిక సహాయం అందించాడు. మరికొందరికి ఉపాధిని సమకూర్చాడు. చాలా మంది నిరుపేద జీవితాల్లో వెలుగులు నింపినట్లుగా మనం వీడియోలు చూస్తుంటాం. వామ్మో.. ఆయన అంత పెద్ద మొత్తంలో ఎలా సాయం చేయగలుగుతున్నాడని చాలా మందిలోనూ అనుమానాలు ఉండేవి.
అయితే.. అదంతా తెరముందు అనుకుంటే తెరవెనుక హర్షసాయి బాగోతాలు ఎన్నో ఉన్నాయని ఓ మహిళ ఆరోపిస్తోంది. యూట్యూబ్, సేవా ముసుగులో తనను లైంగికంగా వేధించినట్లుగా ఇప్పటికే ఓటీటీ బిగ్‌బాస్ ఫేమ్ హర్షసాయిపై కేసు పెట్టింది. తనపై లైంగిక దాడిచేసినట్లుగా ఆ యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదుతో పోలీసుల పలు ఆధారాలు సేకరించారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆ యువతిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఉదంతం కాస్త ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో.. అప్పటి నుంచి హర్షసాయి కనిపించకుండా పోయాడు. దీంతో పోలీసులు అతని కోసం నాలుగు బృందాలుగా విడిపోయి గాలిస్తున్నారు. అతని పేరెంట్స్ కూడా పరారీలోనే ఉన్నారని సమాచారం.
ఒక్క ఫిర్యాదు మేరకే హర్షసాయిని అరెస్టు చేద్దామనుకుంటున్న పోలీసులకు వన్ బై వన్ షాకింగ్ న్యూసులు ఎదురుపడుతున్నాయి. హర్షసాయిపై మరో కేసు నమోదైంది. ఇంతకుముందు కేసు పెట్టిన యువతే మరో ఫిర్యాదు పోలీసులకు అందించింది. తాను ఫిర్యాదు చేసినప్పటి నుంచి హర్షసాయి తనని టార్చర్ చేస్తున్నాడని, మెయిల్స్ ద్వారా మానసికంగా వేధిస్తున్నాడని ఈ రోజు మళ్లీ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కంప్లయింట్ కాపీకి ఆధారాలను జతపరిచింది.
ఫిర్యాదును బట్టి హర్షసాయిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. హర్షసాయి తనను ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి తన దగ్గర నుంచి రూ.2కోట్లు కాజేసినట్లుగా ముందుగా కేసు పెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఏపీలో దిశ యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న హర్షసాయిని అక్కడి ప్రభుత్వం తొలగించింది.