Begin typing your search above and press return to search.

మాదాపూర్ లో 2 భారీ భవనాల్ని సెకన్ల వ్యవధిలో కూల్చేశారు

నాలుగైదు అంతస్తులు ఉన్న రెండు భారీ భవనాల్ని ఐటీ కేంద్రానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మాదాపూర్ లో కూల్చేసిన వైనం ఆసక్తికరంగా మారింది.

By:  Tupaki Desk   |   24 Sep 2023 5:00 AM GMT
మాదాపూర్ లో 2 భారీ భవనాల్ని సెకన్ల వ్యవధిలో కూల్చేశారు
X

నాలుగైదు అంతస్తులు ఉన్న రెండు భారీ భవనాల్ని ఐటీ కేంద్రానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే మాదాపూర్ లో కూల్చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ముందస్తుగా ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా.. ప్రైవేటు సంస్థకు చెందిన రెండు భారీ బిల్డింగ్ లను శనివారం సాయంత్రం వేళలో సెకన్ల వ్యవధిలో కూల్చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. మాదాపూర్ లోని రహేజా మైండ్ స్పేస్ లోని రెండు భారీ భవనాల్ని కూల్చేవారు.

రహేజా మైండ్ స్పేస్ లోని 7-8 బ్లాక్ లోని నాలుగు అంతస్తుల భవనాలు రెండు ఉన్నాయి. వీటిని అత్యాధునిక టెక్నాలజీతో సెకన్ల వ్యవధిలో నేలమట్టం చేసిన వైనం.. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ గ్రూపుల్లోనూ వైరల్ గా మారాయి. ఈ రెండు భవనాల స్థానంలో రానున్న మూడేళ్ల వ్యవధిలో భారీ బహుళ అంతస్తుల టవర్లు నిర్మిస్తారని చెబుతున్నారు.

అయితే.. ఈ నిర్మాణాల్ని ఎందుకు కూల్చారు? దానికి అనుమతులు ఎవరు ఇచ్చారు? ఈ భవనాల యజమానులు ఎవరు? వాటి స్థానంలో నిర్మించే భవనాలకు సంబంధించిన వివరాల్ని అటుజీహెచ్ఎంసీ కానీ ఇటు పోలీసు.. ఫైర్ డిపార్టుమెంట్ కు చెందిన అధికారులు ఎవరూ వెల్లడించకపోవటం గమనార్హం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. తాజాగా కూల్చేసినరెండు భవనాల స్థానంలో దాదాపు 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న రెండు టవర్లు ఏర్పాటు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా కూల్చేసిన భారీ భవనాల కారణంగా.. చుట్టుపక్కల ఉన్న భవనాలకు ఎలాంటి నష్టం వాటిల్ల కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. నిర్దేశించిన సమయంలో కేవలం నాలుగైదు క్షణాల్లోనే నాలుగు అంతస్తుల రెండు భవనాలు పేకమేడల్లా కూల్చేసిన వైనం అందరిని ఆకర్షించేలా చేసింది. సాంకేతిక లోపం కారణంగా వీటిని కూల్చేసినట్లు చెబుతున్నా.. వాటి స్థానంలో భారీ భవనాల్ని నిర్మించే క్రమంలోనూ కూల్చివేతలు చేపట్టినట్లుగా తెలుస్తోంది.