Begin typing your search above and press return to search.

ఏపీలో ట్విట్టర్ వార్ లేదా ?

ఏపీలో ఆ మధ్య దాకా ట్విట్టర్ వార్ ఒక రేంజిలో సాగేది. పొద్దు పొద్దున్నే అటూ ఇటూ కీలక నాయకులు ట్విట్టర్ ద్వారా మాటల యుద్ధానికి తెర లేపేవారు

By:  Tupaki Desk   |   21 April 2024 3:40 AM GMT
ఏపీలో ట్విట్టర్ వార్ లేదా ?
X

ఏపీలో ఆ మధ్య దాకా ట్విట్టర్ వార్ ఒక రేంజిలో సాగేది. పొద్దు పొద్దున్నే అటూ ఇటూ కీలక నాయకులు ట్విట్టర్ ద్వారా మాటల యుద్ధానికి తెర లేపేవారు. అంతే కాదు సెటైరికల్ గా కూడా హాట్ కామెంట్స్ చేసుకునేవారు. అందులో కూడా వ్యంగ్య కవిత్వం, క్యాచీ డైలాగ్స్, రైమింగ్ టైమింగ్ ఇలా చాలానే మసాలా ఉంటూ వచ్చేది.

ఈ ట్విట్టర్ వార్ ఒక్కోసారి పీక్స్ కి చేరి వారాల తరబడి కూడా సాగిన సందర్భాలు ఉన్నాయి. అంతే కాదు ట్విట్టర్ వార్ నుంచి రియల్ వార్ దాకా వచ్చేసి మీడియా ముందు నేతలు చేరి పరస్పరం సవాళ్ళు విసురుకున్న నేపథ్యం ఉండేది.

అప్పుడు ఏపీలో ఎన్నికలే లేవు. కానీ ఆనాడు ఈ తరహా సీన్లు చూసిన వారు నిజంగా ఎన్నికలు దగ్గర పడితే ట్విట్టర్ మోత ఏ రేంజిలో ఉంటుందో అని ఊహించుకునేవారు. కానీ సీన్ కట్ చేస్తే మరో పాతిక రోజుల్లో ఏపీలో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ ట్విట్టర్ లో మాత్రం నో సౌండ్ అన్నట్లుగానే సీన్ ఉంది.

దానికి కారణం ఏమిటి అన్నదే ఇపుడు అంతటా చర్చగా ఉంది. ఏపీలో ట్విట్టర్ కి పని చెప్పే నాయకులలో టీడీపీ నుంచి నారా లోకేష్ కనిపించేవారు. ఆయన ట్విట్టర్ కూత పెట్టిందంటే ప్రత్యర్ధి పక్షం మీద బాంబులే పేల్చేవారు. డైరెక్ట్ అటాక్ అన్నట్లుగా ఉండేది. ఇక వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ఉన్న అంబటి రాంబాబు విషయం తీసుకుంటే సరేసరి.

ఆయన ట్విట్టర్ లో వేసే పంచులు సెటైర్లు మంట పెట్టేలా ఉండేవి. అవతల వారికీ పూర్తిగా అర్ధం అయి ఎక్కడో కాలినట్లుగా అనిపించేది. మరో కీలక నేత వైసీపీలో ఉన్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో అయితే చంద్రబాబుని పట్టుకుని చీల్చి చెండాడే వారు. ఆయన బాబు మీద పెట్టిన ట్వీట్లు బహుశా ఎవరూ పెట్టి ఉండరు.

అంతే కాదు టీడీపీ నేతలకు వైసీపీ నుంచి ఎక్కువగా సవాళ్ళు కూడా అంబటి విజయసాయిరెడ్డి వంటి వారి నుంచే వచ్చేవి. మరి ఇపుడు ఏమైంది. ట్విట్టర్ పిట్టేందుకు సైలెంట్ అయింది అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. మరి ఇపుడు చూస్తే ట్విట్టర్ ని ఆయుధంగా వాడేవారు ఇపుడు పెద్దగా సౌండ్ చేయడం లేదు.

ఎన్నికల వేడి ఎక్కువగా ఉంది కానీ అదే టైంలో ఈ నేతలు అంతా ఫుల్ బిజీ అయిపోయారు అని అంటున్నారు. సత్తెనపల్లి నుంచి మంత్రి అంబటి రాంబాబు పోటీ చేస్తున్నారు. అలాగే మంగళగిరి నుంచి నార లోకేష్ పోటీలో ఉన్నారు. అసలు పోటీ చేయరు అనుకున్న విజయసాయిరెడ్డి అనూహ్యంగా నెల్లూరు బరిలో ఉన్నారు.

దాంతో ఒక వైపు ఎన్నికల ప్రచారం మరో వైపు వ్యూహాలు ఇవన్నె చక్కబెట్టుకుంటూ వస్తున్న ఈ నేతలకు తీరిక లేకనే ట్విట్టర్ ని హ్యాండిల్ చేయడం లేదు అని అనుకోవాల్సి వస్తోంది. మరో వైపు చూస్తే ట్విట్టర్ వార్ అన్నది సినిమా ముందు ట్రైలర్ మాత్రమే అని అంటున్నారు. అసలైన సినిమా మొదలయ్యాక ఎవరూ ట్రైలర్ చూడరు.

ఇపుడు కూడా అసలైన వార్ ఎన్నికల్లో సాగుతోంది.ఆ రియల్ వార్ లో ముఖాముఖీ తేల్చుకుంటున్నారు. దాంతో ఇపుడు ట్విట్టర్ గోల ఎందుకు అని కూడా అనుకుని ఉండొచ్చు అంటున్నారు. ఒకవేళ ట్విట్టర్ కి పని చెప్పినా ఆ రియాక్షన్స్ కూడా అంతగా ఉండవు, అది కూడా ఈ కీలక సమయంలో పెద్దగా వర్కౌట్ కాదు అని భావించి ఉండవచ్చు అంటున్నారు. ఏది ఏమైనా కీలక నేతల ట్విట్టర్లు మాత్రం మూగబోయాయి. దాంతో ట్విట్టర్ వార్ ని ఎంజాయ్ చేసేవారు మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్నారు. అయితే ఇది ఎంతసేపూ కాదని అంటున్నారు. మే 13న ఎన్నికలు పూర్తి కావడంతోనే మళ్ళీ అంతా ట్విట్టర్ తో సరికొత్త వార్ ని చూపిస్తారు అని అంటున్నారు.