Begin typing your search above and press return to search.

ఈ ఇద్దరు డీజీపీలు గుంటూరులో స్కూల్ ఫ్రెండ్స్!

వివరాళ్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ద్వారకా తిరుమలరావు నియమితులవ్వగా... ఆయన స్నేహితుడు శ్రీనివాస్ గత ఏడాది కాలంగా పుదుచ్చేరి డీజీపీగా పనిచేస్తున్నారు.

By:  Tupaki Desk   |   23 Jun 2024 5:11 AM GMT
ఈ ఇద్దరు డీజీపీలు గుంటూరులో స్కూల్  ఫ్రెండ్స్!
X

చిన్ననాటి స్నేహితులు పెద్దయ్యాక కలుసుకోవడం ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. అందుకే ఇటీవల కాలంలో హైస్కూల్ మెట్స్, కాలేజ్ మెట్స్ ఇరవై, పాతిక ఏళ్ల తర్వాత కలుసుకుని ఆనాటి జ్ఞాపకాలను తలచుకుని.. గోల్డెన్ డేస్ మిస్సయ్యినట్లు చెప్పుకుంటుంటారు. ఈ సమయంలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు స్కూల్ మేట్స్ డీజీపీలు అయ్యిన అరుదైన ఘటన తాజాగా తెరపైకి వచ్చింది.

అవును... గుంటూరుకు చెందిన ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఇద్దరూ ఇప్పుడు ఓకే ర్యాంక్ లో పనిచేస్తుండటం.. అది కూడా పోలీస్ శాఖలో రాష్ట్ర స్థాయిలో అదే అత్యున్నత హోదా కావడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది! ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారులూ.. ద్వారకా తిరుమలరావు, శ్రీనివాస్ లు కావడం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా ద్వారకా తిరుమలరావు నియమితులవ్వగా... ఆయన స్నేహితుడు శ్రీనివాస్ గత ఏడాది కాలంగా పుదుచ్చేరి డీజీపీగా పనిచేస్తున్నారు. వీరిద్దరూ గుంటూరులోని కృష్ణానగర్ ప్రాథమిక పాఠశాలలో కలిసి చదువుకున్నారు! ఇదే క్రమంలో... పాటిబండ్ల సీతారామయ్య హైస్కూల్ లో కొనసాగారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.

ఈ నేపథ్యంలో... ద్వారకా తిరుమలరావు విద్యాభ్యాసం పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి 1989లో ఆంధ్రప్రదేశ్ కేడర్ కు ఎంపికయ్యారు. ఈ సమయంలో ఉమ్మడి రాష్ట్రంలోనూ, విభజిత ఏపీలోనూ వివిధ ర్యాంకుల్లో పనిచేసి.. ఇటీవల ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. అంతక ముందు విజయవాడ పోలీస్ కమిషనర్ గానూ పనిచేశారు!

ఇక శ్రీనివాస్ విషయానికొస్తే.. ఆయన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి 1990లో జమ్మూ కాశ్మీర్ కేడర్ కు ఎంపికయ్యారు. ఈ క్రమంలోనే గత ఏడాది పాండిచ్చేరి డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. దీంతో... ఈ విషయం తెలిసినవారంతా ఇది విని ఆశ్చర్యపోతున్నారు.. అత్యంత అరుదైన ఘటనల్లో ఇది ఒకటిగా చెబుతున్నారు. త్వరలో వారి హైస్కూల్ లో ఇద్దరు అధికారులకూ సన్మాన కార్యక్రమం నిర్వహించాలని స్నేహితులు ప్లాన్ చేస్తున్నారని సమాచారం!