Begin typing your search above and press return to search.

అవును.. ఆ ఊర్లో ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు

మీరు చదివింది కరెక్టే. ఇద్దరు అబ్బాయిలకు ఊరంతా కలిసి పెళ్లి చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   3 Sep 2023 6:37 AM GMT
అవును.. ఆ ఊర్లో ఇద్దరు అబ్బాయిలకు పెళ్లి చేశారు
X

మీరు చదివింది కరెక్టే. ఇద్దరు అబ్బాయిలకు ఊరంతా కలిసి పెళ్లి చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. అయితే.. అదంతా ఊరు కోసం కావటం మరో విశేషం. ఊరేంటి? అబ్బాయిలకు పెళ్లి చేయటం ఏమిటి? అసలేమైనా లింకు ఉందా? అంటే.. ఉందనే చెప్పాలి. ఇంతకూ అలాంటి సిత్రం ఎందుకు చోటు చేసుకుందంటే.. ఈ ఏడాది వానలు సరిగా లేకపోవటంతోనే.

వివరంగా చెప్పాల్సిన వస్తే.. ఈ ఏడాది వానలు తక్కువగా పడటం తెలిసిందే. వర్షాకాలంలో జోరున పడాల్సిన వానలు ఈసారి ముఖం చాటేయటంతో ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న పరిస్థితి. కర్ణాటకలోనూ ఇలాంటి తీరే నెలకొంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలోని చింతామణి తాలూకాలోనిహిరేకట్టిగానహళ్లి గ్రామస్తులకు ఒక నమ్మకం ఉంది.

అబ్బాయికి.. అబ్బాయికి పెళ్లి చేస్తే వర్షాలు పడతాయన్నది నమ్మకం. అందుకే.. ఆ గ్రామానికి చెందిన శివానంద అనే అబ్బాయికి.. నాగప్ప అనే మరో అబ్బాయితో కలిసి పెళ్లి చేశారు. ఇందుకు నాగప్పను వధువుగా అలంకరించి పెళ్లి చేయించారు. సాధారణంగా వర్షాలు పడనప్పుడు.. కప్పలకు పెళ్లి చేస్తే వానలు పడతాయన్నది ఒక నమ్మకం.

అయితే.. ఈ గ్రామంలో మాత్రం రోటీన్ కు భిన్నమైన సెంటిమెంట్ ఉంది. దీంతో.. ఇద్దరు బాలురుకి పెళ్లిని వేడుకలా జరిపించారు. దీనికి.. ఊరు మొత్తం హాజరైంది. ఈసారి వానలు లేకపోవటంతో కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లోని రైతులు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు. వేసిన పంటలు ఎండిపోవటం.. పశువులకు గ్రాసం.. నీళ్ల కరవుతో ఇబ్బందులకు గురవుతున్నారు. తాగునీటికి కూడా ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారు. ఈ కారణంతో ఈ తరహా పెళ్లి చేస్తే వరుణుడు ప్రసన్నమై.. వానలు విస్తారంగా కురిపిస్తారన్న నమ్మకంతో ఈ పెళ్లిని చేయించినట్లుగా చెబుతున్నారు.