Begin typing your search above and press return to search.

పోటీ లేకుండానే తెలంగాణలో టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు.. లక్కీ చాన్స్

ఆ ఇద్దరూ టీడీపీలోకి గత ఏడాది నాటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది.

By:  Tupaki Desk   |   7 Oct 2024 3:11 PM GMT
పోటీ లేకుండానే తెలంగాణలో టీడీపీకి ఇద్దరు ఎమ్మెల్యేలు.. లక్కీ చాన్స్
X

ఉమ్మడి ఏపీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గా విడిపోయాక తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏమిటా? అని చాలామంది సందేహించారు. 2014లో ఏపీలో అధికారం చేపట్టి.. తెలంగాణ ప్రభావవంతమైన పార్టీగా మిగిలిన టీడీపీ.. 2018లో ముందస్తు ఎన్నికల నాటికి ఇంకాస్త దూకుడుగా కనిపించింది. ఏ కాంగ్రెస్ ను అయితే వ్యతిరేకిస్తూ పుట్టిందో అదే కాంగ్రెస్ తో జట్టు కట్టి, కమ్యూనిస్టులనూ కలుపుకొని తెలంగాణలో మహా కూటమిగా ఏర్పడి పోటీ చేసింది. కొన్ని ఎమ్మెల్యే స్థానాలనూ గెలిచింది. కానీ, వారు తర్వాత అప్పటి అధికార బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. 2018 తెలంగాణ ఎన్నికల సమయానికి ఏపీలో టీడీపీ అధికారంలో ఉండడంతో వారికి పెద్దగా రాజకీయంగా ఇబ్బంది కలగలేదు.

ఈసారి పోటీకి దూరం 2019 ఎన్నికల్లో ఏపీలో అధికారం కోల్పోయిన టీడీపీని వరుస కష్టాలు వెంటాడాయి. టీడీపీకి ఉమ్మడి ఏపీ చరిత్రలో కూడా ఎన్నడూ లేనంతగా ఆ ఎన్నికల్లో కేవలం 23 స్థానాలే దక్కాయి. దీంతోపాటు వైఎస్ జగన్ ప్రభుత్వ దాడిని తట్టుకోవడమూ కష్టమైంది. స్థానిక ఎన్నికల్లో దారుణ పరాజయాలు మరింత కుంగదీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో గత ఏడాది జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉంది. పరోక్షంగా కాంగ్రెస్ కు మేలు చేసేందుకే ఈ నిర్ణయం అని విమర్శలు వచ్చినా.. అవేవీ నిలవలేదు.

ఆ ఇద్దరూ టీడీపీలోకి గత ఏడాది నాటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దీంతో బీఆర్ఎస్ కు కష్ట కాలం మొదలైంది. ఇప్పటికే 10 మంది శాసన సభ్యులు కారు పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారు. మరికొందరూ ఇదే మార్గంలో ఉన్నారని చెబుతున్నా.. జంపింగ్ లకు తాత్కాలిక విరామం లభించింది. కాగా, బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ పరిధికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం అధికార కాంగ్రెస్ లోకి కాకుండా టీడీపీలోకి వెళ్తారనే టాక్ నడుస్తోంది.

వీరిద్దరూ అత్యంత సమీప బంధువులు కావడం గమనార్హం. అంతేగాక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని వ్యతిరేకించేవారు. అయితే, పలు ఆరోపణల నేపథ్యంలో రేవంత్ సీఎం అయ్యాక వీరికి ఇబ్బందులు తప్పవనేది అర్థమైంది. ఇప్పుడు స్తబ్ధుగా ఉన్నా.. ప్రభుత్వం మళ్లీ ఎప్పుడైనా విరుచుకుపడే ప్రమాదం ఉంది. దీంతోనే సమీప బంధువులైన ఇద్దరు ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్తున్నారని చెబుతున్నారు. ఎందుకంటే.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ద్వారా రక్షణ పొందాలనేది వీరి వ్యూహం అని పేర్కొంటున్నారు. ఇప్పటికే టీడీపీలో చేరికపై ఆ ఎమ్మెల్యేల్లో ఒకరు సానుకూల సంకేతాలు పంపారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం..