ట్విట్టర్ వార్: టీడీపీ - వైసీపీ... మధ్యలో 'పచ్చసొన'!
ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎగ్ ఫఫ్స్ పై రూ.3.6 కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియాకు చెందిన జర్నలిస్ట్ ఎక్స్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది.
By: Tupaki Desk | 21 Aug 2024 4:58 PM GMTగత ప్రభుత్వ హయాంలో గుడ్డు పురాణం చెప్పి "గుడ్డు మంత్రి" గా వైసీపీ నేత ఒకరు నెట్టింట ట్రోలర్స్ కి బంగారు గుడ్డు పెట్టే బాతులా మారిన సంగతి తెలిసిందే! దీంతో.. ఒకానొక టైమ్ లో ఆయనను నెటిజన్లు ఓ ఆటాడేసుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎగ్ ఫఫ్స్ పై రూ.3.6 కోట్లు ఖర్చు చేశారంటూ ఓ జాతీయ మీడియాకు చెందిన జర్నలిస్ట్ ఎక్స్ లో చేసిన పోస్ట్ ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది.
అవును... గత ప్రభుత్వ హయాంలో ఎగ్ పఫ్స్ పై రూ.3.6 కోట్లు ఖర్చు చేశారని.. ఏపీ సీఎంవో కార్యాలయం గత 5 సంవత్సరాల్లో రూ.3.6 కోట్లు అంటే... సంవత్సరానికి సగటున రూ.72 లక్షలు అంటే.. రోజువారీ వినియోగం 993 ఎగ్ పఫ్స్ కి సమానం.. మొత్తంగా చూస్తే 18 లక్షల ఎగ్ పఫ్స్... అంటూ ఓ ట్వీట్ నెట్టింట దర్శనమిచ్చింది. దీంతో... ఈ విషయం ఒక్కసారిగా వైరల్ గా మారింది.
దీనిపై స్పందించిన వైసీపీ... వాస్తవాలను ధృవీకరించకుండా, విశ్వసనీయ మూలాలను ఉదహరించకుండా ఒక జర్నలిస్ట్ ఇలాంటి నిరాధారమైన పుకార్లకు పడిపోవడం నిజంగా నిరాశపరించిందని.. సోషల్ మీడియా నుంచి యాదృచ్ఛిక సమాచారాన్ని తీసుకొని వాటిని వార్తలుగా మార్చడం జర్నలిజానికి అపచారమని.. నిజానికంటే సంచలనాలకే ప్రాధాన్యత ఇవ్వడం విచారకరమని తెలిపింది.
దీనిపై స్పందించిన టీడీపీ... ఎగ్ పఫ్ పేరు చెప్పి వైసీపీని ఓ ఆటాడెసుకుంటుంది. ఇందులో భాగంగా... ప్రతి ఒక్క వాస్తవం ఇప్పుడు పెంకుల నుంచి బయటకు రావడం మొదలైంది.. ఇవి గత ప్రభుత్వ దుశ్చర్యలు వెలువడటానికి ప్రారంభం మాత్రమే.. అప్పుడే బయపడకండి వైసీపీ అని చెబుతూ... వై.ఎస్.ఆర్.సీ.పీ.లో వై అంటే వోక్ (పచ్చ సొన) అవ్వొచ్చు! అంటూ తగులుకుంది!
దీంతో... ఇకపై వైసీపీని ఈ ఎగ్ పఫ్ పేరు చెప్పి, ఆ పచ్చ సొన పేరు చెప్పి టీడీపీ సోషల్ మీడియా ఓ ఆటాడుకునే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ రేంజ్ లో టీడీపీ నుంచి ట్రోలింగ్ స్టార్ట్ అయ్యేసరికి వైసీపీ స్పందించింది. సూపర్ సిక్స్ పథకాల అమలుపై నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే ఈ ‘గుడ్డు’ పన్నాగాలు, నిరాధారమైన ఆరోపణలు, అసత్య ప్రచారాలు అంటూ కామెంట్ చేసింది.
ఇదే సమయంలో.. ఈ 'పచ్చ సొన' తో నిండిన పరధ్యానంలో సమయాన్ని వృథాచేయడం మాని.. మీరు అధికారంలోకి రావడం కోసం చేసిన వాగ్ధానాలను అమలు చేసే పనిపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి అని పేర్కొంది. దీంతో... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో టీడీపీ - వైసీపీ మధ్య "పచ్చ సొన" పంచాయతీ నడుస్తోందంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు!